బ్యాంకర్ల వల్లే అవస్థలు: సీఎం
- ఆర్బీఐ క్రియాశీలకంగా పనిచేయడం లేదు
- వైఖరి మారకపోతే కఠినచర్యలు
- పెద్ద నోట్ల రద్దుపై సమీక్ష
సాక్షి, అమరావతి : పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక సమయంలో అన్ని బ్యాంకుల్ని సమన్వయం చేసుకోవాల్సిన ఆర్‌బీఐ ప్రధాన భూమిక పోషించడంలేదన్నారు. బ్యాంకర్ల వైఖరిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో బ్యాంకర్లు, అధికారులతో బాబు సమీక్షించారు. బ్యాంకర్ల అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని చెప్పారు. ప్రతిరోజూ తాను నిర్వహిస్తున్న అత్యవసర సమావేశాలకు రాష్ట్రంలోని లీడ్ బ్యాంకర్లే సక్రమంగా రావడంలేదని, హాజరయ్యే కొద్దిమంది బ్యాంకుల ప్రతినిధుల వద్ద సరైన సమాచారం ఉండడంలేదన్నారు. వచ్చే నెల మొదటి వారంలో అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సిమెంట్ కంపెనీలపై ఆగ్రహం
పోలవరం నిర్మాణానికి సిమెంట్ లభ్యత, ధరలపై చర్చించేందుకు యాజమాన్యాలు గైర్హాజరు కావడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినిధులను పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన తనిఖీ (వర్చువల్ ఇన్‌స్పెక్షన్) చేశారు.
సీఎంల కమిటీకి నేతృత్వం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను అధిగమించేందుకు ఐదుగురు ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేస్తున్నామని దానికి నేతృత్వం వహించాల్సిందిగా చంద్రబాబును జైట్లీ కోరినట్లు తెలిపింది. ఈ సందర్భంగా బ్యాంకర్ల వైఖరిపై అరుణ్‌జైట్లీకి చంద్రబాబు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
రూ.1,000 కోట్లు చిన్న నోట్లు పంపించండి
వచ్చే నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లింపుతో పాటు ప్రధానంగా సామాజిక పింఛన్లు చెల్లించేందుకు చిల్లర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి, ఆర్‌బీఐ గవర్నర్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. తక్షణం రూ.1,000 కోట్ల మేర చిన్న నోట్లను రాష్ట్రానికి పంపించాల్సిందిగా ఆ లేఖల్లో ముఖ్యమంత్రి కోరారు.