బీట్ తప్పితే.. బీప్..బీప్
బీట్ తప్పితే.. బీప్..బీప్
Published Wed, Jan 18 2017 12:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
- రాత్రి గస్తీ మరింత కట్టుదిట్టం
- బీట్ సిబ్బందికి జీపీఎస్ ట్యాబ్‌ల అందజేత
- కేటాయించిన స్థలానికి వెళ్లకపోతే కంట్రోల్‌రూమ్‌కు సమాచారం
- బీప్..బీప్ మంటూ శబ్దం
- నేర నియంత్రణకు ఈ - గస్తీ
- పి–క్యాట్స్ అప్లికేషన్ ద్వారా పర్యవేక్షణ
- కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు పూర్తి
- వారంలోగా జిల్లా అంతటా అమలు
జిల్లాలో పోలీస్‌స్టేషన్లు – 65
పోలీస్ సర్కిళ్లతో కలసి ఉన్నవి – 18
పోలీస్ సబ్ డివిజన్లు – 6
సిబ్బంది (సివిల్) – 3,082
ఏఆర్ సిబ్బంది – 894
హోంగార్డులు – 890
పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ముందడుగు వేస్తోంది. ‘ఈ–గస్తీ’. పౌరులకు రక్షణ కల్పించేందుకు రాత్రిపూట నిర్వహిస్తున్న పోలీసు గస్తీ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న గస్తీ, పెట్రోలింగ్ విధానాలకు సాంకేతికను జోడించి నేర నియంత్రణ చేపట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లాలో పి–క్యాట్స్ అప్లికేషన్ ద్వారా ఈ–గస్తీ (ఎలక్ట్రానిక్ గస్తీ) వ్యవస్థ అమలు చేయనున్నారు. ఈ–గస్తీ విధానం అందుబాటులోకి రానుండటంతో జిల్లా పోలీసులు మరింత అప్రమత్తంగా పనిచేసే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూమ్‌కు పోలీసు సిబ్బందికి కేటాయించే పరికరాలను అనుసంధానం చేయనుండటంతో ప్రతి కదలిక ఇక్కడ నమోదవుతోంది.
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా 491 ట్యాబ్‌లు సబ్ డివిజన్లకు అందజేశారు. రాత్రివేళల్లో కాపలా(బీట్స్) తిరిగే కానిస్టేబుళ్లకు వాటిని అందజేస్తారు. పెట్రోలింగ్ వాహనాల్లో కూడా జీపీఎస్ ప్యాకింగ్ యంత్రాలు అమలు చేస్తారు. ఈ యంత్రాల్లో ఆ బీట్ ప్రాంతం పరిసర ప్రాంతాల్లోని నేరగాళ్ల వివరాలతో పాటు గత రెండు నెలల వ్యవధిలో ఆ ప్రాంతంలో జరిగిన నేరాలు, వాటి సరళి తదితర అంశాలను పొందుపరుస్తారు. ఆ పరికరాలను జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌రూమ్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. ఈ విధానం ఆధారంగా సంబంధిత పెట్రోలింగ్ వాహనాలు, గస్తీ సిబ్బంది కదలికలు ప్రతి 20 సెకండ్లకొకసారి కంట్రోల్ రూమ్‌లో నమోదవుతాయి. దీనివల్ల ఏదైనా ప్రాంతంలో నేరం, చోరీ జరిగితే సమీపంలోని వారందరినీ ఒకేసారి అప్రమత్తం చేసి సంబంధిత సంఘటన స్థలానికి చేరుకునేలా చేస్తారు. గస్తీ సిబ్బందికి కేటాయించిన ప్రాంతాల్లో ఉన్నారా లేదా అనే విషయం కూడా ఇంటర్నెట్‌లో తెలుసుకునే వీలు కలుగుతుంది. గస్తీ కానిస్టేబుల్ తనకు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలోకి వెళ్తే కంట్రోల్ రూమ్‌కు బీప్... బీప్... అంటూ శబ్దం వస్తుంది. ఈ పరికరంతోనే ఫొటోలు తీసుకునే వెసులుబాటు ఉంది. బీట్ కాసే సమయంలో అనుమానితులు, ఇతరత్రా నేర నియంత్రణకు ఉపయోగపడే చిత్రాలు ఉంటే వాటిని ఫొటో తీసి నేరుగా కంట్రోల్ రూమ్‌కు పంపించవచ్చు. అత్యవసర సమాచారాన్ని క్లుప్తంగా ట్యాబ్‌ల ద్వారా కంట్రోల్‌రూమ్‌కు చేరవేయవచ్చు.
ఇప్పటివరకు ఇలా...
రాత్రిపూట జిల్లా వ్యాప్తంగా తిరిగే పోలీసులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో తిరిగి సంబంధిత వివరాలను బీట్ పుస్తకంలో ఆయా ప్రాంతాల్లో అనుమానితులు, రౌడీలు, కేడీలు, దొంగలు, నిందితుల వివరాలు ఉంటాయి. బీట్ కానిస్టేబుల్ ఆయా ప్రాంతాల్లో రాత్రివేళ కాపలాకు వెళ్లినప్పుడు సంబంధిత పుస్తకంలో నమోదైనవారి ఇళ్లకు వెళ్లి వారు ఉన్నారో లేదో పరిశీలించడం, ఉంటే ప్రెజెంట్ లేకుంటే ఆబ్సెంట్ మార్కు చేస్తారు. ఇది భవిష్యత్తులో పోలీసుల పరిశోధనలో ఎంతో కీలకం కానుంది. వాస్తవానికి ఎక్కడైనా దొంగతనం జరిగితే సంబంధిత తేదీన తన ప్రాంతంలో ఉన్న దొంగలు, అనుమానితుల జాబితాల్లో వ్యక్తి ఇంట్లో ఉన్నారో లేదో పరిశీలిస్తారు. ఆబ్సెంట్ మార్కు ఉంటే వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. ఇదంతా చేతి రాతతోనే ఇప్పటి వరకు జరుగుతోంది. ఈ–గస్తీ అమలుతో పాత పద్ధతికి ఇక స్వస్తి పలకనున్నారు.
జవాబుదారీతనం పెరుగుతుంది : ఆకే రవికృష్ణ, ఎస్పీ
కర్నూలు నగరంలో వారం రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనానికి ఈ–గస్తీ విధానం అమలు కానుంది. మరో వారం రోజుల్లో జిల్లా అంతటా అమలులోకి వస్తుంది. రాత్రివేళల్లో గస్తీ తిరుగుతున్న సిబ్బంది విధి నిర్వహణ ఎలా పనిచేస్తున్నారో గమనించి వారిని అప్రమత్తం చేయడానికి వీలుంటుంది. గస్తీ సమయంలో ఎక్కడైనా అనుమానితులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయడానికి వీలు ఉంటుంది. ప్రతి రోజు గస్తీ అనంతరం సంబంధిత సిబ్బంది ఇంటర్నెట్ ద్వారా మదర్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. దీన్ని బట్టి ఆ రోజు బీట్ కానిస్టేబుల్ ఏ సమయంలో ఎక్కడ విధులు నిర్వహించారో సమగ్ర వివరాలు నమోదు అవుతాయి. దీనిని పరిశీలించడం ద్వారా గస్తీ సిబ్బంది పనితీరు పరిశీలించడానికి, అత్యవసర పరిస్థితి ఎదురైతే సమర్థంగా ఎదుర్కొని నేరం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.
Advertisement
Advertisement