-బాల్య వివాహ ఏర్పాట్లు అడ్డుకున్న అధికారులు
మోమిన్‌పేట(మెదక్ జిల్లా)
బాల్య వివాహ ఏర్పాట్లను అధికారులు అడ్డుకున్నారు. అమ్మాయికి మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మోమిన్‌పేట తహసీల్దార్ విజయకుమారి బాలిక తల్లిదండ్రులను హెచ్చరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన బుచ్చయ్య, భారతమ్మ దంపతుల ఏకైక కూతురు(15) స్థానిక పాఠశాలలో ఇటీవల 8వ తరగతి పూర్తి చేసింది.
ఆమెకు మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(35) రెండో వివాహం చేసేందుకు ఇరువర్గాల వారు శుక్రవారం ఏర్పాట్లు చేశారు. ఈవిషయమై వరుడికి బాలిక తల్లిదండ్రులు రూ.20 వేల కట్నం కూడా ఇచ్చారు. బాల్య వివాహ విషయంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న తహసీల్దార్ తదితరులు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను గురువారం తహసీల్దార్ కార్యాలయానికి రప్పించారు.
తహసీల్దార్ విజయకుమారి వారికి కౌన్సెలింగ్ చేశారు. అమ్మాయికి మైనారిటీ తీరిన తర్వాతే పెళ్లి చేయాలని సూచించారు. అనంతరం వారితో హామీ పత్రం రాయించుకున్నారు. బాలికను హైదరాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించనున్నట్లు సీడీపీఓ కాంతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ రమేష్ తదితరులు ఉన్నారు.
వధువుకు 15... వరుడికి 35 ఏళ్లు
Published Thu, Apr 28 2016 8:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement