క్యాన్సర్ నుంచి ఏ శరీర భాగమూ మినహాయింపు కాదు. తల నుంచి కాలి వరకు ఏ అవయవానికైనా రావచ్చు. మొదట ఏ భాగంలో క్యాన్సర్ ప్రారంభమవుతుందో దాన్ని ‘ప్రైమరీ’ అంటారు. ఒక భాగంలో వచ్చిన క్యాన్సర్ మరో భాగానికి వ్యాప్తి చెందితే... అలా ఇతర అవయవానికి వ్యాపించిన దాన్ని ‘సెకండరీ’ అంటారు. తొలుత ఏదైనా భాగానికి క్యాన్సర్ వచ్చి... అది లింఫ్‌నోడ్ వరకు వ్యాపిస్తే దాన్ని ‘లేట్’ దశగా పేర్కొంటారు. ఎందుకంటే ‘లింఫ్‌నోడ్’ అనేది క్యాన్సర్ వ్యాప్తికి ఒక కూడలి లాంటిది. అక్కడి నుంచి అది మనలోని ఏ అవయవానికైనా పాకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ‘ప్రైమరీ’ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే క్యాన్సర్‌ను నయం చేయడం సులభం. దాదాపుగా పూర్తిగా నయమయ్యే అవకాశాలూ ఉంటాయి. కానీ చాలామంది ‘సెకండరీ’ దశలో హాస్పిటల్‌కు వస్తుంటారు. అలాంటి ‘లేట్’ క్యాన్సర్‌లను అదుపు చేయడం ఒకింత కష్టం. అందుకే క్యాన్సర్లపై అవగాహన అందరికీ అవసరం. వయసు పైబడే కొద్దీ క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. కానీ చిన్న, మధ్యవయసు వారిలో క్యాన్సర్ తీవ్రత ఎక్కువ. అందుకే క్యాన్సర్ చికిత్స విషయంలో గ్రేడ్, స్టేజ్ (దశ)తో పాటు వయసు ప్రాధాన్యం కూడా ఎక్కువ.
క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు:
n క్యాన్సర్ సోకిన అవయవాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. చాలాసార్లు తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు n పరీక్షలు కూడా క్యాన్సర్ సోకిన అవయవాన్ని బట్టి అనేక రకాలుగా ఉంటాయి. ఏదో ఒక నిర్దిష్టమైన పరీక్షతోనే శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందా అన్న విషయం తెలుసుకోవడం అసాధ్యం n క్యాన్సర్ అంటువ్యాధి కానేకాదు. అయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ వైరస్, లివర్ క్యాన్సర్‌కు దారితీసే హైపటైటిస్ బి, సిలు వైరస్‌లు సురక్షితం కాని శృంగారం, రక్తమార్పిడి ద్వారా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. ఇప్పుడు హెచ్‌పీవీ, హెపటైటిస్ బి వైరస్‌లకు గురికాకుండా ఉండేందుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి n క్యాన్సర్లు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ కొన్ని రకాల క్యాన్సర్లు (అంటే... రొమ్ము, థైరాయిడ్, కోలన్, పాంక్రియాస్ క్యాన్సర్లు) వచ్చిన ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఆ కుటుంబాలలోని వారికి అవి వచ్చే అవకాశం కాస్తంత ఎక్కువ n పుట్టుమచ్చలలో మార్పు, నొప్పి లేని గడ్డలు వచ్చి అవి పెరుగుతుండటం, నెలసరి మధ్యలో రక్తస్రావం కావడం, రొమ్ము నుంచి రక్తస్రావం వంటివి క్యాన్సర్‌లను అనుమానించేందుకు కొన్ని సూచనలు n రొమ్ముక్యాన్సర్లు పురుషులలోనూ రావచ్చు.
క్యాన్సర్లకు కారణాలు: క్యాన్సర్‌కు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... కొన్ని అంశాలు క్యాన్సర్లకు కారణమవుతాయి. అవి... మద్యం, పొగతాగడం, ఆహార పదార్థాల్లో రసాయన రంగులు వాడటం, రకరకాల రసాయనాలు, హార్మోన్లను ఎక్కువగా వాడటం, అధిక బరువు, నీరు, వాతావరణ కాలుష్యం, క్రిమిసంహారకాల వాడకం పెరగడం, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తూ రేడియేషన్‌కు ఎక్కువగా గురికావడం, వంటివి క్యాన్సర్లను కలగజేస్తుంటాయి.
ఈ పొరపాట్లతో క్యాన్సర్ గుర్తింపులో ఆలస్యం: చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను ముదిరాకే గుర్తించడానికి కారణం... ఈ వ్యాధిని వేరే సమస్యగా పొరబడటమే. చాలా సందర్భాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను టీబీ అనీ, కోలోరెక్టర్ క్యాన్సర్‌ను పైల్స్ అనీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లను అల్సర్స్‌గానూ, బ్రెయిన్ క్యాన్సర్‌ను మైగ్రేన్ కావచ్చని పొరబాటుపడి, నెలల తరబడి సరైన చికిత్స లేకుండా తాత్సారం చేస్తుంటారు. తీరా ముదిరిన దశలో హాస్పిటల్‌కు వస్తుంటారు. దాంతో తప్పక తగ్గేలా చేసేందుకు అనువైన కాలం గతించిపోతుంది.
లక్షణాలు: క్యాన్సర్ లక్షణాలు అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలివి... n రొమ్ములో కొత్తగా గడ్డలు కనిపించడం n విడవకుండా దగ్గు, గొంతు బొంగురుపోవడం n ఆకలి, బరువు తగ్గడం n ఎంతకూ మానని పుండు n కొత్త మచ్చ లేదా ఉన్న మచ్చ/పులిపిరికాయలో మార్పు n వాంతులు, అజీర్ణం n మహిళల్లో తెలుపు కావడం లేదా అసాధారణ రక్తస్రావం n పొత్తికడుపు, నడుము నొప్పులు n అజీర్ణంతో పాటు తేన్పులు, కడుపు ఉబ్బరం n తగ్గని జ్వరం. అయితే కొందరిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి మందులు వాడుతున్నప్పటికీ సమస్య తగ్గకుండా పై లక్షణాలే రెండు, మూడు వారాలకు పైగా ఉండటం, లేదా లక్షణాల్లో మార్పులు/తీవ్రత పెరగడం, తగ్గినట్టే తగ్గి సమస్య మళ్లీ తిరగబెట్టడం వంటివి కనిపిస్తే తప్పనిసరిగా ఆ కండిషన్లను అనుమానించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది.
చికిత్స: ఏ క్యాన్సర్ అయినా తొలి దశలోనే గుర్తిస్తే సమర్థమైన చికిత్స సాధ్యమే. కానీ ఎవరికి వారు తమకు క్యాన్సర్ ఎందుకు వస్తుందిలే అనుకుంటుంటారు. కొన్ని క్యాన్సర్లలో బాధ లేకపోవడంతో నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళల్లో వచ్చే సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే మంచి చికిత్స సాధ్యమవుతుంది. అలాగే 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్‌ను ముందుగానే తెలుసుకోడానికి పీఎస్‌ఏ పరీక్ష, హెపటైటిస్ బి, సి ఉన్నట్లయితే లివర్ క్యాన్సర్‌ను తెలిపే పరీక్షలు ముందే చేయించుకోవడం మేలు. ముప్ఫై ఏళ్లు పైబడ్డాక మహిళలు డాక్టర్ చెప్పిన మేరకు క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకుంటూ ఉండటం మంచిది.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001
Comments
Please login to add a commentAdd a comment