హక్కులను హరిస్తే సహించేది లేదు
హక్కులను హరిస్తే సహించేది లేదు
Published Fri, Mar 3 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు
రావులపాలెం(కొత్తపేట) : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాలనే కోరిక అసమంజసమైనదని దీనిని తిరస్కరిస్తూ మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, తదితర అన్ని రంగాల్లో కాపులు ముందంజలో ఉన్నారన్నారు. సంచార జీవులు వివక్షకు గురైన కులాలను గుర్తించి ఆనాడు అంబేడ్కర్ బీసీ రిజర్వేషన్లు కల్పించారన్నారు. నేడు కాపులు వివక్షకు గురికాలేదని వారు సంచార జీవులుకాదని బీసీల్లో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుకు చేర్చే అధికారం లేదన్నారు. మంజునాథ కమిషన్ కేవలం బీసీ కులాల స్థితిగతులను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే తప్ప కాపును బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిటీ కాదని ఆయన స్పష్టం చేశారు. మంజునాథ కమిషన్ ఇప్పటికే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిందని తూర్పుగోదావరి జిల్లా మిగిలిఉందని చెప్పారు. ఇప్పటికీ బీసీ కులాలు అనుభవిస్తున్న సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటుతనం గురించి కమిషన్‌కు వివరించామన్నారు. కాపు సంఘ నాయకులు కూడా తాము సాంఘికంగా ఎలా వెనుకబడి ఉన్నామో కమిషన్‌కు ఆధారాలు చూపలేకపోయారని, ఈ పరిస్థితుల్లో కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యం కాదనే నివేదికను నిస్పక్షపాతంగా ఇవ్వాల్సి ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లోను, స్థానిక సంస్థల్లోను రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతూ నివేదిక సమర్పించడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్ హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లిన సహించేది లేదని న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు, రావులపాలెం, కొత్తపేట మండలాల అధ్యక్షుడు ఇళ్ల సతీష్, గుబ్బల వీర్రాజు, గుబ్బల వెంకటరమణ పాల్గొన్నారు.
Advertisement