పాలేకర్ సాగు విధానం మేలు
గో ఆధారిత వ్యవసాయ నిపుణుడు విజయరామ్
సింగలూరు(గుడ్లవల్లేరు) :
పాలేకర్ సాగు విధానం మేలని గో ఆధారిత వ్యవసాయ నిపుణుడు విజయరామ్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో భాగంగా సింగలూరు బండారు బ్రహ్మారావు, సీతామహలక్ష్మమ్మ కమ్యూనిటీ హాల్‌లో శనివారం ప్రజలకు పర్యావరణానికి రక్ష – కుటీర పరిశ్రమల పేరిట నిర్వహించారు. భారత వికాస పరిషత్, భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్ సంయుక్తంగా చేపట్టిన సదస్సుకు విజయరామ్ హాజరయ్యారు. పాలేకర్ సూచించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో వానపాములే సాగు చేస్తాయని అన్నారు. తన వద్ద 300 రకాల వరి విత్తనాలు దేశీయ రకాలున్నాయని విజయరామ్ చెప్పారు. తాను పెద ముత్తేవి, తలకటూరులోని 15ఎకరాల్లో ఐదేళ్లగా వరి పండిస్తున్నానని తెలిపారు. తొలుత గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ఎంపీడీవో ఆర్.కేశవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్, జాప్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్‌జే ప్రసాద్ పాల్గొన్నారు.