అన్న వాహిక (ఈసోఫేజియల్)క్యాన్సర్ కు గురైనవారు తినడానికి చాలా ఇబ్బంది పడతారు. గొంతు బొంగురుపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడలేకపోవడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలతో మరింత వ్యథకు గురవుతుంటారు. అందుకే ఈ క్యాన్సర్ పట్ల అవగాహన అవసరం. దీన్ని ముందుగా గుర్తించడం, ఎవరెవరిలో ఈ క్యాన్సర్ తలెత్తే అవకాశం ఉందో తెలుసుకోవడమూ అవసరం.
మరో సమస్యగా పొరబడే అవకాశాలెక్కువ...
సాధారణంగా గొంతునొప్పి అనగానే థ్రోట్ ఇన్ఫెక్షన్ అని అనుకోవడం చాలా సాధారణం. అలాగే గొంతు బొంగురుగా మారితే పొరబోయిందని అనుకుంటారు. ఇక మింగడం కష్టంగా ఉంటే నీళ్లమార్పిడి, వాతావరణ మార్పిడి కారణంగా వేడిచేసిందేమోనని పొరబడే అవకాశమూ ఉంది. అలాగే... ఏదో సరిపడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణంలో ఏదిబడితే అది తినడం వల్లనేమోనని భావించవచ్చు కూడా. ఇలా అనుకునే వారిని మనం చాలామందినే చూస్తుంటాం. ఇక్కడ పేర్కొన్న లక్షణాలు రెండు, మూడు రోజుల్లో తగ్గితే అంతగా భయపడాల్సిన పనిలేదు. కానీ తగ్గకుండా కొన్నిరోజుల పాటు అలాగే కొనసాగితే మాత్రం ఆలోచించాల్సిందే.
ఈసోఫేజియల్ క్యాన్సర్ లక్షణాలు
మింగడానికి కష్టంగానూ, నొప్పిగానూ ఉండటం ,ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోగలగడం ,ఆకలి, బరువు తగ్గడం ఆగని దగ్గు, దగ్గులో రక్తం కనిపించడం గుండెల్లో మంట జ్వరం... వంటి లక్షణాలు చాలాకాలం పాటు కొనసాగితే సొంతవైద్యం మానుకొని డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య కాలేయానికీ, ఊపిరితిత్తులకూ వ్యాపించే ప్రమాదమూ ఉంటుంది.
అసలేమిటీ అన్నవాహిక క్యాన్సర్?
అన్నవాహిక మెడ కింది నుంచి పొట్ట పైభాగం వరకు ఒక పైప్‌లా దాదాపు 25 సెం.మీ పొడవు ఉంటుంది. అన్నవాహిక క్యాన్సర్‌ను ఉపరిభాగంలో, మధ్యభాగంలో, కిందిభాగంలో వచ్చేవి అంటూ మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఉపరిభాగంలో వచ్చే క్యాన్సర్‌కు సాధారణంగా కీమో, రేడియేషన్ థెరపీ మాత్రమే ఇస్తుంటారు. స్వరపేటికకు దగ్గరగా ఉండటం వల్ల సర్జరీ చేయడం కష్టం. మిగతా రెండు భాగాలకు సర్జరీ చేసేందుకు అనువుగా ఉంటాయి. కణితి బాగా పెద్దదిగా ఉన్నప్పుడు ముందు కీమో, రేడియేషన్ ఇచ్చి... తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. కణితి పెద్దదిగా ఉండి, ఎలాంటి ఆహారమూ తీసుకోలేని పరిస్థితుల్లో స్టెంట్ అమర్చడం కూడా జరుగుతుంది. అన్నవాహికలో కణితి ఉన్న భాగాన్ని సర్జరీ ద్వారా తీసివేయడాన్ని ‘ఈసోఫేగక్టమీ’ అంటారు. ఈ సర్జరీలో అన్నవాహికలో కొంతభాగాన్ని తీసివేసి, పొట్టలోని కొంతభాగాన్ని అన్నవాహికకు కలపడం జరుగుతుంది. స్త్రీలలో కన్నా పురుషుల్లో మూడురెట్లు ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించకపోతే జీవితకాలం పెంపొందించడం చాలా కష్టమని చెప్పాలి. కణితి కొంచెం పెద్దదయినప్పుడు మాత్రమే లక్షణాలు కనిపించడం వల్ల ఈ క్యాన్సర్‌ను లేటుదశలోనే సాధారణంగా గుర్తించడం జరుగుతుంటుంది. అప్పుడు వారి ఇబ్బందులను కొంత తగ్గించడానికి స్టెంట్స్ వంటివి అమర్చి పాలియేటివ్ కేర్ అందించడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువ అన్న విషయాన్ని అందరూ తెలుసుకొని, ముందుగా గుర్తించడానికి ప్రయత్నించడమే మనం చేయాల్సిన ప్రధానమైన పని.
ఎవరిలో ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువంటే...
ఈసోఫేజియల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్ ఫ్యాక్టర్లు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. అవి... ∙60 ఏళ్లకు పైబడ్డ పురుషులు ∙పొగాకు లేదా పొగాకు ఉత్పత్తులు వాడేవారు, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు ∙గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ (జీఈఆర్‌డీ) సమస్య ఏళ్ల తరబడి ఉన్నవారిలో ∙హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) కు గురైనవారు ∙యాసిడ్స్ కారణంగా అన్నవాహికకు తీవ్ర గాయాలైనవారు ∙హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కు గురైనవారు ∙గొంతుభాగంలో రేడియేషన్ తీసుకున్నవారు ∙థైలోసిస్, సీలియాక్ వంటి సమస్యలున్నవారు ∙కొన్ని రకాల రసాయన కర్మాగారాల్లో పనిచేసే వారికి ఈసోఫేజియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కొంతవరకు వంశపారంపర్యంగా కూడా ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది.
నివారణ / చికిత్స
దురలవాట్లకు దూరంగా ఉంటూ చక్కటి జీవనశైలితో జీవనాన్ని గడిపేవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ఇక పైన చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు, అందునా మరీ ముఖ్యంగా ఇక్కడ పేర్కొన్న రిస్క్‌గ్రూపునకు చెందినవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపీ, బయాప్సీ, అవసరమైతే సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్‌స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. వ్యాధినిర్ధారణ ప్రక్రియలో అది ఏ రకానికి చెందిన క్యాన్సర్, ఏయే భాగాలకు వ్యాపించింది లాంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలు అవసరం. ఒకసారి వ్యాధి నిర్ధారణ జరిగాక... సర్జరీ, కీమో, రేడియేషన్, లేజర్ థెరపీ లేదా రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి ప్రక్రియల్లో ఏది అవసరమో, దాన్ని ఎంతకాలం తీసుకోవాలో అన్న విషయాలపై వైద్యులు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. అయితే వ్యాధి వచ్చాక బాధపడటం కంటే ముందే నివారించుకోవడం ఎంతో మేలు చేసే అంశం.
అన్నవాహిక క్యాన్సర్‌పై అవగాహన అవసరం
Published Thu, Jun 21 2018 12:19 AM | Last Updated on Thu, Jun 21 2018 12:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment