హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీఫ్‌కు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న చర్యలకు నిరసనగా డిసెంబర్ 10న యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు లేఖ రాయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
బీఫ్ ఫెస్టివల్కు అనుమతించొద్దని కోరుతూ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ యూనివర్సిటీ వీసీకు లేఖ రాశారు. యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ విషయంలో సీఎం కేసీఆర్, హోంమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని హిందూ జానజాగృతి సమితి నేతలు విజ్ఞప్తిచేశారు. గోవులను పూజించే సంస్కృతి ఉన్న దేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చట్టపరిధిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తామని నేతలు చెప్పారు.
రాజాసింగ్ లేఖపై విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని చెప్పుతున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లను బీజేపీ అడ్డుకుంటోందని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.