రుయాలో రోగుల ఫీట్లు! | authorities in setting up the ramp fatigue | Sakshi
Sakshi News home page

రుయాలో రోగుల ఫీట్లు!

Published Mon, Jun 13 2016 9:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

authorities in setting up the ramp fatigue

మహిళా వార్డుకెళ్లాలంటే నరకం
రోగిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని మెట్లపై తోసుకెళ్లాల్సిందే
ర్యాంప్ ఏర్పాటు చేయడంలో అధికారుల అలసత్వం

ఈ ఫొటోలో కనిపిస్తున్న రోగి పేరు అనురాధ. పెద్దమండ్యానికి చెందిన ఈమె తీవ్ర జ్వరంతో మంచం పట్టింది. నడవలేని స్థితికి చేరడంతో బంధువులు ఇటీవల రుయా ఆస్పత్రిలోని మహిళల వార్డులో చేర్చారు. అక్కడ మొదటి అంతస్తుకెళ్లాలంటే ఒంకరటింకరగా ఉన్న 50 మెట్లపై వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని ఆమెను తోసుకెళ్లాల్సి వచ్చింది. మళ్లీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడూ అదే పరిస్థితి. రోగి పట్టుతప్పితే అంతే..! ..ఇది ఒక్క అనురాధ పరిస్థితే కాదు.. ఆ వార్డులో ఉన్న 210 మంది రోగుల పరిస్థితీ అంతే. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేయాల్సిన పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం రోగులు, వారి సహాయకుల పాలిట శాపంగా మారింది.

తిరుపతి మెడికల్: రుయా ఆస్పత్రిలోని మహిళా వార్డు రోగులు సర్కస్ ఫీట్లు పడాల్సి వస్తోంది. ఆస్పత్రి ప్రధాన భవనంలో ఉన్న మెడిసిన్ వార్డు శిథిలావస్థకు చేరింది. ఆ వార్డులోని పేషెంట్లను పాత క్యాజువాలిటీకి ఎదురుగా టీటీడీ క్యాంటీన్ కోసం నిర్మించిన భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఈ కొత్త మెడిసిన్ విభాగంలో 210 బెడ్లు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కొత్త మంచాలు, కొత్త పరుపులు, రోగుల సౌకర్యార్థం ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

 ఈ వార్డుకు ఎవరెవరు వస్తారంటే!
ఈ మహిళా వార్డుకు సాధారణ, విషజ్వరాల రోగులు, కిడ్నీ డయాలసిస్, బీపీ, షుగర్ పేషెంట్లు రోజుకు 10 నుంచి 15మంది వరకు అడ్మిట్ అవుతుంటారు. ప్రస్తుతం ఈ వార్డులో మొత్తం 150 మంది అడ్మిట్ అయ్యారు. వీరిలో చాలామంది నడవలేరు. బంధువులే రోగిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని మెట్లపై నుంచి మొదటి అంతస్తుకు తీసుకెళ్లాల్సి వస్తోంది.

 నరకం
ఈ కొత్త భవనం పైన పటారం..అన్నట్టు మారింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని విభాగంలో అంతా బాగున్నప్పటికీ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఫిమేల్ వార్డులో మహిళా రోగులు పడే కష్టాలు అన్నీఇన్నీకావు. మెడిసిన్ వార్డులో ఎవరైనా రోగిని అడ్మిట్ చేయాలన్నా.. డిశ్చార్జ్ చేయాలన్నా మొదటి అంతస్తులో ఏర్పాటుచేసిన మెట్లపై నుంచే వెళ్లాలి. సాధారణంగా రోగుల కోసం ర్యాంపు ఏర్పాటు చేసి, దానిపై వీల్ చైర్, స్టెక్చర్లపై రోగులను తీసుకెళ్లాల్సి ఉంది. అయితే ఈ భవనానికి ఎలాంటి ర్యాంపు సౌకర్యం లేదు. రోగులను తీసుకొచ్చే సమయంలో నరకం అనుభవిస్తున్నారు. పైగా వీల్‌చైర్‌లో రోగిని తీసుకొచ్చేందుకు సిబ్బంది ఎవరూ ఉడరు. రోగి సహాయకులే మెట్లపై నుంచి వీల్ చైర్‌లో కూర్చోబెట్టుకుని అతికష్టం మీద కిందకు దించుతున్నారు.

మెట్లపై ఎలా తీసుకెళ్లేది?
ఏం సార్..! టీటీడీకి, రుయాకు డ బ్బులు ఏమైనా కొదవా..? పైకి లేవలేని రోగిని మెట్లపై నుంచి ఎలా తీసుకెళ్లాలి. వీల్ చైర్‌పై తెచ్చే కిందికి దించే సమయంలో చెయ్యి జారి పడితే రోగి పరిస్థితి ఏమవ్వాలి. ర్యాంపు ఏర్పాటు చేయక పోవడం వల్ల రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీనిపై దృష్టిసారించాలి.
- నర్సింహారెడ్డి, రోగి బంధువు, పెద్దమండ్యం

ర్యాంపు ఏర్పాటు చేస్తాం
మెడిసిన్ వార్డుకు ముందు ఇక్కడ టీటీడీ క్యాంటీన్ ఉండేది. ప్రస్తుతం దీన్ని రోగుల కోసం మెడిసిన్ వా ర్డుగా ఉపయోగిస్తున్నాం. ఫిమేల్ వార్డులో రోగుల సౌకర్యార్థం ర్యాం పు ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా మంజూరు చేసాం. త్వరలోనే ర్యాంపును అందుబాటులోకి తీసుకొస్తాం.      -డాక్టర్ యు.శ్రీహరి, అసిస్టెంట్ సివిల్ సర్జన్, ఆర్‌ఎంవో, రుయా ఆస్పత్రి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement