
బీఫ్ తిన్నాడని సీటు ఇవ్వలేదు!
సాక్షి, హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్‌లో బీఫ్ తిన్నాడనే కారణంతో ఓ విద్యార్థికి సీటు నిరాకరించడం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో వివాదానికి దారి తీసింది. హైదరాబాద్‌లోని ఇఫ్లూ కాలేజీలో కేరళకు చెందిన జలీస్ ఈ ఏడాది ఎంఏ అరబిక్ పూర్తి చేశాడు. అరబిక్‌లో పీహెచ్‌డీ ఎంట్రన్స్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేశాడు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాకపోవడంతో యాజమాన్యాన్ని సంప్రదించాడు. గత ఏడాది ఇఫ్లూలో జరిగిన బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడన్న కారణంగా ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు యాజమాన్యం తిరస్కరించిందని ప్రొక్టర్ ప్రకాశ్ కోన జలీస్‌కు తెలిపారు.
ఎందుకని నిలదీయడంతో బీఫ్ తిన్న కారణంగా అతనిపై క్రిమినల్ కేసు ఉందని సమాధానం ఇవ్వడంతో జలీస్ నిర్ఘాంతపోయాడు. పీహెచ్‌డీ ఎంట్రన్స్ హాల్‌టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడంతో.. జలీస్ బీఏ రష్యన్ ఎంట్రన్స్‌కి ఆన్‌లైన్‌లో అప్లై చేశాడు. ఎంట్రన్స్‌లో అతనికి 76 మార్కులతో సెకండ్ లిస్ట్‌లో సీటు వచ్చింది. వర్సిటీ వెబ్‌సైట్‌లో, కాలేజీలో లిస్ట్ కూడా ప్రకటించారు. అడ్మిషన్ కోసం వర్సిటీకి వెళ్లిన జలీస్‌కి మరోసారి తిరస్కరణే ఎదురైంది. పై కారణంగానే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు యాజమాన్యం, ప్రొక్టర్ ప్రకాశ్ కోన చెప్పడంతో జలీస్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కాగా, ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులను సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.
బీఫ్ తినడం నేరమెలా అవుతుంది: జలీస్
ఇఫ్లూలో డిసెంబర్ 10న ఓయూ విద్యార్థులకు సంఘీభావంగా జరిగిన సమావేశంలో తాను విద్యార్థుల పక్కన నిలబడి ఉన్నానని, తనపై క్రిమినల్ కేసు ఎప్పుడు, ఎలా నమోదైందో తనకు తెలియదని జలీస్ చెబుతున్నాడు. బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నానన్న కారణంతో తన అడ్మిషన్‌ను తిరస్కరించినట్టు రాతపూర్వక సమాధానాన్ని కోరుతూ వర్సిటీ వీసీకి లేఖ రాసినా స్పందన లేదని చెప్పాడు. బీఫ్ తిన్నా అది నేరమెలా అవుతుందని ప్రశ్నించాడు. అది తమ ఆహారమని, ఇఫ్లూలో అడ్మిషన్‌కి తన ఆహార అలవాటు ఆటంకం ఎలా అవుతుందో అర్థం కావడంలేదని జలీస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. బీఫ్ తిన్నాడన్న కారణంతో విద్యార్థుల అడ్మిషన్లను కుట్రపూరితంగా యాజమాన్యం అడ్డుకుంటోందని, ఇఫ్లూ ఎంట్రన్స్‌ల్లో విద్యార్థుల మార్కులకు బదులు మాంసాహారులను లెక్కిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.