బీఫ్ ఫెస్టివల్ భగ్నం | Beef Festival ruined | Sakshi
Sakshi News home page

బీఫ్ ఫెస్టివల్ భగ్నం

Published Fri, Dec 11 2015 3:07 AM | Last Updated on Mon, Oct 29 2018 8:21 PM

బీఫ్ ఫెస్టివల్ భగ్నం - Sakshi

బీఫ్ ఫెస్టివల్ భగ్నం

♦ భారీ బందోబస్తుతో అడ్డుకున్న పోలీసులు
♦ ఖాకీల దిగ్బంధంలో ఓయూ
♦ సీ హాస్టల్ వద్ద లాఠీచార్జి.. విద్యార్థుల అరెస్ట్
♦ హాస్టళ్లలోనే బీఫ్ వంటకాల ఆరగింపు
♦ ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం.. అరెస్ట్
 
 సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన బీఫ్ ఫెస్టివల్‌ను పోలీసులు భగ్నం చేశారు. ముందుగా ప్రకటించినట్లే ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద గురువారం ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక(డీసీఎఫ్) సభ్యులు ఫెస్టివల్ నిర్వహణకు యత్నించారు. అయితే వర్సిటీలో 600కుపైగా పోలీసుల మోహరింపు, డీసీఎఫ్ నేతల ముందస్తు అరెస్ట్‌లతో ఇది సాధ్య పడలేదు. దీంతో అప్పటికే బీఫ్ వంటకాలు సిద్ధం చేసుకున్న డీసీఎఫ్ సభ్యులు తమ హాస్టళ్లలోనే ఒకరికొకరు పంచుకుని తిన్నట్లు తెలిసింది. ఇంకొందరు ఎన్‌సీసీ గేటు సమీపంలోని త్రివేణి హాస్టల్‌లో వండుకుని తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వాట్సప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లోకి పోస్ట్ చేశారు.

వీటిని చూసి కోపోద్రిక్తులైన బజరంగ్‌దళ్ , ఏబీవీపీ, గో సంరక్షణ సమితి కార్యకర్తలు ఓయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు ఓయూ వద్ద బందోబస్తు కొనసాగింది. బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతు పలికిన వారితోపాటు, నిర్వహణను అడ్డుకునేందుకు యత్నించిన 300 మందికిపైగా అరెస్టయ్యారు. వీరందరినీ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. అరెస్టయిన వారిలో ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆందోళనకారులు పలుచోట్ల ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఒక డ్రైవర్ గాయపడ్డారు.

 లాఠీచార్జీలు.. అరెస్టులు
 ఓయూలో మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీ హాస్టల్ వెనుక వైపు కొందరు విద్యార్థులు బీఫ్ వంటకాలు తింటూ నినాదాలు చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారి వెంట పడి లాఠీచార్జి చేశారు. కొందరు విద్యార్థులు హాస్టల్ గదుల్లోకి వెళ్లి త లుపులు వేసుకోగా.. మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలోకి వెళ్లే అన్ని దారులను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎక్కడి కక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు, చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓయూలోకి ఇతరులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.

విలేకరులను కూడా లోనికి అనుమతించలేదు. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ శివసేన నాయకులు గుట్టు చప్పుడు కాకుండా చెట్ల పొదల మాటున ఓయూలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా ఓయూలోకి వెళ్లేందుకు యత్నించిన పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ నాయకులను ఎన్‌సీసీ గేట్ వద్ద అడ్డుకున్నారు. ఫెస్టివల్ నిర్వహించకుండా నిర్బంధం విధించినా విద్యార్థులు బీఫ్ తిని విజయవంతం చేశారని డీసీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.

కాగా, వర్సిటీలో ఎలాంటి పండుగలు నిర్వహించరాదన్న కోర్టు ఆదేశాల మేరకు ఓయూలో గురువారం నిర్వహించ తలపెట్టిన పందికూర పండుగను రద్దు చేసుకున్నట్లు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సోలం కి శ్రీనివాస్ తెలిపారు. ఓయూలో కొన్ని విద్యా ర్థి సంఘాల నాయకులు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్, ఫోర్క్ ఫెస్టివల్ పండుగలకు విద్యార్థుల మద్దతు లేదని తేలిపోయిందని ఏబీవీపీ జాతీయ నాయకులు కడియం రాజు పేర్కొన్నారు. పోలీసులు బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు విప్లవ రచయితల సం ఘం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం యోగా, గోవధ పేరుతో అలజడి సృష్టిస్తోందని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని విరసం నేత వరవరరావు దుయ్యబట్టారు.
 
 రాజాసింగ్ అరెస్ట్
 బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటానని హెచ్చరించిన ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాను గురువారం ఉదయమే పోలీసు లు అరెస్టు చేశారు. మొదటగా గృహ నిర్బం ధం చేసిన ఆయన్ను తర్వాత.. షాహినాయత్ పోలీసులు గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. అక్క డి నుంచి బొల్లారం పీఎస్‌కు తీసుకెళ్లారు.
 
 ఢిల్లీలోనూ బీఫ్ ఫెస్టివల్
 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) నేతలు గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం అరెస్టులకు పాల్పడిందని, అందుకే ఢిల్లీలో నిర్వహించామని టీవీవీ అధ్యక్షుడు నూకల మహేశ్ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement