ఆకట్టుకున్న కళా ఉత్సవాలు
Published Thu, Sep 8 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
గద్వాల : ప్రతిఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని జిల్లా ఉప విద్యాధికారి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బాలభవన్‌లో నిర్వహించిన డివిజన్‌స్థాయి కళా ఉత్సవాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని పలు రంగాల్లో నైపుణ్యం చాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతి కళాకారుడు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. డివిజన్ స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇందులో జానపద నృత్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల శిరీష బృందం, గిరిజన నృత్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అర్చన బృందం విద్యార్థులు సత్తా చాటారు. దేశభక్తి నృత్యంలో అమరచింతకు చెందిన చంద్రిక విద్యార్థులు, శాస్త్రీయ సంగీతంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల రఘువర్ధన్ గెలుపొందారు. నాటకంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు శివ, దీప్తిల బృందం, డ్రాయింగ్‌లో బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి రోహన్ ప్రతిభచాటాడు. వీరు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని బాలభవన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ గౌరవాధ్యక్షుడు రాజగోపాలాచారి, మురళీకృష్ణ, రామిరెడ్డి, కన్నమ్మ, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement