పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో సోమవారం ఉదయం భారీ దోపిడీ జరిగింది. పులివెందులలోని ఏటీఎంలో డబ్బులు పెడుతున్న వెళ్తున్న ఉద్యోగులపై దోపిడి దొంగలు దాడి చేశారు. వారి నుంచి భారీగా డబ్బును దోచుకుపోయారు. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళుతున్న సిబ్బంది ఇద్దరిపై గుర్తుతెలియని వ్యక్తులు కళ్లలో కారం చల్లి రూ. 53లక్షల నగదు దోచుకెళ్లారు. టాటా కన్సల్టెన్సీకి చెందిన విక్రమ్, శీను అనే యువకులు రెండు ఏటీఎంలలో పెట్టేందుకు నగదు బైక్‌పై తీసుకెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. కళ్లలో కారం పొడిని చల్లి, రాళ్లతో దాడిచేసి వారి వద్ద ఉన్న రూ.53 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన పులివెందులలోని ఎస్‌బీఐ పక్కన ఉన్న రోడ్డులో జరిగింది.
ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు పెట్టేందుకు వారు వెళుతుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారి కళ్లలో కారంపొడిని చల్లారు. వారు కింద పడిపోవడంతో రాళ్లతో కొట్టి బ్యాగులో ఉన్న నగదును దోచుకెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విక్రమ్, శీనును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ద్విచక్రవాహనంపై అంత భారీ మొత్తం తీసుకెళ్లడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కంట్లో కారం కొట్టి.. భారీ దోపిడీ!
Published Mon, Apr 18 2016 7:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement
Advertisement