శిశువును బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం!
శిశువును బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం!
Published Tue, Aug 9 2016 12:05 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మరణించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం ఆందోళన చేశారు. కోరుకొండ మండలం శ్రీరంగంపట్నానికి చెందిన బాధితురాలి తండ్రి రాంబాబు ఈ వివరాలు తెలిపారు. రాంబాబు కుమార్తె కనికట్ల రమకు పురిటినొప్పులు రావడంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన డ్యూటీ వైద్యులు, ఆ తర్వాత పట్టించుకోలేదు. 12 గంటల సమయంలో సాధారణ వార్డులోనే ప్రసవం జరిగిపోయింది. ఈ విషయం చెప్పాక వైద్య సిబ్బంది వచ్చారు. శిశువు పరిస్థితి బాగోలేకపోవడంతో వెంటిలైటర్‌పై ఉంచారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో శిశువును కాకినాడకు తీసుకెళ్లాలని చెప్పారు. అంబులెన్స్ కోసం రమ బంధువులు అడుగగా, లేదని సమా«ధానమిచ్చారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో శిశువును కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శిశువును పరిశీలించి, అప్పటికే చనిపోయిందని ధ్రువీకరించారు. దీనికి కారణం ఇక్కడి వైద్యుల నిర్ల్యక్షమేనంటూ రాజమహేంద్రవరం ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన చేశారు. ఆస్పత్రి ఆర్‌ఎంఓ పద్మశ్రీకి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ రమకు బీపీ ఉందని, ఈ విషయాన్ని వారికి ముందే చెప్పామన్నారు. దీనివల్లే బిడ్డకు హాని జరిగిందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసి, సిబ్బంది తప్పు చేసిన ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Advertisement