వేటగాళ్ల ఉచ్చులో ఎలుగు బంటి
వేటగాళ్ల ఉచ్చులో ఎలుగు బంటి
Published Sat, Feb 11 2017 9:49 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ బైర్లూటి రేంజ్‌లోని రామయ్య కుంట బేస్ క్యాంపు సమీపంలో శనివారం.. ఎలుగు బంటి వేటగాళ్లు ఏర్పాటు చేసుకున్న ఉచ్చులో చిక్కింది. సమీపంలో ఉన్న నీటి వనరు వద్దకు దాహం తీర్చుకునేందుకు వచ్చే వన్య ప్రాణులు లక్ష్యంగా గుర్తు తెలియని వేటగాళ్లు ఈ ఉచ్చు పన్నారు. దాహం తీర్చుకోడానికి వచ్చిన మగ ఎలుగు బంటి ఉచ్చుకు చిక్కింది. ఉచ్చు బిగుసుకుంటూ ఉంటే ఉక్కిరిబిక్కిరై పెద్ద ఎత్తున అరవడంతో సపమీపంలో ఉన్న రామయ్య కుంట బేస్ క్యాంపు సిబ్బంది అప్రమత్తమయ్యారు.
రేంజర్ శంకరయ్య సంఘటనా స్థలానికి వెళ్లి ఉచ్చు విడిపించేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉండే వైల్డ్ లైఫ్ రెస్క్యూ వ్యాన్‌ను పిలిపించారు. అందులో ఉన్న నిపుణులు ఎలుగు బంటిపై తుపాకి ద్వారా మత్తు సూదిని ప్రయోగించి స్పృహ పోగొట్టారు. తరువాత ఉచ్చునుంచి తప్పించి ఎలుగును బోనులోకి చేర్చారు. అనంతరం పశు వైద్యాధికారిని పిలిపించి ఎలుగుబంటిని పరీక్షించారు. జంతువు తీవ్రమైన అతిసారానికి గురయిన విషయాన్ని గమనించిన వైద్యుడు.. వైద్యం చేశారు. మరో 10 గంటల పర్యవేక్షణ అనంతరం ఎలుగు బంటి స్థితిని బట్టి అడవిలో వదిలివేసే అంశం డీఎఫ్‌వో సెల్వం పరిశీలనలో ఉంది. కాగా.. ఎలుగు బంటి ఉచ్చులో పడిన అంశంపై అటవీ శాఖ అతి గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Advertisement
Advertisement