ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
హైదరాబాద్ : ఛలో ఓయూకు పిలుపునిచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మంగళ్హాట్లోని ఆయన నివాసంలోనే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు అనుమానితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోబోమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసినా.. నిర్వాహకులైన ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ప్రతినిధులు మాత్రం తమ పట్టువీడటం లేదు. అయితే, ఎలాగైనా అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ప్రకటించడంతో అందరి చూపు ఓయూపైనే కేంద్రీకృతమైంది. మరోపక్క ఖాకీల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దకూర పండుగ నిర్వహణకు పిలుపునిచ్చిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓయూలోని ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌ను దిగ్భందించారు. అలాగే ఇతరులతో పాటు మీడియాకు కూడా క్యాంపస్ లోనికి అనుతమించడం లేదు.