beef festival
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఇటీవలె నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. (రాజాసింగ్‌కు షాక్.. ఏడాది జైలు శిక్ష) -
రాజా సింగ్‌కు షాక్.. ఏడాది జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షాక్ తగిలింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐదు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియో కలకలం) ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్ తెలిపారు. -
బీఫ్ తిన్నాడని సీటు ఇవ్వలేదు!
సాక్షి, హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్లో బీఫ్ తిన్నాడనే కారణంతో ఓ విద్యార్థికి సీటు నిరాకరించడం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో వివాదానికి దారి తీసింది. హైదరాబాద్‌లోని ఇఫ్లూ కాలేజీలో కేరళకు చెందిన జలీస్ ఈ ఏడాది ఎంఏ అరబిక్ పూర్తి చేశాడు. అరబిక్‌లో పీహెచ్డీ ఎంట్రన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేశాడు. హాల్‌టికెట్ డౌన్లోడ్ కాకపోవడంతో యాజమాన్యాన్ని సంప్రదించాడు. గత ఏడాది ఇఫ్లూలో జరిగిన బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్నాడన్న కారణంగా ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు యాజమాన్యం తిరస్కరించిందని ప్రొక్టర్ ప్రకాశ్ కోన జలీస్కు తెలిపారు. ఎందుకని నిలదీయడంతో బీఫ్ తిన్న కారణంగా అతనిపై క్రిమినల్ కేసు ఉందని సమాధానం ఇవ్వడంతో జలీస్ నిర్ఘాంతపోయాడు. పీహెచ్డీ ఎంట్రన్స్ హాల్‌టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడంతో.. జలీస్ బీఏ రష్యన్ ఎంట్రన్స్కి ఆన్లైన్లో అప్లై చేశాడు. ఎంట్రన్స్‌లో అతనికి 76 మార్కులతో సెకండ్ లిస్ట్‌లో సీటు వచ్చింది. వర్సిటీ వెబ్సైట్లో, కాలేజీలో లిస్ట్ కూడా ప్రకటించారు. అడ్మిషన్ కోసం వర్సిటీకి వెళ్లిన జలీస్కి మరోసారి తిరస్కరణే ఎదురైంది. పై కారణంగానే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు యాజమాన్యం, ప్రొక్టర్ ప్రకాశ్ కోన చెప్పడంతో జలీస్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కాగా, ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులను సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. బీఫ్ తినడం నేరమెలా అవుతుంది: జలీస్ ఇఫ్లూలో డిసెంబర్ 10న ఓయూ విద్యార్థులకు సంఘీభావంగా జరిగిన సమావేశంలో తాను విద్యార్థుల పక్కన నిలబడి ఉన్నానని, తనపై క్రిమినల్ కేసు ఎప్పుడు, ఎలా నమోదైందో తనకు తెలియదని జలీస్ చెబుతున్నాడు. బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్నానన్న కారణంతో తన అడ్మిషన్‌ను తిరస్కరించినట్టు రాతపూర్వక సమాధానాన్ని కోరుతూ వర్సిటీ వీసీకి లేఖ రాసినా స్పందన లేదని చెప్పాడు. బీఫ్ తిన్నా అది నేరమెలా అవుతుందని ప్రశ్నించాడు. అది తమ ఆహారమని, ఇఫ్లూలో అడ్మిషన్‌కి తన ఆహార అలవాటు ఆటంకం ఎలా అవుతుందో అర్థం కావడంలేదని జలీస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. బీఫ్ తిన్నాడన్న కారణంతో విద్యార్థుల అడ్మిషన్లను కుట్రపూరితంగా యాజమాన్యం అడ్డుకుంటోందని, ఇఫ్లూ ఎంట్రన్స్‌ల్లో విద్యార్థుల మార్కులకు బదులు మాంసాహారులను లెక్కిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
బస్సులపై రాళ్లు రువ్విన 9మంది అరెస్ట్
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆర్టీసీ బస్సులపైకి రాళ్లు రువ్విన అల్లరిమూకను పోలీసులు గుర్తించారు. ఓయూలోకి అనుమతించాలని గురువారం హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు ఎన్సీసీ గేటు వద్ద ఆందోళనకు దిగిన సందర్భంలో పోలీసులు వాళ్లను అనుమతించకుండా గేటు బయట అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన కార్యకర్తలు ఆర్టీసీ బస్సులపైకి రాళ్లు రువ్వారు. దీంతో రెండు బస్సుల అద్దాలు పగలడంతో పాటు డ్రైవర్లకు గాయాలయ్యాయి. సీసీ టీవీల ఫూటేజి ఆధారంగా నిందితులను గుర్తించిన చిక్కడపల్లి పోలీసులు రాళ్లు రువ్విన 9 మందిని శుక్రవారం అరెస్ట్ చేశారు. -
ఉస్మానియాలో 12మంది విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్ : కోర్టు ఆదేశాలను దిక్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించిన పలువురు విద్యార్ధులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐపీసీ 153A, 188, 290 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టయిన విద్యార్ధులలో గద్దల అంజిబాబు, నవీన్ యాదవ్, కొమ్ము శేఖర్, మంథని కుమార్, రవీందర్, ఉప్పలయ్య, శంకర్, ప్రసాద్ సురేష్, లక్ష్మణ్, సుదర్శన్, ఈశ్వర్ ఉన్నారు. వీరందరిని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
బీఫ్ ఫెస్టివల్ భగ్నం
♦ భారీ బందోబస్తుతో అడ్డుకున్న పోలీసులు ♦ ఖాకీల దిగ్బంధంలో ఓయూ ♦ సీ హాస్టల్ వద్ద లాఠీచార్జి.. విద్యార్థుల అరెస్ట్ ♦ హాస్టళ్లలోనే బీఫ్ వంటకాల ఆరగింపు ♦ ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం.. అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన బీఫ్ ఫెస్టివల్‌ను పోలీసులు భగ్నం చేశారు. ముందుగా ప్రకటించినట్లే ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద గురువారం ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక(డీసీఎఫ్) సభ్యులు ఫెస్టివల్ నిర్వహణకు యత్నించారు. అయితే వర్సిటీలో 600కుపైగా పోలీసుల మోహరింపు, డీసీఎఫ్ నేతల ముందస్తు అరెస్ట్‌లతో ఇది సాధ్య పడలేదు. దీంతో అప్పటికే బీఫ్ వంటకాలు సిద్ధం చేసుకున్న డీసీఎఫ్ సభ్యులు తమ హాస్టళ్లలోనే ఒకరికొకరు పంచుకుని తిన్నట్లు తెలిసింది. ఇంకొందరు ఎన్సీసీ గేటు సమీపంలోని త్రివేణి హాస్టల్లో వండుకుని తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వాట్సప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లోకి పోస్ట్ చేశారు. వీటిని చూసి కోపోద్రిక్తులైన బజరంగ్దళ్ , ఏబీవీపీ, గో సంరక్షణ సమితి కార్యకర్తలు ఓయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు ఓయూ వద్ద బందోబస్తు కొనసాగింది. బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతు పలికిన వారితోపాటు, నిర్వహణను అడ్డుకునేందుకు యత్నించిన 300 మందికిపైగా అరెస్టయ్యారు. వీరందరినీ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. అరెస్టయిన వారిలో ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆందోళనకారులు పలుచోట్ల ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఒక డ్రైవర్ గాయపడ్డారు. లాఠీచార్జీలు.. అరెస్టులు ఓయూలో మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీ హాస్టల్ వెనుక వైపు కొందరు విద్యార్థులు బీఫ్ వంటకాలు తింటూ నినాదాలు చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారి వెంట పడి లాఠీచార్జి చేశారు. కొందరు విద్యార్థులు హాస్టల్ గదుల్లోకి వెళ్లి త లుపులు వేసుకోగా.. మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలోకి వెళ్లే అన్ని దారులను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎక్కడి కక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు, చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓయూలోకి ఇతరులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. విలేకరులను కూడా లోనికి అనుమతించలేదు. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ శివసేన నాయకులు గుట్టు చప్పుడు కాకుండా చెట్ల పొదల మాటున ఓయూలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా ఓయూలోకి వెళ్లేందుకు యత్నించిన పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయూ నాయకులను ఎన్సీసీ గేట్ వద్ద అడ్డుకున్నారు. ఫెస్టివల్ నిర్వహించకుండా నిర్బంధం విధించినా విద్యార్థులు బీఫ్ తిని విజయవంతం చేశారని డీసీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. కాగా, వర్సిటీలో ఎలాంటి పండుగలు నిర్వహించరాదన్న కోర్టు ఆదేశాల మేరకు ఓయూలో గురువారం నిర్వహించ తలపెట్టిన పందికూర పండుగను రద్దు చేసుకున్నట్లు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సోలం కి శ్రీనివాస్ తెలిపారు. ఓయూలో కొన్ని విద్యా ర్థి సంఘాల నాయకులు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్, ఫోర్క్ ఫెస్టివల్ పండుగలకు విద్యార్థుల మద్దతు లేదని తేలిపోయిందని ఏబీవీపీ జాతీయ నాయకులు కడియం రాజు పేర్కొన్నారు. పోలీసులు బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు విప్లవ రచయితల సం ఘం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం యోగా, గోవధ పేరుతో అలజడి సృష్టిస్తోందని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని విరసం నేత వరవరరావు దుయ్యబట్టారు. రాజాసింగ్ అరెస్ట్ బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటానని హెచ్చరించిన ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాను గురువారం ఉదయమే పోలీసు లు అరెస్టు చేశారు. మొదటగా గృహ నిర్బం ధం చేసిన ఆయన్ను తర్వాత.. షాహినాయత్ పోలీసులు గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. అక్క డి నుంచి బొల్లారం పీఎస్‌కు తీసుకెళ్లారు. ఢిల్లీలోనూ బీఫ్ ఫెస్టివల్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) నేతలు గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం అరెస్టులకు పాల్పడిందని, అందుకే ఢిల్లీలో నిర్వహించామని టీవీవీ అధ్యక్షుడు నూకల మహేశ్ పేర్కొన్నారు. -
'పండుగ అయిపోయిందిగా.. వెళ్లిపోండి'
హైదరాబాద్: బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు గత రాత్రి నుంచి ఎన్ఆర్ఐ హాస్టల్ ను పోలీసులు దిగ్బందించారని బీఫ్ పెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు వల్ల కనీసం మంచినీరు కూడా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. నీళ్లు తాగుదామని బయటకు వస్తే అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్నారని చెప్పారు. రాత్రి కూడా మెస్ లు తెరవొద్దని ఆదేశాలు ఇచ్చారని, ఈ చర్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహణ సమయం ముగిసిపోయినందున ఓయూ క్యాంపస్ నుంచి పోలీసులు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. -
కోర్టు వద్దన్నా పెద్దకూర పండుగ...
హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని హైకోర్టు ఆదేశించినా, మరోవైపు ఓయూలో గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలతో పాటు, వీడియోలు కూడా మీడియాకు అందాయి. ఈ క్రమంలో ఓయూలో బీఫ్ ఫెస్టివల్ జరిగినట్లు వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా తెలుసుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఓయూలోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన పలువురు బీజేపీ, బజరంగ్దళ్ కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సుపైకి రాళ్లు రువ్వారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు, కార్యకర్తల అరెస్ట్‌లతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాగా ఓయూలో అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతోనే ఉంది. బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. పెద్దకూర పండుగ నిర్వహించేందుకు యత్నించిన పలువురు విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే గో పూజ నిర్వహించేందుకు... ఓయూలో వెళ్లేందుకు యత్నించిన ఏబివిపి, గోసంరక్షణ సమితి, భజ్రంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎలాగైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతుండగా.. ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. గేట్లు మూసివేసి.. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు. లోపలికి వెళ్లినవారిని సైతం బయటకు పంపించి విద్యార్థి నేతల కోసం ఆరాతీశారు. ఎన్సీసీ గేటు సమీపంలో ఉన్న కావేరి హాస్టల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నర్మద వసతిగృహంతో పాటు ఇతర చోట్ల విస్తృతంగా గాలించారు. డీసీపీ చంద్రశేఖర్ రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేది విద్యార్ధులైతే అడ్మిషన్లు రద్దు చేస్తామని ఓయూ రిజిస్ట్రార్ హెచ్చరించారు. -
రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గోషామహల్ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో గురువారం ఛలో ఓయూకు పిలుపునిచ్చిన ఆయనను మంగళ్‌హాట్‌లోని తన నివాసంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు అనుమానితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, బీఫ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో ఆందోళనలు పెద్ద ఎత్తునా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆర్టీసీ బస్సులపై రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. -
ఓయూలో ప్రొ.విశ్వేశ్వరరావు అరెస్ట్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పీ.ఎల్ విశ్వేశ్వరరావును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బీఫ్ ఫెస్టివల్ జరపాలని డిమాండ్ చేస్తూ ఓయూలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీసీ గేట్ వద్దకు ఏబీవీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఓయూలో పెద్దకూర పంచాయతీ
-
గో పూజ నిర్వహించిన స్వామి పరిపూర్ణానంద
హైదరాబాద్: లోయర్ ట్యాంక్ బండ్ భాగ్యనగర్ గోశాలలో గురువారం శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ గో పూజను నిర్వహించారు. గోవులను పూజించడం సనాతన ధర్మమని...బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచన రావడం దౌర్భాగ్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి డిసెంబర్ 10వ తేదీని గోరక్ష దివస్‌గా నిర్వహించాలని స్వామిజీ సూచించారు. గో ఆధారిత వ్యవసాయంతోనే రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చునని... తెలుగు రాష్ట్రాల్లో గోరక్ష క్రాంతి ఫథకం కింద రైతులకు ఆవులను పంపిణీ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆవును ప్రజలు పశువుగా, జంతువుగా చూడకూడదని... ఆవు పాలు తాగితే మంచిదని...దీనిపై విస్తృత ప్రచారం జరగాలని స్వామిజీ సూచించారు. గోవధ అనే మాట పలకడమే పెద్ద నేరమని, దానికి 6 నెలల శిక్ష కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చట్టాలను కఠినంగా అమలు చేయాలని పరిపూర్ణానంద స్వామిజీ ప్రభుత్వాలను కోరారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
హైదరాబాద్ : ఛలో ఓయూకు పిలుపునిచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మంగళ్‌హాట్‌లోని ఆయన నివాసంలోనే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు అనుమానితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోబోమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసినా.. నిర్వాహకులైన ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ప్రతినిధులు మాత్రం తమ పట్టువీడటం లేదు. అయితే, ఎలాగైనా అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ప్రకటించడంతో అందరి చూపు ఓయూపైనే కేంద్రీకృతమైంది. మరోపక్క ఖాకీల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దకూర పండుగ నిర్వహణకు పిలుపునిచ్చిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓయూలోని ఎన్ఆర్ఎస్ హాస్టల్‌ను దిగ్భందించారు. అలాగే ఇతరులతో పాటు మీడియాకు కూడా క్యాంపస్ లోనికి అనుతమించడం లేదు. -
ఓయూలో ఉద్రిక్తత.. ఉత్కంఠ
-
ఓయూలో ఉద్రిక్తత.. ఉత్కంఠ
♦ నేడు బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు డీసీఎఫ్ ఏర్పాట్లు ♦ బీఫ్ వంటకాలతో ఓయూకు రావాలని పిలుపు ♦ పది మంది అరెస్ట్ ఎన్ఆర్ఎస్ హాస్టల్‌ను దిగ్బంధించిన ఖాకీలు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోబోమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసినా.. నిర్వాహకులైన ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ప్రతినిధులు మాత్రం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే, ఎలాగైనా అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ప్రకటించడంతో అందరి చూపు ఓయూపైనే కేంద్రీకృతమైంది. మరోపక్క ఖాకీల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దకూర పండుగ నిర్వహణకు పిలుపునిచ్చిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓయూలోని ఎన్ఆర్ఎస్ హాస్టల్‌ను దిగ్భందించారు. పోలీసులు లోనికి రాకుండా విద్యార్థులు తలుపులు మూసి అడ్డుకున్నారు. డీసీఎఫ్ నేతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అరె స్ట్ చేసేందుకు వ్యూహాలను అనుసరిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో త్రివేణి హాస్టల్ వద్ద కోట శ్రీనివాస్‌గౌడ్, బద్రిలతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఓ చానల్ కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చిన ఓయూ మాదిగ విద్యార్థి సమాఖ్య ఇన్చార్జి అలెగ్జాండర్, ఫెస్టివల్ నిర్వాహకులు సొలంకి శ్రీనివాస్, వీహెచ్‌పీ నేత శశిధర్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిర్ణీత సమయం ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఫెస్టివల్ నిర్వహిస్తామని డీసీఎఫ్ సభ్యులు మరోసారి స్పష్టం చేశారు. ‘వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదన్న కోర్టు తీర్పు ప్రతిలో ప్రతివాదిగా ఎం. కృష్ణ పేరును చేర్చారు. ఓయూకు ఇతనికి సంబంధం లేదు’ అని డీసీఎఫ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దళిత, బహుజన, మైనార్టీ విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు ఈ పండగకు బీఫ్ వంటకాలతో హాజరుకావాలని పిలుపునిచ్చారు. దాదాపు 5 వేల మంది పాలుపంచుకుటారని చెప్పారు. ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే.. వారి ఎదుటే బీఫ్ వంటకాలను తిని నిరసన తెలియజేయాలని ప్రకటించారు. అవసరమైతే అంబేద్కర్ విగ్రహాల ఎదుట కూడా బీఫ్ పదార్థాలు తింటూ నిరసన తెలపాలని ఆ వేదిక సభ్యుడు ముసవీర్ విజ్ఞప్తి చేశారు. అడ్డుకుంటాం పెద్దకూర పండుగను అడ్డుకునేందుకు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ‘చలో ఉస్మానియా’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వర్సిటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని ఆ సంఘం చైర్మన్ కల్యాణ్ కోరారు. ఈ ఫెస్టివల్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రకటించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మతతత్వ శక్తులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించారు. నిర్వహణను ప్రతిఘటించేందుకు హిందుత్వ సంస్థల నాయకులు, ప్రతినిధులు, విద్యార్థులు పెద్దఎత్తున ఓయూకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. గో రక్షాదళ్, వీహెచ్‌పీ, శివసేన, భజరంగ్‌దళ్ వంటి సంస్థలూ వ్యతిరేకిస్తున్నాయి. ప్రవేశాలు రద్దు చేస్తాం: రిజిస్ట్రార్ అనుమతి లేని బీఫ్ ఫెస్టివల్ కు హాజరైన విద్యార్థుల ప్రవేశాలను నిర్ద్వందంగా రద్దు చేస్తామని ఓయూ రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్ హెచ్చరించారు. వర్సిటీలో ఎటువంటి పండగలు నిర్వహించకూడదన్న సిటీ సివిల్ కోర్టు తీర్పు ప్రతి తమకు అందినట్లు చెప్పారు. చిలుకూరులో ‘గో ప్రదక్షిణం’ బీఫ్ ఫెస్టివల్‌ను నిలిపేయాలని, భక్తులంతా గో పరిరక్షణకు కట్టుబడి ఉండాలనే సంకల్పంతో బుధవారం చిలుకూరు బాలాజీ ఆలయంలో ‘గో ప్రదక్షిణం’ నిర్వహించారు. ఆలయ సమీపంలోని గోశాల నుంచి గోవులను తెచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. బీఫ్ ఫెస్టివల్‌ను తాను అడ్డుకుంటానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ హెచ్చరించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
మళ్లీ మా ఉత్తర్వులు అక్కర్లేదు
♦ సివిల్ కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే ♦ ఓయూలో బీఫ్ ఫెస్టివల్‌పై హైకోర్టు స్పష్టీకరణ ♦ తినాలనుకున్నది ఇంట్లో తింటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా ♦ స్వార్థపరుల చేతిలో విద్యార్థులు ఉపకరణాలు కారాదు ♦ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు.. విచారణ 11కు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ అంశంపై సిటీ సివిల్ కోర్టు ఇప్పటికే యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసినందున ఈ వ్యవహారంలో మళ్లీ తాము ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. వాటికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా నిర్వాహకులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ సందర్భంగా నిర్వహిస్తున్నారు? ఈ నెల 10న ఓయూలో పెద్దకూర పండుగను జరపకుండా ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్)ను నియంత్రించాలని కోరుతూ వర్సిటీ విద్యార్థి కడియం రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. డీసీఎఫ్ నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్ వల్ల వర్సిటీలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఇప్పటికే ఈ విషయంలో సిటీ సివిల్ కోర్టు యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసింది కదా. మరి ఈ వ్యాజ్యంలో మేమెందుకు జోక్యం చేసుకోవాలి? అసలు ఈ ఫెస్టివల్‌ను ఏ సందర్భంగా నిర్వహిస్తున్నారు’’ అని ప్రశ్నించింది. ఇందుకు సురేందర్‌రావు సమాధానమిస్తూ.. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశ భవిత విద్యార్థుల చేతిలోనే ఉంది విచారణ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. 2011 నుంచి ఓయూలో ఈ పండుగను నిర్వహిస్తున్నారని, దీనిపై ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయని, 8 కేసులు నమోదయ్యాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఓ వర్గం బీఫ్, మరో వర్గం గొర్రె మాంసం, మరో వర్గం బోటి-సవాయి, ఇంకో వర్గం కల్లుతో పండుగలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తినాలనుకుంది ఎవరింట్లో వారు తింటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా..! అసలు వారిని ప్రశ్నించే వారు ఎవ్వరూ ఉండరు. ఈ కార్యక్రమాలు తప్ప విద్యార్థులు నిర్వహించడానికి మరే కార్యక్రమాలు లేవా..? స్వార్థపరుల చేతిలో విద్యార్థులు ఉపకరణాలుగా మారకూడదు. ఏం చేయాలో ఏం చేయకూడదో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే కోర్టు ఉత్తర్వులున్నాయి. వాటిని వారు ఉల్లంఘిస్తారని మేం అనుకోవడం లేదు. ఒకవేళ ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది’’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా మరో న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అందరూ వాటికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇప్పటికే సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున, మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏ మాత్రం కనిపించడం లేదని స్పష్టం చేసింది. -
'ఫెస్టివల్స్‌కు అనుమతి లేదు'
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి ఫెస్టివల్స్‌కు అనుమతి లేదని ఓయూ రిజిస్ట్రార్ బుధవారం తెలిపారు. ఓయూలో ఫెస్టివల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యార్థులను, విద్యార్థి సంఘాల నాయకులను ఆయన హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే విద్యార్థుల అడ్మిషన్లు రద్దుచేస్తామని ఓయూ రిజిస్ట్రార్ వెల్లడించారు. ఈ నెల 10న వర్సిటీలో ‘బీఫ్ ఫెస్టివల్ ’ నిర్వహించి తీరుతామని డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ (25 విద్యార్థి సంఘాల కూటమి) స్పష్టం చేసిన విషయం అందరికీ విదితమే. -
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు గురువారం నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌ను నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బీఫ్ ఫెస్టివల్‌పై కోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహిస్తున్న గోపూజ కార్యక్రమానికి స్వామి పరిపూర్ణానంద హాజరవుతారని తెలిపారు. బీఫ్ ఫెస్టివల్ జరిపితే మాత్రం దాన్ని అడ్డుకుని తీరుతామని రాజాసింగ్ పేర్కొన్నారు. -
బీఫ్ ఫెస్టివల్‌కు హైకోర్టులోనూ చుక్కెదురు
హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులకు హైకోర్టులోనూ చుక్కెదురు అయింది. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు కోర్టు అనుమతి నిరాకరించింది. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సిందేనంటూ బుధవారం ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ జరపవద్దంటూ కడెం రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని స్పష్టం చేసింది. పోలీసులు శాంతిభద్రతలు కాపాడాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ వరకు వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించ కూడదని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న బీఫ్ ఫెస్టివల్‌ని నిర్వహించేందుకు ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) సన్నాహాలు చేస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహణను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. -
'బీఫ్ ఫెస్టివల్లో గోమాంసం ఉండదు'
కాచిగూడ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10వ తేదీన విద్యార్థులు నిర్వహిస్తున్న బీఫ్ ఫెస్టివల్లో నిషేధిత గోమాంసం వండటం లేదని సీపీఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి డాక్టర్ డి.సుధాకర్ తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని లిబర్టీ మీడియా సెంటర్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఫ్ ఫెస్టివల్లో గోమాంసం పెడుతున్నారంటూ కొంత మంది అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీఫ్ ఫెస్టివల్‌కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, ఫెస్టివల్‌ను అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. బీఫ్ ఫెస్టివల్లో గోహత్య జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి ఘర్షణలు సృష్టించడం తగదని పేర్కొన్నారు. -
బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుందాం రండి: శివసేన
కాచిగూడ (హైదరాబాద్) : 'ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న జరిగే బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకుందాం, గోమాతను రక్షించుకుందాం' అంటూ శివసేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం కాచిగూడలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.సుదర్శన్ ఆవిష్కరించారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క హిందువూ 10న జరిగే బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకునేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివసేన ప్రతినిధులు ఎ.నర్సింగ్‌రావు, భారతీయ విద్యార్థి సేన గ్రేటర్ అధ్యక్షులు ఎస్.గంగాధర్, ఎ.సందీప్, ఎ.తిరుమలేష్, ఎం.నరేష్, రాహుల్, సాయికిషోర్, వంశి, శివ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూలో ‘బీఫ్’ టెన్షన్!
♦ నివురుగప్పిన నిప్పులా వర్సిటీ ♦ ఈ నెల 10న పెద్దకూర పండుగ చేస్తామంటున్న నిర్వాహకులు ♦ అడ్డుకుని తీరుతామంటున్న హిందూ సంస్థలు ♦ వర్సిటీలో ఎలాంటి పండుగలకు అనుమతి లేదు: పాలకవర్గం ♦ క్యాంపస్‌లో భారీగా మోహరించిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ నెల 10న వర్సిటీలో ‘బీఫ్ ఫెస్టివల్ ’ నిర్వహించి తీరుతామని డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ (25 విద్యార్థి సంఘాల కూటమి) స్పష్టం చేయగా.. హిందూ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తూ వర్సిటీలో పెద్దకూర పండుగ నిర్వహిస్తే అడ్డుకుని తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా ఏబీవీపీ, ఇతర హిందూ మత సంస్థల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దళితుల సంస్కృతిలో భాగమైన పెద్దకూర పండుగను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ వర్సిటీలో 2కే రన్ నిర్వహించగా.. విద్యార్థుల సమస్యల పేరుతో ఏబీవీపీ వర్సిటీ బంద్ నిర్వహించింది. ఈ సమయంలో ఇరు సంఘాలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఏబీవీపీ, డీసీఎఫ్ విద్యార్థి సంఘాలు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో వర్సిటీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భయంతో కొంతమంది విద్యార్థులు హాస్టళ్లను వీడి సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. బీఫ్.. హెచ్‌సీయూ టు ఓయూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వ హించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సమయంలో కొంత మంది దళిత, వామపక్ష విద్యార్థి సంఘం నేతలు తమ సంస్కృతిలో భాగమైన పెద్దకూర పండుగను తామెందుకు నిర్వహించకూడదని భావించారు. దీంతో అప్పటి వరకు కేవలం సెంట్రల్ వర్సిటీకే పరిమితమైన పెద్దకూర పండుగను 2012లో తొలిసారిగా ఓయూ క్యాంపస్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)కి విస్తరింపజేశారు. అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. చివరకు విద్యార్థుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. 2013లో ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్లో తొలిసారిగా నిర్వహించారు. అలా ఓయా క్యాంపస్‌లోకి ప్రవేశించిన పెద్దకూర పండుగ ఏటా వివాదాస్పదం అవుతూనే ఉంది. గతంతో పోలిస్తే ఈ సారి హిందూ మత సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనుమతి లేదు: వర్సిటీ పాలకవర్గం ఓయూలో బీఫ్ ఫెస్టివల్ సహా ఎలాంటి పండుగలకు అనుమతి లేదని వర్సిటీ పాలక వర్గం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పండుగల నిర్వహణ విషయంలో తమకు ఎవరి అనుమతి అక్కర్లేదని నిర్వాహకులు చెప్పుతుండగా.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హిందూ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా ముందస్తుగా క్యాంపస్ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తార్నాక, విద్యానగర్ ప్రధాన ద్వారాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. 20వరకు వద్దు బీఫ్ ఫెస్టివల్‌పై కోర్టు ఆదేశం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 10న నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్‌కు బ్రేక్ పడింది! ఓయూ ఆవరణలో ఈ నెల 20 వరకు ఎలాంటి పండుగలు, వేడుకలు నిర్వహించరాదని, యథాతథ స్థితి కొనసాగించాలని సిటీ సివిల్ కోర్టు వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ న్యాయ శాస్త్ర పరిశోధన విద్యార్థి సుంకరి జనార్దన్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సోమవారం విచారణ చేపట్టారు. విద్యార్థుల ఆహారపు అల వాట్లకు విరుద్ధంగా ఎద్దు మాంసంతో వం డిన ఆహారాన్ని క్యాంపస్ విద్యార్థులకు ఇవ్వనున్నారని, ఇది హిందువుల మనోభావాలను కించపర్చేదిగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీధర్ తెలిపారు. 2012లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినపుడు ఘర్షణలు జరిగి విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి యథాతథ స్థితి కొనసాగించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. -
ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ విజయవంతం కావాలని కోరుతూ విద్యార్థులు సోమవారం క్యాంపస్‌లో 5 కే రన్ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు రన్ ను కొనసాగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్స ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పలువురు విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా పోలీసు బందోబస్తు, పికెట్ల ఏర్పాటు చేశారు. మరో వైపు బీఫ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ 9 వ తేదీన ఏబీవీపీ చలో ఉస్మానియాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
'బీఫ్ ఫెస్టివల్ కాదు, ఫెస్టివల్ జరుపుకుందాం'
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌ను ఉపసంహరించుకోవాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పిలుపునిచ్చారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ కుహనావాదులు చెప్పే మాయమాటల ముసుగులో లొంగిపోవద్దని సూచించారు. బీఫ్ తింటే బుద్ధిమాంద్యం వస్తుందని అన్నారు. పాడి ఇచ్చే ఆవు దైవంతో సమానమని పరిపూర్ణానంద స్వామి అన్నారు. అందుకే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే రోజును.. తాము గోరక్ష దివాస్‌గా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 10న ప్రతి ఒక్కరూ కనిపించే గోవుకు పూజ చేసి, నమస్కరించాలని, గోవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రాచీన కాలం నాటి వేదాలను ఇక్కడవాళ్లు చెబితే పట్టించుకోరని, అవే విషయాలను అమెరికా, ఇంగ్లండ్ నుంచి వచ్చినవాళ్లు చెబితే శాస్త్రీయమా అని పరిపూర్ణనంద స్వామి ప్రశ్నించారు. బీఫ్ ఫెస్టివల్ కాదు... ఫెస్టివల్ జరుపుకుందామని ఆయన సూచించారు. -
పోలీసు పహారాలో ఉస్మానియా యూనివర్సిటీ
-
పోలీసు పహారాలో ఓయూ క్యాంపస్..
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పోటాపోటీగా నిర్వహించ తలపెట్టిన వివిధ రకాల జంతువుల మాంసం పండుగల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌కు, ఇతర విద్యార్థి సంఘాలు నిర్వహించనున్న పంది మాంసం పండుగలకు అనుమతి లేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుండా తూర్పు మండల పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఓయూకు అదనపు బలగాలను రప్పించి కీలక ప్రాంతాలలో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 14 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజా పరిస్థితులతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఓయూలో బీఫ్‌పై రాజకీయ దుమారం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీఫ్‌కు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న చర్యలకు నిరసనగా డిసెంబర్ 10న యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. బీఫ్ ఫెస్టివల్‌కు అనుమతించొద్దని కోరుతూ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ యూనివర్సిటీ వీసీకు లేఖ రాశారు. యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ విషయంలో సీఎం కేసీఆర్, హోంమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని హిందూ జానజాగృతి సమితి నేతలు విజ్ఞప్తిచేశారు. గోవులను పూజించే సంస్కృతి ఉన్న దేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చట్టపరిధిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తామని నేతలు చెప్పారు. రాజాసింగ్ లేఖపై విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని చెప్పుతున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లను బీజేపీ అడ్డుకుంటోందని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.