బీఫ్ ఫెస్టివల్కు హైకోర్టులోనూ చుక్కెదురు
హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులకు హైకోర్టులోనూ చుక్కెదురు అయింది. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు కోర్టు అనుమతి నిరాకరించింది. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సిందేనంటూ బుధవారం ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ జరపవద్దంటూ కడెం రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని స్పష్టం చేసింది. పోలీసులు శాంతిభద్రతలు కాపాడాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ నెల 20వ తేదీ వరకు వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించ కూడదని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న బీఫ్ ఫెస్టివల్‌ని నిర్వహించేందుకు ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) సన్నాహాలు చేస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహణను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.