ఓయూలో ‘బీఫ్’ టెన్షన్!
♦ నివురుగప్పిన నిప్పులా వర్సిటీ
♦ ఈ నెల 10న పెద్దకూర పండుగ చేస్తామంటున్న నిర్వాహకులు
♦ అడ్డుకుని తీరుతామంటున్న హిందూ సంస్థలు
♦ వర్సిటీలో ఎలాంటి పండుగలకు అనుమతి లేదు: పాలకవర్గం
♦ క్యాంపస్‌లో భారీగా మోహరించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ నెల 10న వర్సిటీలో ‘బీఫ్ ఫెస్టివల్ ’ నిర్వహించి తీరుతామని డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ (25 విద్యార్థి సంఘాల కూటమి) స్పష్టం చేయగా.. హిందూ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తూ వర్సిటీలో పెద్దకూర పండుగ నిర్వహిస్తే అడ్డుకుని తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా ఏబీవీపీ, ఇతర హిందూ మత సంస్థల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
దళితుల సంస్కృతిలో భాగమైన పెద్దకూర పండుగను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ వర్సిటీలో 2కే రన్ నిర్వహించగా.. విద్యార్థుల సమస్యల పేరుతో ఏబీవీపీ వర్సిటీ బంద్ నిర్వహించింది. ఈ సమయంలో ఇరు సంఘాలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఏబీవీపీ, డీసీఎఫ్ విద్యార్థి సంఘాలు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో వర్సిటీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భయంతో కొంతమంది విద్యార్థులు హాస్టళ్లను వీడి సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు.
బీఫ్.. హెచ్‌సీయూ టు ఓయూ
హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వ హించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సమయంలో కొంత మంది దళిత, వామపక్ష విద్యార్థి సంఘం నేతలు తమ సంస్కృతిలో భాగమైన పెద్దకూర పండుగను తామెందుకు నిర్వహించకూడదని భావించారు. దీంతో అప్పటి వరకు కేవలం సెంట్రల్ వర్సిటీకే పరిమితమైన పెద్దకూర పండుగను 2012లో తొలిసారిగా ఓయూ క్యాంపస్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)కి విస్తరింపజేశారు. అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. చివరకు విద్యార్థుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. 2013లో ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్‌లో తొలిసారిగా నిర్వహించారు. అలా ఓయా క్యాంపస్‌లోకి ప్రవేశించిన పెద్దకూర పండుగ ఏటా వివాదాస్పదం అవుతూనే ఉంది. గతంతో పోలిస్తే ఈ సారి హిందూ మత సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అనుమతి లేదు: వర్సిటీ పాలకవర్గం
ఓయూలో బీఫ్ ఫెస్టివల్ సహా ఎలాంటి పండుగలకు అనుమతి లేదని వర్సిటీ పాలక వర్గం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పండుగల నిర్వహణ విషయంలో తమకు ఎవరి అనుమతి అక్కర్లేదని నిర్వాహకులు చెప్పుతుండగా.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హిందూ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా ముందస్తుగా క్యాంపస్ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తార్నాక, విద్యానగర్ ప్రధాన ద్వారాల వద్ద భారీగా బలగాలను మోహరించారు.
20వరకు వద్దు
బీఫ్ ఫెస్టివల్‌పై కోర్టు ఆదేశం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 10న నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్‌కు బ్రేక్ పడింది! ఓయూ ఆవరణలో ఈ నెల 20 వరకు ఎలాంటి పండుగలు, వేడుకలు నిర్వహించరాదని, యథాతథ స్థితి కొనసాగించాలని సిటీ సివిల్ కోర్టు వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ న్యాయ శాస్త్ర పరిశోధన విద్యార్థి సుంకరి జనార్దన్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సోమవారం విచారణ చేపట్టారు. విద్యార్థుల ఆహారపు అల వాట్లకు విరుద్ధంగా ఎద్దు మాంసంతో వం డిన ఆహారాన్ని క్యాంపస్ విద్యార్థులకు ఇవ్వనున్నారని, ఇది హిందువుల మనోభావాలను కించపర్చేదిగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీధర్ తెలిపారు. 2012లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినపుడు ఘర్షణలు జరిగి విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి యథాతథ స్థితి కొనసాగించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.