అంతరిక్ష పరిశోధనపై చైతన్యం అవసరం
అంతరిక్ష పరిశోధనపై చైతన్యం అవసరం
Published Fri, Jul 7 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
ఇస్రో ఎస్‌ఎస్‌ఎంఈ అధ్యక్షుడు మాధుర్
గైట్‌లో ముగిసిన అవగాహన సదస్సు
రాజానగరం : భారతీయ అంతరిక్ష పరిశోధనపై దేశ యువతలో చైతన్యం నింపేందుకు ఇస్రో కృషి చేస్తున్నదని (ఎస్‌ఎస్‌ఎంఈ) అధ్యక్షుడు ఏసీ మాధుర్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇస్రో నమూనా ఉపగ్రహాల ప్రదర్శనలను ఉచితంగా ఏర్పాటు చేయడంతోపాటు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహించి అంతరిక్ష విజ్ఞానం గురించి తెలియజేస్తుందన్నారు. గైట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, అహ్మదాబాద్‌లోని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఇస్రో సహకారంతో ‘అంతరిక్ష సాంకేతికరంగంలో మెకానికల్ ఇంజనీరింగ్ సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎంఈని 1977లో ప్రారంభించామని, దీనిలో 340 మంది జీవిత సభ్యులున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారు రూ.250 చెల్లించి సభ్యత్వాన్ని పొందవచ్చన్నారు.
డీఈసీయూ మాజీ డైరెక్టర్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ భారతదేశ ప్రగతికి అవసరమైన బహుముఖ అంశాలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిపై ఇస్రో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా విద్యా విధానం, టెలీమెడిసిన్‌లపై డీఈసీయూ దృష్టి సారించిందన్నారు. దేశంలోని 26 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 వేల మంది విద్యార్థులకు దూరవిద్యా విధానం అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది వేలమంది విద్యార్థులు ప్రయోజనం పొందుతుండగా హర్యానాలో 10 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్‌ఏసీ మాజీ హెడ్ ఎస్‌జి వైష్టక్ మాట్లాడుతూ కొత్త విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ఉపగ్రహ నమూనాలతో ప్రదర్శనలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. విఎస్‌ఎస్‌సీ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ భానుపంత్ మాట్లాడుతూ అంతరిక్ష నౌకలో వివిధ విడిభాగాలను 253 నుంచి రెండు వేల సెంటిగ్రేడ్ తట్టుకునే విధంగా తయారుచేసేందుకు లోహాలను, లోహమిశ్రమాలను వినియోగిస్తారన్నారు. వాటి తయారీ విధానం, ఏఏభాగాలలో ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియజేశారు.
సభ్యత్వం పొందిన గైట్
ఎస్‌ఎస్‌ఎంఈలో కార్పొరేట్ సభ్యత్వాన్ని తీసుకుంటూ గైట్ కళాశాల ఎండీ కె.శశికిరణ్‌వర్మ సంబంధిత పత్రాన్ని సంస్థ అధ్యక్షుడు ఏసీ మాధుర్‌కు అందజేశారు. రానున్న కాలంలో తమ కళాశాల విద్యార్థులకు ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. అతిధులను కళాశాల ఎండీ దుశ్శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అతిరా కన్సల్టెంట్ ఎల్‌ఎం కేపీ భల్‌సా«ద్, ఎస్‌ఎస్‌ఎంఈ ఏవీ ఆప్టే, గైట్ కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్ష్మీ శశికిరణ్, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, డీన్ డాక్టర్ ఎం.వరప్రసాదరావు, హెచ్‌ఓడీ డాక్టర్ టి.జయానంద్‌కుమార్, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement