కంకిపాడు: పట్టపగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అత్తాకోడళ్లను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.కాశీవిశ్వనాథ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కంకిపాడు బస్టాండ్ సెంటరులోని ఓ ఇంట్లో పచ్చిపాల రత్న రామకోటేశ్వరరావు కుటుంబం ఉంటోంది. ఈనెల 23న ఉదయం రత్న రామకోటేశ్వరరావు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంటి వెలుపల ఓ బాలింత రోజుల వయస్సు బిడ్డకు పాలిస్తూ కనిపించింది.
తాళం తెరిచి ఇంట్లోకి వెళ్లిన రామకోటేశ్వరరావు ఇంట్లో ఫ్యాన్లు, టీవీ ఆన్‌లో ఉండడం, బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, ఓ మహిళ ఇంట్లో వెతుకులాడుతుండడం చూసి నిర్ఘాంతపోయాడు. దీంతో ఇరుగుపొరుగువారిని పిలిచాడు. స్థానికులు ఇంట్లోని మహిళతోపాటు, బయట ఉన్న బాలింతనూ పట్టుకుని పోలీసులు అప్పగించారు. ఫిర్యాదుపై చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
చోరీ చేసి.. డైపర్‌లో దాచి..
ఈ ఇద్దరు మహిళలూ విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, బోయపాటి సాధ్వితని, వీరిద్దరూ వరుసకు అత్తాకోడళ్లని, పాతనేరస్తులని పోలీసులు గుర్తించారు. గతేడాది నవంబరులో సీసీఎస్ పోలీసులు పలు చోరీ కేసుల్లో ఈ ఇద్దరినీ అరెస్టు చేశారని, ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యారని తేల్చారు. అప్పట్లో అరెస్టయ్యేనాటికి గర్భిణిగా ఉన్న సాధ్విత ఈ నెల 8న ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రోజుల వయస్సు ఉన్న బిడ్డతో సాధ్విత, ధనలక్ష్మి ఇద్దరూ మాచవరం నుంచి ఆటోలో కంకిపాడుకు వచ్చి తాళం వేసి ఉన్న ఇల్లును ఎంచుకుని మధ్యాహ్నం సమయంలో చొరబడ్డారు.
బీరువాలో ఉన్న చెవి బుట్టలు, ఉంగరం, మేటీలు, వెండి వస్తువులు, రూ.6 వేలు నగదు అపహరించారు. చోరీ సొత్తును బిడ్డకు వేసిన డైపర్‌లో దాచారు. సాధ్విత ఇంటి బయటకు వచ్చేసి బిడ్డకు పాలిస్తుండగా, ధనలక్ష్మి లోపల ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకుతున్న సమయంలో ఇంటి యజమాని రావడంతో నిందితులిద్దరూ పట్టుబడ్డారు. వీరి వద్ద చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. వీరిద్దరిపైనా విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో 6 కేసులు ఉన్నాయి.
200 తాళం చెవులు స్వాధీనం
అత్తా కోడళ్లు పగటిపూటే చోరీలకు పాల్పడుతుంటారని, వీరి వద్ద చోరీకి వినియోగించే సుమారు 200 వరకూ ఇళ్ల తాళం చెవులను స్వాధీనం చేసుకున్నామని సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని వివరించారు. సమావేశంలో ఎస్‌ఐ వై.దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: పని చేయాలని చెప్పడమే పాపమైంది..
Comments
Please login to add a commentAdd a comment