రెండు నెలల ముడిపట్టు రాయితీ జమ
వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితం
- పెండింగ్ బకాయిలు చెల్లించేవరకు దీక్షలు ఆపేదిలేదంటున్న వైఎస్సార్‌సీపీ
ధర్మవరం: వైఎస్సార్‌సీపీ పోరాటాలతో ప్రభుత్వం దిగివచ్చింది. చేనేతలకు అందాల్సిన బకాయిలో రెండు నెలల మొత్తాన్ని వారి ఖాతాల్లోకి గురువారం జమ చేసింది. అయితే మొత్తం 19 నెలలు బకాయిలు ఉంటే కేవలం రెండు నెలలకు సంబంధించినవి మాత్రమే జమచేస్తారా..? చేనేతలకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు అందేవరకు దీక్షలు ఆపేదిలేదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
చేనేతల జీవితాలతో చెలగాటం :
ముడిపట్టు రాయితీ పథకం అస్తవ్యస్తంపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు ఉద్యమిస్తోంది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ ధర్మవరం సమన్వయకర్త గతేడాది జూలై నెలలోనూ ఈ ఏడాది జనవరిలోనూ , ఆగష్టు నెలలో మరోసారి పట్టణంలో సంతకాల సేకరణ చేపట్టి, సెరిఫెడ్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఆగస్టు నెలలో చేపట్టిన ధర్నాలో నెల రోజులు గడువు ఇచ్చి.. నెలలోపు చేనేతలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోతే రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అయితే ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో గత సోమవరాం నుంచి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ దీక్షలకు చేనేత కార్మికుల నుంచి విశేష స్పందన వస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే ముడిపట్టు రాయితీ బకాయి రెండు నెలలకు సంబంధించిన మొత్తం రూ.2వేలు చేనేతల ఖాతాల్లోకి జమ చేశారు. వాస్తవానికి చేనేత ముడిపట్టు రాయితీ మొత్తం 21 నెలలకు గాను ఒక్కో చేనేత కార్మికుడికి రూ.14,800 బకాయి ఉంది. ఈ బకాయిల్లో కేవలం రూ.2వేలు మాత్రమే జమ చేయడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
ఆందోళన చేస్తేనే బకాయిలు చెల్లిస్తారా...?
చేనేతలకు ప్రతినెలా ముడిపట్టు రాయితీని చెల్లించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలు ఆందోళన చేసినప్పుడు మాత్రమే రాయితీ ఇస్తున్నారు. గతంలో రెండు దఫాలు ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా అదే రీతిలో హడావుడిగా రెండునెలల బకాయిలను చేనేతలకు ఇచ్చారు. వాస్తవానికి ముడిపట్టు రాయితీకి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఇతర పనులకు వినియోగించుకుంటున్నారా..? లేక అధికార పార్టీ నాయకులు ఏమైనా కాజేశారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. స్వయానా ముఖ్యమంత్రి ధర్మవరంలో చేనేతలకు నిధులు మంజూరు చేసి, చెక్కును అందజేశారు. ఆ నిధులు నిజంగా మంజూరు చేశారా..? ఆ సందర్భానికి చేనేతల బకాయిల విషయం దాటవేసేందుకు నకిలీ చెక్కులను ఇచ్చి మభ్యపెట్టారా.? అని చేనేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
21 నెలలుగా బకాయి అందలేదు
మాకు మొత్తం 21 నెలల ముడిపట్టు రాయితీ ఇవ్వాల్సి ఉంది. రెండు నెలల రాయితీ మాత్రమే గురువారం జమ చేశారు. పెరిగిన ముడిపట్టు ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఇవ్వాల్సిన రాయితీ మొత్తం ఇచ్చి ఉంటే కొంత అయినా ఊరట కలిగేది. వైఎస్సార్‌సీపీ వాళ్లు ధర్నా చేసింటేనే ఆ రెండు నెలల రాయితీ కూడా ఇచ్చారని తెలుస్తోంది.
- శివకుమార్, చేనేత కార్మికుడు, పీఆర్‌టీ వీధి
చేనేతరంగాన్ని టీడీపీ భ్రష్టుపట్టిస్తోంది
ఈ ప్రభుత్వం చేనేతల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. జీఎస్టీ భారంతో ఇప్పటికే చేనేత రంగం ఇబ్బందులు పడుతోంది. వారికి అండగా ఉండాల్సిందిపోయి ఇబ్బందులకు గురిచేస్తోంది. అందుకే చేనేతల తరఫున పోరాడుతున్నాం. ధర్నాలు చేస్తే ఒక నెల, రెండునెలలు రాయితీ విడుదల చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. బకాయి చెల్లించేంత వరకు దీక్ష ఆపేదిలేదు.
– కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ధర్మవరం