బీసీ హాస్టళ్లకు విలీనం ముప్పు
-
తక్కువుంటే తరలించడమే..!
-
నాలుగు హాస్టళ్ల తరలింపునకు ఆదేశాలు
-
విద్యార్థుల కొరతతోనే ఉత్తర్వులు
భీమదేవరపల్లి : సంక్షేమ హాస్టళ్లను విద్యార్థుల కొరత వెంటాడుతోంది. సరిపడా సంఖ్యలో విద్యార్థులు లేని హాస్టల్‌ను పొరుగునే ఉన్న మరో హాస్టల్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు హాస్టళ్లను ఆగస్టు ఒకటి లోపు తరలించేందుకు జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో హాస్టల్‌లో ప్రవేశాలు కావాలంటే పైరవీలు నడిచేవి. ప్రస్తుతం ప్రతి మండలంలో కస్తూరిబా, మోడల్ స్కూల్స్ ఏర్పాటు కావడం.. అక్కడే హాస్టళ్లు నిర్మించడంతో వాటి ప్రభావం వసతి గృహాలపై పడుతోంది.
జిల్లాలోని ఎలిగేడు బీసీ హాస్టల్‌లో 100 మంది విద్యార్థులకు కేవలం 25 మంది, కాటారం మండలం దామెరకుంట బీసీ హాస్టల్‌లో 15 మంది, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బీసీ హాస్టల్‌లో 17మంది, చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో 22మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ హాస్టళ్లలో 100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. కనీసం 50 మంది విద్యార్థులు లేని పక్షంలో అట్టి హాస్టళ్లను విలీనం చేస్తామని గతేడాది జిల్లా అధికారుల నుంచి ఆయా వసతి గృహాల వార్డెన్‌లకు ఆదేశాలు అందాయి.
విలీనం భయంతో కొన్నిచోట్ల వార్డెన్‌లు నానా తంటాలు పడి విద్యార్థులను వసతిగృహాల్లో చేర్పించారు. కానీ.. ఎలిగేడు, దామెరకుంట, ముల్కనూర్, బొమ్మనపల్లి బీసీ వసతి గృహాలకు మాత్రం విద్యార్థులు రాలేకపోయారు. ఈ క్రమంలో వీటిని సమీప వసతి గృహాల్లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎలిగేడు వసతి గృహాన్ని సుల్తానాబాద్‌కు, దామెరకుంట హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్టీ ఆశ్రమ హాస్టల్‌కు, ముల్కనూర్ హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ వసతి గృహానికి, బొమ్మనపల్లి హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో విలీనం చేశారు. వీరందరినీ ఆగస్టు ఒకటి లోపు తరలించాలని సిరిసిల్ల ఏబీసీడబ్ల్యూవో రాజమనోహర్ వెల్లడించారు.