మళ్లీ మా ఉత్తర్వులు అక్కర్లేదు | It does not require our orders again | Sakshi
Sakshi News home page

మళ్లీ మా ఉత్తర్వులు అక్కర్లేదు

Published Thu, Dec 10 2015 4:27 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

మళ్లీ మా ఉత్తర్వులు అక్కర్లేదు - Sakshi

మళ్లీ మా ఉత్తర్వులు అక్కర్లేదు

♦ సివిల్ కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే
♦ ఓయూలో బీఫ్ ఫెస్టివల్‌పై హైకోర్టు స్పష్టీకరణ
♦ తినాలనుకున్నది ఇంట్లో తింటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా
♦ స్వార్థపరుల చేతిలో విద్యార్థులు ఉపకరణాలు కారాదు
♦ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు.. విచారణ 11కు వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ అంశంపై సిటీ సివిల్ కోర్టు ఇప్పటికే యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసినందున ఈ వ్యవహారంలో మళ్లీ తాము ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. వాటికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా నిర్వాహకులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఏ సందర్భంగా నిర్వహిస్తున్నారు?
 ఈ నెల 10న ఓయూలో పెద్దకూర పండుగను జరపకుండా ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్)ను నియంత్రించాలని కోరుతూ వర్సిటీ విద్యార్థి కడియం రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. డీసీఎఫ్ నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్ వల్ల వర్సిటీలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఇప్పటికే ఈ విషయంలో సిటీ సివిల్ కోర్టు యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసింది కదా.

మరి ఈ వ్యాజ్యంలో మేమెందుకు జోక్యం చేసుకోవాలి? అసలు ఈ ఫెస్టివల్‌ను ఏ సందర్భంగా నిర్వహిస్తున్నారు’’ అని ప్రశ్నించింది. ఇందుకు సురేందర్‌రావు సమాధానమిస్తూ.. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు.

 దేశ భవిత విద్యార్థుల చేతిలోనే ఉంది
 విచారణ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. 2011 నుంచి ఓయూలో ఈ పండుగను నిర్వహిస్తున్నారని, దీనిపై ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయని, 8 కేసులు నమోదయ్యాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఓ వర్గం బీఫ్, మరో వర్గం గొర్రె మాంసం, మరో వర్గం బోటి-సవాయి, ఇంకో వర్గం కల్లుతో పండుగలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తినాలనుకుంది ఎవరింట్లో వారు తింటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా..! అసలు వారిని ప్రశ్నించే వారు ఎవ్వరూ ఉండరు. ఈ కార్యక్రమాలు తప్ప విద్యార్థులు నిర్వహించడానికి మరే కార్యక్రమాలు లేవా..? స్వార్థపరుల చేతిలో విద్యార్థులు ఉపకరణాలుగా మారకూడదు. ఏం చేయాలో ఏం చేయకూడదో వారికి చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే కోర్టు ఉత్తర్వులున్నాయి. వాటిని వారు ఉల్లంఘిస్తారని మేం అనుకోవడం లేదు. ఒకవేళ ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది’’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా మరో న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అందరూ వాటికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇప్పటికే సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున, మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏ మాత్రం కనిపించడం లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement