యువకులపై బార్ సిబ్బంది దౌర్జన్యం
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఉన్న చాంపియన్ బార్ అండ్ రెస్టారెంట్ (లోటస్ ఫుడ్‌సిటీ) నిబంధనలకు నీళ్లొదిలింది. రాత్రీ పగలు తేడా లేకుండా, నిబంధనలు ఏమాత్రం పాటించకుండా పబ్‌లు, బార్‌లు నడుపుతూ అక్కడికి వచ్చిన యువకులపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడడం తరచూ జరుగుతోంది. నిత్యం సీఎం చంద్రబాబు ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తున్నా ఎక్సైజ్ అధికారులకు పట్టడం లేదు. శనివారం అర్ధరాత్రి లోటస్ ఫుడ్ సిటీలో డిజి ఏర్పాటుచేసి పెద్ద పెద్ద శబ్దాలతో చిందులేస్తూ మద్యం తాగుతున్నారు. లోపల ఏర్పాటు చేసిన ఒక బల్బు పగలడంతో మీరే పగలగొట్టారంటూ లోటస్ ఫుడ్‌సిటీ సిబ్బంది వచ్చిన యువకులతో ఘర్షణకు దిగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి గుంటూరు నుంచి ఆ మార్గంలోనే రావడంతో ముందు ఉన్న గేటు మూసివేసి యువకులను లోపలే బంధించారు. దీంతో రెచ్చిపోయిన వారు ఫుడ్‌సిటీ సిబ్బందిపై తిరగబడ్డారు. సిబ్బంది ముగ్గురు యువకులను చితకబాదారు. బల్బు పగలగొట్టిందని తాము కాదని చెబుతున్నా వినకుండా దాడి చేశారు. విషయం తెలుసుకున్న విలేకరులు అక్కడికి వెళ్లగా వారిపై కూడా దౌర్జన్యం చేసి సెల్‌ఫోన్‌లు, కెమెరాలు లాక్కొన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమ వెనుక రాజకీయ నాయకులున్నార ంటూ దుర్భాషలాడారు.
నిబంధనలెక్కడ..
నిబంధనలకు విరుద్ధంగా రేయింబవళ్లు మద్యాన్ని అమ్ముతూ తమ జేబులు నింపుకొంటున్నా, అసలు రేటు కంటే ఎక్కువకు అమ్ముతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్పీడ్‌బార్‌కి అనుమతి ఉందంటూ 24 గంటలూ నిర్వహించినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. రోజూ ముఖ్యమంత్రి తిరిగే ఈ రహదారిలో ఇలా బార్ అండ్ రెస్టారెంట్‌లు, పబ్‌లు నిర్వహిస్తే అరాచకశక్తులు దాన్ని ఆసరాగా చేసుకునే అవకాశం ఉందని పలువురు ఉన్నత స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.