అసలు దొంగ అత్తే | aunty is real theaf | Sakshi
Sakshi News home page

అసలు దొంగ అత్తే

Published Sat, Jul 30 2016 7:48 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

నిందితుల అరెస్ట్‌ చూపుతున్న డీఎస్పీ రాంరెడ్డి

నిందితుల అరెస్ట్‌ చూపుతున్న డీఎస్పీ రాంరెడ్డి

♦ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
♦ వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంరెడ్డి

ఎర్రుపాలెం : ఇంటి దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బంగారు ఆవరణాలను రికవరీ చేయడంతోపాటు దొంగను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైరా డీఎస్పీ రాంరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. రాజులదేవరపాడుకు చెందిన వేమిరెడ్డి పెద్ద శివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 4న తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాడు. ఇంటికి కాపలాగా తక్కెళ్లపాడుకు చెందిన తన అత్త శీలం ఇందిరను ఉంచి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఇందిర, తనకు పరిచయం ఉన్న తక్కెళ్లపాడుకు చెందిన ఇనపనూరి రామారావుతో కలిసి ఇంట్లో బీరువాలోని రూ.2.73లక్షల విలువైన 91 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.

ఈ క్రమంలో తిరుపతి నుంచి తిరిగొచ్చిన శివారెడ్డి భార్య ఈనెల 6న చోరీ విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈనెల 7నడీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని.. దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణ మొదట్లో ఇంటికి ఎవరో ఓ వ్యక్తి వచ్చి వెళ్లాడని, తాను ఆ సమయంలో ఇంటి వెనుక గేదెలకు గడ్డి వేసేందుకు వెళ్లానని, అప్పుడే చోరీ  జరిగి ఉంటుందని నిందితురాలు ఇందిర కథ అల్లింది. ఈ మేరకు డీఎస్పీ రాంరెడ్డి సూచనలతో సీఐ నూనె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లతో విచారణ చేపట్టారు.

దీంతో శివారెడ్డి అత్త ఇందిర తన స్నేహితుడు రామారావుతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. శుక్రవారం నిందితులు ఇందిర, రామారావు బంగారు ఆభరణాలు విక్రయించేందుకు విజయవాడ వెళ్లే నిమిత్తం ఎర్రుపాలెం రింగ్‌ సెంటర్‌లో బస్సు కోసం నిరీక్షిస్తుండగా.. విశ్వసనీయ సమచారం మేరకు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఎన్‌.గౌతమ్, ట్రెయినీ ఎస్సై ఆంజనేయులు, ఐడీ కానిస్టేబుల్‌ నారాయణ వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మధిర కోర్టుకు రిమాండ్‌ చేశారు. కాగా, కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులకు డీఎస్పీ నగదు బహుమతి అందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement