
ఓయూలో ఉద్రిక్తత.. ఉత్కంఠ
ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని
♦ నేడు బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు డీసీఎఫ్ ఏర్పాట్లు
♦ బీఫ్ వంటకాలతో ఓయూకు రావాలని పిలుపు
♦ పది మంది అరెస్ట్ ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌ను దిగ్బంధించిన ఖాకీలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోబోమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసినా.. నిర్వాహకులైన ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ప్రతినిధులు మాత్రం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే, ఎలాగైనా అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ప్రకటించడంతో అందరి చూపు ఓయూపైనే కేంద్రీకృతమైంది. మరోపక్క ఖాకీల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దకూర పండుగ నిర్వహణకు పిలుపునిచ్చిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓయూలోని ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌ను దిగ్భందించారు.
పోలీసులు లోనికి రాకుండా విద్యార్థులు తలుపులు మూసి అడ్డుకున్నారు. డీసీఎఫ్ నేతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అరె స్ట్ చేసేందుకు వ్యూహాలను అనుసరిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో త్రివేణి హాస్టల్ వద్ద కోట శ్రీనివాస్‌గౌడ్, బద్రిలతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఓ చానల్ కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చిన ఓయూ మాదిగ విద్యార్థి సమాఖ్య ఇన్‌చార్జి అలెగ్జాండర్, ఫెస్టివల్ నిర్వాహకులు సొలంకి శ్రీనివాస్, వీహెచ్‌పీ నేత శశిధర్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిర్ణీత సమయం ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఫెస్టివల్ నిర్వహిస్తామని డీసీఎఫ్ సభ్యులు మరోసారి స్పష్టం చేశారు.
‘వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదన్న కోర్టు తీర్పు ప్రతిలో ప్రతివాదిగా ఎం. కృష్ణ పేరును చేర్చారు. ఓయూకు ఇతనికి సంబంధం లేదు’ అని డీసీఎఫ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దళిత, బహుజన, మైనార్టీ విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు ఈ పండగకు బీఫ్ వంటకాలతో హాజరుకావాలని పిలుపునిచ్చారు. దాదాపు 5 వేల మంది పాలుపంచుకుటారని చెప్పారు. ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే.. వారి ఎదుటే బీఫ్ వంటకాలను తిని నిరసన తెలియజేయాలని ప్రకటించారు. అవసరమైతే అంబేద్కర్ విగ్రహాల ఎదుట కూడా బీఫ్ పదార్థాలు తింటూ నిరసన తెలపాలని ఆ వేదిక సభ్యుడు ముసవీర్ విజ్ఞప్తి చేశారు.
అడ్డుకుంటాం
పెద్దకూర పండుగను అడ్డుకునేందుకు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ‘చలో ఉస్మానియా’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వర్సిటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని ఆ సంఘం చైర్మన్ కల్యాణ్ కోరారు. ఈ ఫెస్టివల్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రకటించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మతతత్వ శక్తులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించారు. నిర్వహణను ప్రతిఘటించేందుకు హిందుత్వ సంస్థల నాయకులు, ప్రతినిధులు, విద్యార్థులు పెద్దఎత్తున ఓయూకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. గో రక్షాదళ్, వీహెచ్‌పీ, శివసేన, భజరంగ్‌దళ్ వంటి సంస్థలూ వ్యతిరేకిస్తున్నాయి.
ప్రవేశాలు రద్దు చేస్తాం: రిజిస్ట్రార్
అనుమతి లేని బీఫ్ ఫెస్టివల్ కు హాజరైన విద్యార్థుల ప్రవేశాలను నిర్ద్వందంగా రద్దు చేస్తామని ఓయూ రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్ హెచ్చరించారు. వర్సిటీలో ఎటువంటి పండగలు నిర్వహించకూడదన్న సిటీ సివిల్ కోర్టు తీర్పు ప్రతి తమకు అందినట్లు చెప్పారు.
చిలుకూరులో ‘గో ప్రదక్షిణం’
బీఫ్ ఫెస్టివల్‌ను నిలిపేయాలని, భక్తులంతా గో పరిరక్షణకు కట్టుబడి ఉండాలనే సంకల్పంతో బుధవారం చిలుకూరు బాలాజీ ఆలయంలో ‘గో ప్రదక్షిణం’ నిర్వహించారు. ఆలయ సమీపంలోని గోశాల నుంచి గోవులను తెచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. బీఫ్ ఫెస్టివల్‌ను తాను అడ్డుకుంటానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ హెచ్చరించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.