వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్ | B.Tech Student Jhansi suspicious death from Nalgonda | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్

Published Tue, May 31 2016 6:32 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్ - Sakshi

వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్

వివాహిత బలవన్మరణం
నాకు రూ. 20 లక్షలు ఇస్తేనే విడాకులిస్తా.. అంత డబ్బు ఇవ్వలేనంటే ఎట్లా.. అందంగానే ఉన్నావుగా.. ప్రస్తుతం మార్కెట్‌లో నీ లాంటి వారికి  మంచి డిమాండ్ ఉంది.. దుకాణం పెడితే లక్షలు సంపాదించవచ్చు.. నేను చెప్పినట్టు వింటే సరేసరి..లేదంటే నిన్ను అమ్మేస్తా... లేకుంటే చంపేస్తా అని నా భర్త వేధిస్తున్నాడు. నా కన్నతల్లి కూడా అతడికే వత్తాసు.. అందుకే చనిపోతున్నా. నా భర్తపై చర్య తీసుకోండి.

ఇవీ .. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన ఝాన్సీరాణి తన భర్త విజేందర్‌రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు, జడ్జి, మహిళా రక్షణ సెల్‌కు రిజిస్టర్ పోస్టులో పంపిన లేఖల్లో పేర్కొన్న అంశాలు.

     
విడాకులివ్వాలని కోరితే నిరాకరణ
అందుకు రూ. 20 లక్షలివ్వాలని డిమాండ్
అమ్మేస్తా లేదంటే చంపేస్తానని బెదిరింపు
కన్నతల్లి కూడా భర్తకే వత్తాసు
భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా..
పోలీస్ ఉన్నతాధికారులు, జడ్జి,
మహిళా రక్షణ సెల్‌కు ఝాన్సీ లేఖలు


కష్టమొస్తే కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి ఓ వైపు.. కలకాలం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త ఇంకో వైపు డబ్బు కోసం నరక కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేకపోయింది.. విడాకులిస్తే నా దారి నేను చూసుకుంటానని వేడుకున్నా కనికరించలేదు.. మృగాడి కబంధ హస్తాల కింద నలిగిపోయేకంటే చావే శరణ్యమనుకుందో.. ఏమో.. ఆ చిట్టితల్లి. తనకుతానే మరణశాసనం లిఖించుకుంది. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గూడూరు ఝాన్సీ ఆత్మహత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోయే ముందు కారకులు, కారణాలను విశ్లేషిస్తూ తెలంగాణ డీజీపీ, ఎస్పీ, జడ్జి, మహిళా రక్షణ సెల్, నకిరేకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు రిజిస్టర్ పోస్టులో పంపిన లేఖలు సోమవారం అందాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
 
నకిరేకల్: ఆలస్యంగా వెలుగుచూసిన ఝాన్సీ ఆత్మహత్యపై  రిజిస్టర్‌పోస్ట్‌లో అందిన సూసైడ్‌నోట్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గుర్రం పద్మ వెంకట్‌రెడ్డి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పద్మ భర్త వెంకట్‌రెడ్డి 2013 లో చనిపోయారు. తల్లి పద్మ  నకిరేకల్‌లోని మూసీరోడ్డులో ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది.  కుమార్తె ఝాన్సీ హైదరాబాద్‌లోని ఎంవీఎస్‌ఆర్ కళాశాలలో బీటెక్ చదువుతుండగా కుమారుడు శివ లారీడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక స్థితిగతి బాగా లేకపోవడంతో పద్మ తన మేనల్లుడైన  నల్లగొండ మండలం దీపకుంటకు చెందిన గూడూరు విజయేందర్‌రెడ్డి వద్ద రూ. 4 లక్షలు అప్పుగా తీసుకుంది.
 
అప్పు కింద కూతురినివ్వు..
కొంత కాలానికి విజయేందర్‌రెడ్డి తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని పద్మపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు చెల్లించే స్థితిలో పద్మ కుటుంబం లేదు. అప్పు కింద కూతురు ఝాన్సీని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. అందుకు పద్మ సరేనంది. అతడి ప్రవర్తన సక్రమంగా లేదని ఝాన్ని తన తల్లి వద్ద మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. రెండు కుటుంబాల పెద్దలు 2014 ఆగ స్టు 22వ తేదీన విజయేందర్‌రెడ్డితో ఝాన్సీకి వివాహం జరిపిం చారు. వివాహం అనంతరం కూడా ఝాన్సి  హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటూ బిటెక్ చదువుతోంది.  ఇటీవల ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేసింది.
 
అది చూసి జీర్ణించుకోలేక పోయా..
తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేదని ఎన్నో సార్లు తన తల్లికి చెప్పినా వినిపించుకోలేదు. అతడితోటే ఉండాలని పట్టుబట్టింది. తన తల్లి, భర్త ప్రవర్తన సక్రమంగా లేదని గుర్తించా.. ఓ రోజు వారిద్దరినీ పడకగదిలో చూసి జీర్నించుకోలేకపోయా. అప్పుడే నిర్ణయించుకున్నా ఇక భర్తతో కలిసి జీవించొద్దని.
 
గుట్టుచప్పుడు కాకుండా..
ఈనెల 23వ తేదీన ఝాన్సీ హైదరాబాద్ నుంచి నకిరేకల్‌కు వచ్చింది. ఇంటికి వచ్చిన మరుసటి రోజు నివాసంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.  ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పద్మ  తన అల్లుడు విజయేందర్‌రెడ్డికి తెలపడంతో ఎలాంటి కేసు కూడా పెట్టకుండా వారు వచ్చి వారి స్వగ్రామమైన నల్లగొండ మండలం దీపకుంటకు తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించారు.
 
కలకలం సృష్టించిన రిజిస్టర్ పోస్ట్
నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు సోమవారం వచ్చిన రిజిస్టర్ పోస్ట్ కలకలం సృష్టించింది. ఈ లేఖ ఆధారంగా నకిరేకల్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ నర్సింహారావు నేతృత్వంలో విచారణ చేపట్టారు. సదరు ఝాన్సీ  తల్లిని, భర్త విజయేందర్‌రెడ్డిని విచారించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేరేపించిన తల్లి పద్మ,  భర్త విజయేందర్‌రెడ్డిలపై, సాక్ష్యాలు లేకుండా శవాన్ని దహనం చేసిన విషయంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఝాన్సీ చదువుతున్న కళాశాలకు వెళ్లి కూడా విచారణ చేపడతామని, ఆమె వాడిన సెల్ డాటా వివరాలను కూడా సేకరిస్తామని, ఆమె దహనం చేసిన అస్తికలను కూడా సేకరించి ల్యాబ్‌కు పంపించి కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ లేఖ ఝాన్సీనే పంపించిందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతామన్నారు.
 
వ్యభిచార కూపంలోకి నెట్టేస్తానంటే..
తనకు విడాకులు కావాలని భర్తను అడిగా. అందుకు రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చే స్థితిలో లేనంటే వ్యభిచారం చేస్తే రూ. లక్షలు సంపాదించవచ్చని చెప్పాడు. చెప్పినట్టు వినాలని.. బతికి ఉండే వరకు వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని ఆదేశించాడు. అమ్మేస్తా లేదా చంపేస్తానని బెదిరించాడు. ఇదే విషయం తల్లితో చెబితో భర్త చెప్పినట్టు నడుచుకోవాలని అతడికే వత్తాసు పలికిందని లేఖలో పేర్కొంది.
 
నాకు  సంబంధం లేదు
నా కూతురు ఝాన్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన లేఖని అంశాలపై నాకు ఏలాంటి సంబంధం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ఎవ్వరు ప్రేరేపించలేదు. బిటెక్ చదివేందుకు ఖర్చు కూడా నా అల్లుడు భరించాడు. ఈనెల 23న పరీక్షలు పూర్తి అయిన అనంతరం ఇంటికి చేరుకుంది. 24న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు మాకు తెలపలేదు. నా కూతురు మృతి విషయాన్ని నల్లగొండ మండలం దీపకుంటలో ఉంటున్న నా అల్లుడు విజయేందర్‌రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు.                                                     - తల్లి పద్మ
 
మా ఇద్దరి మధ్య గొడవలు లేవు
పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైళ్లి అయిన నాటి నుంచి ఆమె హాస్టల్‌లోనే ఉంటూ చదువుతోంది. చదువు ఖర్చులు కూడా నేనే భరించా. మా మద్య ఏలాంటి విభేదాలు లేవు. ఆమె ఆత్మహత్యకు నాకు సంబందం లేదు. ఆమె రాసిన లేఖలో కూడా అంశాలు వాస్తవం కాదు.
- ఝాన్సీ భర్త గూడూరు విజేందర్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement