-
ఆదిలో ఎదురయ్యే అవరోధాల్ని అధిగమిస్తేనే పురోగతి
-
లక్ష్యసాధనకు కృషి, ప్రణాళికలే కీలకం
వెలుగుబంద (రాజానగరం) :
ఇంజనీరింగ్ చదువును మంచి ఉపాధికి మార్గంగా ఎంచుకుని ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఆ కోర్సులో చేరుతున్నారు. అయితే ఎంచుకున్న చదువుతో లక్ష్యాలను చేరుకోవాలంటే అంతకు మించిన సాధన ఉండాలంటున్నారు అధ్యాపకులు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో మొదటి సంవత్సరం ఎంతో కీలకమని, దానిని నిర్లక్ష్యం చేస్తే భవిషత్తు అంత ఆశాజనకంగా ఉండదని హెచ్చరిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇంటర్‌లో 90 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ పరీక్షల్లో తప్పుతున్నారంటున్నారు. మొదటి సంవత్సరంలోనే కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడం వలన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో అవకాశం వచ్చినా∙ఉద్యోగాలు పొందలేకపోతున్నారంటున్నారు. ఇందుకుగల కారణాలను పరిశీలిస్తే.. కళాశాలలో చేరినప్పటి నుంచి విద్యార్థి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కూడా లక్ష్య సాధనకు అవరోధాలుగా పరిగణిస్తున్నాయంటున్నారు.
సీనియర్స్ ర్యాగింగ్
ఇంజనీరింగ్‌లో చేరిన వెంటనే విద్యార్థులు ఎదుర్కొనే సమస్య సీనియర్ల నుంచి ర్యాగింగ్. విద్యాభ్యాసంలో ఆదర్శంగా ఉంటూ జూనియర్లకు మెళకువలు, సూచనలు ఇవ్వవలసిన సీనియర్లు ర్యాగింగ్‌తో ఇంజనీరింగ్ విద్యపై భయాన్ని కలిగిస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ఇటువంటి వాతావరణానికి జూనియర్లు దూరంగా ఉండాలి.
‘బట్టీపట్టుడు’ కాదు..పట్టు ముఖ్యం
ఇంజనీరింగ్ విద్యలో ప్రతి విద్యార్థికీ సబ్జెక్టుపై పట్టు ఉండాలి. అందుకు బట్టీ పట్టే విధానం సరైంది కాదు. ఆయా సబ్జెక్టులపై విశ్లేషణ, అవగాహన ఉండేలా తరగతుల్లో అధ్యాపకులు చెప్పే విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుంటూనే పుస్తక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
సమయ పాలనా కీలకం..
రోజుకు ఎన్ని గంటలు, ఏఏ సమయంలో చదువుకు కేటాయించాలి, ఏ సమయంలో ఆటవిడుపుగా గడపాలి అనే విషయమై విద్యార్థికి ప్రణాళిక అవసరం. సమయ పాలన (టైమ్ మేనేజ్‌మెంట్) ఎవరికైనా మంచి ఫలితాలను అందిస్తుంది. మెుబైల్, టీవీ, చిట్‌చాట్ వంటి వాటితో సమయాన్ని వృథా చేసుకోకుండా నిర్ణీత సమయాన్ని చదువుకు కేటాయిస్తే సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి వీలుంటుంది.
లక్ష్యం ఉండాలి..
లక్ష్యం నిర్ణయించుకుంటేనే దానిని సాధించేందుకు తపనతో కృషి చేస్తుంటాం. అలాగే విద్యార్థి చదువులో కూడా లక్ష్యం నిర్ణయించుకుంటేనే సెమిస్టర్ నుంచి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ వరకూ అనుకున్న విజయాలను సాధించడం సుసాధ్యం అవుతుంది. లక్షా్యనికి అనుగుణంగా తనలో ఉన్న లోపాలను సరిచేసుకోవడంతోపాటు ఉన్న నైపుణ్యాలను మరింతగా వృద్ధి చేసుకునేందుకు దృష్టిని సారిస్తాడు. తద్వారా ప్లేస్‌మెంట్‌లో కూడా లక్షా్యన్ని చేరుకుంటాడు.
భాషా పరిజ్ఞానాన్నిపెంపొందించుకోవాలి..
విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, భావప్రకటనకు సంబంధించిన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయని అనేక సాఫ్ట్‌వేర్ సంస్థలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తరుణంలో తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరిన నాటి నుంచి భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆంగ్ల దినపత్రికలు, మేగజైన్లు చదవడానికి, వార్తలను వినడానికి రోజూ కొంత సమయం కేటాయించాలి.
– బాసిరెడ్డి రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీవీసీ కళాశాల, పాలచర్ల
తల్లిదండ్రుల బాధ్యత..
‘ఇంజనీరింగ్‌లో చేర్పించాం, మన బాధ్యత అయిపోయిం’దని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. అది సరికాదు.. కళాశాలకు వెళ్లిన విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటోంది అనే విషయాలను తరచూ తెలుసుకోవాలి. కనీసం నెలకోసారైనా సంబంధిత అధ్యాపకుని కలిసి, ఆ విద్యార్థి తీరును తెలుసుకోవాలి. అలాగే సెమిస్టర్ పరీక్షలో ప్రగతిని కూడా పరిశీలిస్తుండాలి.
కొత్త ఆలోచనలతోనేరాణింపు..
ఇంటర్ వరకూ ఏవిధంగా చదివినా.. ఇంజనీరింగ్‌లో చేరిన నాటి నుంచీ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆంగ్లభాషపై మంచి పట్టును సాధించే దిశగా ప్రతి విద్యార్థీ కసరత్తు చేయాలి. అలాగే సబ్జెక్టుపై పరిజ్ఞానంతోపాటు కొత్త ఆలోచనలతో నూతనావిష్కరణల వైపు పయనించే వారికే రాణింపు ఉంటుంది.
– డాక్టర్ ఎస్.సూర్యనారాయణరాజు, ప్రిన్సిపాల్, గైట్ ఇంజనీరింగ్ కళాశాల
ఫస్ట్ ఇయర్ పునాది వంటిది..
ఇంజనీరింగ్ విద్యలో మొదటి సంవత్సరం ఎంతో కీలకమైనది. నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఒక రకంగా పునాది వంటిది. ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా దారుణమైన ఫలితాలను చవిచూడవలసి వస్తుంది. పట్టుదలతో ఫస్ట్ ఇయర్‌ని పూర్తి చేస్తే సెకండ్ ఇయర్ నుంచి వారు ఎంచుకున్న కోర్ సబ్జెక్టులపై దృష్టిని సారించడానికి అవకాశం ఉంటుంది.
– ప్రొఫెసర్ టి.చంద్రశేఖర్,హెచ్‌ఓడీ, ఈసీఈ, గైట్ కళాశాల