బీసీల సంక్షేమమే ధ్యేయం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
వెనుకబడిన తరగతుల సంక్షమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో చంద్రన్న బీసీ స్వయం ఉపాధి ఉత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించి, 4013 మందికి రూ.102 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 897 హాస్టళ్లలో లక్ష మంది, 32 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 16 వేల మంది, 370 బీసీ కళాశాల వసతి గృహాల్లో 36 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అన్ని బీసీ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 1000 మందిని విద్యోన్నతి పథకం ద్వారా విదేశాల్లో చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైతే బ్యాంకుల ద్వారా ఒక్కోక్కరికీ రూ. 10 లక్షలు రుణం ఇప్పిస్తామన్నారు. గతంలో మత్స్యకారులకు పడవలు పంపిణీ చేశామని, ఈసారి పడవలతో పాటు వలలు కూడా అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 150 ఎకరాలు సేకరించి బీసీ యువ పారిశ్రామిక వేత్తలకు అందజేస్తామన్నారు. బీసీల్లోని అన్ని కులాల కోసం 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తామన్నారు.
రూ. 5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణం
అన్ని జిల్లాల్లోని ముఖ్య కేంద్రాల్లో రూ.5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జెడ్పీచైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ బీసీలందరూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ హర్షవర్ధన్, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జ్యోతి, డీడీ ఎం.చినబాబు పాల్గొన్నారు.
సభ మొత్తం విద్యార్థులే..!
ఆనం కళా కేంద్రంలో జరిగిన బీసీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎటు చూసినా 18 ఏళ్లలోపు విద్యార్థులే కనిపించారు. లబ్ధిదారులు, నాయకులు కలిపి సుమారు 150 మంది ఉన్నారు. సభను విజయవంతం చేసేందుకు నగరంలోని రామకృష్ణ మఠం, దానవాయిపేట, గణేష్‌చౌక్, సీతంపేట, టీటీడీ కల్యాణ మండపం సమీపం, టూ టౌన్ ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు సుమారు 1100 మందిని ఆటోల్లో ఆనం కళాకేంద్రానికి తరలించారు.