ముంబై: దేశీయంగా అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ (ఉద్యోగాలు కల్పించే సంస్థ) బ్రాండ్‌గా టాటా పవర్ కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ వరుసగా రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. మానవ వనరుల సర్వీసుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తమ వార్షిక నివేదిక ‘రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2023‘లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఆర్థిక స్థితి, మంచి పేరు, కెరియర్‌లో పురోగమించేందుకు అవకాశాలు కల్పించడం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా రాండ్‌స్టాడ్ ర్యాంకులు ఇచ్చింది. దీని ప్రకారం 2022లో 9వ స్థానంలో ఉన్న టాటా పవర్ తాజాగా నంబర్ వన్ స్థానానికి చేరింది. నివేదిక ప్రకారం ఉద్యోగులు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా ఆటోమోటివ్‌కు (77 శాతం) ఓటేశారు. ఐటీ, ఐటీఈఎస్, టెలికం (76 శాతం) .. ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్ (75 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు..
- టాప్ 10 కంపెనీల్లో నాలుగో స్థానంలో టీసీఎస్.. ఆ తర్వాత వరుసగా మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయ స్టార్టప్ ఎంప్లాయర్‌గా బిగ్ బాస్కెట్ నిల్చింది.
- ఎంప్లాయర్‌ను ఎంచుకునేటప్పుడు ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం, కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు, ఆకర్షణీయమైన జీతభత్యాలకు ఉద్యోగార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
- అదనపు ఆదాయం కోసం వేరే అసైన్‌మెంట్లు లేదా అదనంగా మరో ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించే కంపెనీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని 91 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు.
- సిబ్బంది ఆధారంగానే వ్యాపారంలో విజయం సాధించగలమని, పెట్టుబడి ఒక్కటే సరిపోదని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తిస్తున్నాయి. అలాగే, ఉద్యోగులు కూడా తాము ఏ బ్రాండుతో కలిసి పని చేయాలి, దీర్ఘకాలికంగా పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఎలా ఉంటుంది అనే అంశాలపై మరింతగా ఆలోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment