14 గంటలు పనిచేస్తున్నా... మాపై నిందలా?
- బ్యాంకు ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదని విమర్శిస్తారా..
- ఏపీ సీఎం చంద్రబాబుపై అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం ధ్వజం
- తక్కువ కరెన్సీ పంపుతున్న కేంద్రం, ఆర్‌బీఐని విమర్శించరేం?
- మా చేతులు కట్టేసి నగదు ఇవ్వమంటే ఎలా?
- ఆ వ్యాఖ్యలను చంద్రబాబు ఉపసంహరించుకోవాలి
- కరెన్సీ కొరత తీరేందుకు 9 నెలలు పడుతుంది
- సంపూర్ణ నగదు రహిత లావాదేవీలకు కనీసం 20 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజు నుంచి సెలవులు కూడా లేకుండా రోజుకు 14 గంటలు పని చేస్తున్నాం. ఒక్కోసారి తెల్లవారు జామున 3 గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. తిరిగి మళ్లీ ఉదయం నిర్ణీత సమయానికి బ్యాంకులకు వస్తున్నాం. ఇంత పనిచేస్తున్నా బ్యాంకు ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితం. తక్కువ కరెన్సీని పంపుతున్న కేంద్రాన్ని, ఆర్‌బీఐని విమర్శించకుండా మాపై నిందలా? మా చేతులు కట్టేసి నగదు ఇవ్వమంటే ఎలా? చంద్రబాబు మాపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’ అని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం జాతీయ నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న సంఘం జాతీయ మహా సభలను పురస్కరించుకొని శుక్రవారం సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్, వైస్ చైర్మన్ అలోక్ ఖరే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
సింగపూర్‌లో నగదు రహిత లావాదేవీలు 60 శాతమే...
భారత్, పాకిస్తాన్‌కు ఇప్పటివరకు నోట్ల తయారీకి అవసరమైన కాగితం, ఇంకు, సెక్యూరిటీ క్యారెక్టర్లను ఒక సంస్థే సరఫరా చేసిందని సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజన్ వెల్లడించారు. దేశంలో నిరక్ష్యరాస్యత అధికంగా ఉన్నందున నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదన్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా నగదు రహిత లావాదేవీలు జరిగే సింగపూర్‌లో వాటి శాతం 60 శాతమేమని, అమెరికాలో అవి 20 శాతానికే పరిమితమని నాగరాజన్ గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే పూర్తిస్థాయిలో జరగని నగదు రహిత లావాదేవీలు మన దేశంలో సంపూర్ణంగా జరగాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందన్నారు. గ్రామీణ ప్రజలు బ్యాంకులను ఇంకా విశ్వసించడంలేదని, పైగా నగదు రహిత లావాదేవీలపై 2.5 శాతం చార్జీ పడుతుందన్నారు.
పెద్ద నోట్ల రద్దు తొందరపాటు చర్య
కేంద్రం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును నాగరాజన్ తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం కొత్త రూ. 2 వేల నోటు దొంగదా అసలుదా అని కనిపెట్టే యంత్రాలు బ్యాంకులకు రాలేదని, దీంతో బ్యాంకులు అన్ని నోట్లనూ తీసుకునే పరిస్థితే ఉందన్నారు. బ్యాంకులకు రావాల్సిన రూ. 1.05 లక్షల కోట్ల రికవరీలు, ఇతరత్రా సొమ్ము నిలిచిపోయిందని... దీన్ని కేంద్రం సరఫరా చేయగలదా? అని ఆయన నిలదీశారు. దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలు ఉండగా అందులో కేవలం 35 ఏటీఎంలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు. ఆర్‌బీఐ ఎటువంటి వివక్ష లేకుండా అన్ని బ్యాంకులకు నగదు సరఫరా చేయాలని నాగరాజన్ డిమాండ్ చేశారు.
జనాభాకు తగ్గ బ్రాంచీలేవీ?
దేశంలో ప్రతి 30 వేల మందికి ఒక బ్యాంకు బ్రాంచీ మాత్రమే ఉందని సంఘం వైస్ చైర్మన్ అలోక్ ఖరే తెలిపారు. అదే అమెరికాలో అరుుతే ప్రతి 3 వేల మందికి ఒక బ్యాంకు బ్రాంచీ ఉందన్నారు. అవసరమైన బ్రాంచీలు, పూర్తిస్థాయిలో ఉద్యోగులుంటే పని సులువవుతుందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టలేమని... ఎవరి వద్ద నల్లధనం ఉందో కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు. రద్దరుున నోట్లు ఆర్‌బీఐకి వెళ్తున్నా ఆ మేరకు బ్యాంకులకు కొత్త నోట్లు రావడం లేదని ఆయన విమర్శించారు. ఇది ఆర్‌బీఐ వైఫల్యమేనన్నారు. ఆర్‌బీఐ నెలకు 250 కోట్ల నోట్లు మాత్రమే ముద్రించగలదని... ఆ ప్రకారం కరెన్సీ కొరత తీరాలంటే 9 నెలలు పడుతుందన్నారు. తెలంగాణలో ఎస్‌బీహెచ్‌ను ఎస్‌బీఐలో కలపాలని కేంద్రం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
నల్లధనంపై పక్కదారి పట్టిస్తున్న ప్రధాని...
విదేశాల్లో నల్ల కుబేరులు దాచుకున్న బ్లాక్‌మనీని తీసుకొచ్చి ప్రజల ఖాతాలో వేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని మోదీ... ఆ పని చేయకుండా ప్రజలను పక్కదారి పట్టించేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని సంఘం తెలంగాణ, ఏపీ ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం రద్దుకాదన్నారు. బ్యాంకుల ముందు ఖాతాదారులు ధర్నా చేస్తే ఉద్యోగులకు రక్షణ కల్పించడంలేదన్నారు. ఇప్పటికే అనేకచోట్ల కరెన్సీ లేక ఒక బ్యాంకుకు చెందిన 15 శాఖలను మూసేశారన్నారు. తక్కువ కరెన్సీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు.
బ్యాంకుల్లో రికవరీ లేకుండా పోయిందన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనేది అక్షరాస్యత అధికంగా ఉంటేనే సాధ్యమన్నారు. ఇప్పటివరకు ఎన్నిచోట్ల నోట్లు ముద్రించారు? ఎన్ని బ్యాంకులకు ఎంతెంత పంపించారు? అని ఆర్‌బీఐని అడిగితే తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీకి ఎక్కువ కరెన్సీ పంపుతూ ప్రభుత్వరంగ బ్యాంకులకు మాత్రం తక్కువ నోట్లు పంపిందని విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 10 కోట్లు సరఫరా చేయాల్సిన చోట... కేవలం రూ. కోటే విడుదల చేశారన్నారు. బ్యాకింగ్ రంగాన్ని రక్షించాలని... భారీగా నోట్లను సరఫరా చేయాలన్న డిమాండ్‌తో తమ మహాసభలు జరుగుతాయన్నారు.