palekar cultivation method
-
ప్రకృతి సేద్యం నిశ్శబ్ద విప్లవం!
సాక్షి సాగుబడి, అహ్మదాబాద్ (గుజరాత్): ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవమని, స్వావలంబన విప్లవమని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌కు దగ్గరలోని బోటాడ్ జిల్లా పాలియాడ్లో శుక్రవారం సుభాష్ పాలేకర్ కృషి పై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి సుమారు 500 మంది రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. పాలేకర్ ప్రసంగిస్తూ తన సేద్య పద్ధతిలో భూమిలో హ్యుమస్ పెరగటం వల్ల 90 శాతం సాగునీరు ఆదా అవుతుందన్నారు. పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ లో ధర నిర్ణయించే హక్కు రైతులేనని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమే కారణమన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మ హత్యల్లేని సమాజాన్ని నిర్మిస్తుందని పాలేకర్ తెలిపారు. వాతావరణ మార్పులని ఎదుర్కోవటం ఈ సేద్యం వల్లనే సాధ్యం అన్నారు. ఇవి చదవండి: The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను -
సాగుబడి: పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్‌లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం!
"పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ ఐదు అంచెల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. గుజరాత్లో ఫైవ్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని, తొలి ఏడాదే రూ. 2 లక్షలు, ఆరో ఏడాది నుంచి రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. ఆసక్తిగల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు." ఈ నెల 29,30,31 తేదీల్లో అహ్మదాబాద్‌కు 151 కి.మీ. దరంలోని పాలియాడ్ (బోటాడ్ జిల్లా)లోని శ్రీ విషమన్ బాపు ప్యాలెస్ మందిర్‌లో (ఆంగ్లం/ హిందీ) రైతు శిక్షణా శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్‌లను స్వయంగా చూపిస్తానన్నారు. 3 రోజులకు ఫీజు రూ.700. ఇతర వివరాలకు.. ఘనశ్యాం భాయ్ వాల– 63550 77257, కశ్యప్ భాయ్‌చౌహాన్– 85303 13211. పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ.. ఇంటర్/డిప్లొమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ‘ఆస్కి’ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణా శిబిరం జరగనుంది. హైదరాబాద్ (రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్ఎయు ఆవరణ) లోని విస్తరణ విద్యా సంస్థలో జరిగే ఈ శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన, వసతి కూడా పూర్తిగా ఉచితం. చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు. 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ/ అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాసైన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా 8వ తరగతి పాసైన తర్వాత కనీసం 3 ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పని చేస్తున్న వారు.. ఈ ఉచిత శిక్షణకు అర్హులు. విద్యార్హత, కులధృవీకరణ, ఆధార్, ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి. ఇతర వివరాలకు.. 040– 2405368, 98666 18107. eeihyd1962@gmail.com 22 నుంచి దేశీ వరి సాగు, నీటి సంరక్షణపై ‘సేవ్’ శిక్షణ.. విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల (న్యూ)లో ఈ నెల 22 నుంచి 26 వరకు దేశీ వరి సాగుదారులు, దేశీ వరి బియ్యాన్ని సేకరించి ఆలయాల్లో నైవేద్యాల కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు, ‘సేవ్’ సంస్థ నిర్వాహకులు విజయరామ్ తెలిపారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ వరి రకాల సాగు, ఉద్యాన పంటల 5 లేయర్ సాగు, వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతల తవ్వకంపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించే ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు. ‘శబలా భోజన పండుగ’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులూ జరుగుతాయని, ఆసక్తిగల వారు ఏదో ఒక రోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు. వివరాలకు.. సేవ్ కార్యాలయం 63091 11427, సురేంద్ర 99491 90769. 29 నుంచి సేవాగ్రామ్‌లో జాతీయ విత్తనోత్సవం! వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశీ వంగడాలకే ఉందనే నినాదంతో ఈ నెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్థా జిల్లా సేవాగ్రామ్‌లోని నాయ్ తాలిమ్ సమితి పరిసర్లో వార్షిక జాతీయ విత్తనోత్సవం జరగనుంది. దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశీ వంగడాల ప్రదర్శన, అమ్మకంతో పాటు సేంద్రియ రైతుల సదస్సులు, క్షేత్ర సందర్శనలు, నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రుసుము రూ. వెయ్యి. వివరాలకు.. యుగంధర ఖోడె – 91302 17662, ప్రతాప్ మరొడె – 75888 46544. ఇవి చదవండి: సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు! -
ఉద్యోగం విడిచి ప్రకృతి సేద్యంలోకి..
ఆత్మసంతృప్తి నివ్వని పనిని, అది ఎంత ఎక్కువ ఆదాయాన్నిచ్చే పని అయినప్పటికీ, మనసు చంపుకొని కొనిసాగించడంలో అర్థం ఏముంది? వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చండ్రా వెంకటేశ్వర్రావు మదిలో ఇదే ప్రశ్న మెదిలింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట ఆయన స్వగ్రామం. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగంలో చేరి వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకూ వస్తున్నప్పటికీ ఉద్యోగంలో పూర్తి సంతృప్తి లేదు. మనసంతా ప్రకృతి వ్యవసాయంపైనే ఉంది. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. డాక్టర్ చో హన్ క్యు, పాలేకర్ సేద్య పద్ధతుల్లో శిక్షణ తీసుకొని తన పొలంలో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రసాయన ఎరువులకు అలవాటు పడిన భూముల్లో ప్రకృతి సాగు ప్రారంభిస్తే మొదటి సంవత్సరం ఇబ్బందులు తప్పలేదు. భూమిని సారవంతం చేసుకుంటూ ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండున్నర ఎకరాల్లో చెరకు, మూడున్నర ఎకరాల్లో కాకర, బీర, సొర, దోసతో పాటు చిక్కుడు వంటి పందిరి జాతి కూరగాయలను సాగు చేస్తున్నా. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నాయి. నీటి నిల్వ కోసం 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నా. పొలంలో ఉన్న నాలుగు బోర్లను వాన నీటితో రీచార్జ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశా. పొలం ఎగువ భాగంలో చెక్ డ్యాం నిర్మించా. ఇంతవరకు నీటి సమస్య లేదు. గతంలో కంటే భూగర్భ జలమట్టం పెరిగింది. నాలుగు దేశీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతోనే మొత్తం 10 ఎకరాల పంటకు కావాల్సిన సహజ ఎరువులు, ద్రావణాలను తయారు చేసుకుంటున్నా. నత్రజని కోసం జీవామృతం, వర్మీవాష్ తయారు చేస్తున్నా. జీవామృతం వడకట్టడం కోసం తక్కువ ఖర్చుతో ఫిల్టర్ యూనిట్‌ను సొంతంగా తయారు చేశా. డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నాం. వాగుల్లో సేకరించిన గవ్వలు, కోడిగుడ్ల పెంకులను నానబెట్టి కాల్షియం కోసం ఎరువును తయారు చేస్తున్నా. పొటాష్ కోసం పొగాకు కాడల ద్రావణాన్ని పంటలకు అందిస్తున్నా. పూత దశలో ఫిష్ అమినో యాసిడ్ పిచికారీ చేయడం ద్వారా పంటల దిగుబడితో పాటు నాణ్యత పెరుగుతోంది. బియ్యం కడిగిన నీటితో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేస్తున్నా. వరి గడ్డి, చెత్త, కల్లం తుత్తడి, రోడ్డు వెంట ఉండే మొక్కలను తీసుకు వచ్చి ఆచ్ఛాదనగా వాడుతున్నా. మా పొలంలో సుగంధ సాంబ వరి రకం ఈత దశకు వచ్చింది. 5 అడుగులు పెరగడం విశేషం. రాష్ట్రం అంతటా వరిలో దోమపోటు, అగ్గితెగులు, ఆకుచుట్ట, సుడిదోమ వంటి తెగుళ్లతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే.. మా వరి పొలంలో తెగుళ్లు లేవు. గత సంవత్సరం తెలంగాణ సోన రకం వరి సాగు చేసి ఎకరాకు 25 బస్తాల ధాన్యం దిగుబడి సాధించా. బియ్యం పట్టించి కేజీ రూ.50కు నేరుగా వినియోగదారులకు అమ్మాను. చెరకు మొక్కల మధ్య అడుగు, సాళ్ల మధ్య 3 అడుగుల దూరంలో సాగు చేస్తున్నా. అధిక సంఖ్యలో పిలకలు వేసి ఏపుగా పెరుగుతోంది. వేసవి నాటికి చెరకు పక్వానికి వస్తుంది. జ్యూస్ సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా..’ అని వెంకటేశ్వర్రావు వివరించారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వ్యవసాయంలో వాడుతున్నందున వాతావరణ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి సారాన్ని కోల్పోయి పంటలు విపరీతమైన తెగుళ్ల బారిన పడుతున్నాయి. తమ ప్రాంత రైతులను ప్రకృతి సేద్యంపై చైతన్య పరిచేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్రావు (96521 11343) తెలిపారు. – మేకపోతుల వెంకటేశ్వర్లు, సాక్షి, కోదాడ రూరల్, సూర్యాపేట జిల్లా -
కుటుంబ ఆరోగ్యం కోసం ప్రకృతి సేద్యంలోకి..
చుట్టూతా ఉన్న బంధుమిత్రుల్లో అక్కడొకళ్లు, ఇక్కడొకళ్లు.. కేన్సర్‌తో అకాల మరణం పాలవుతుంటే తల్లడిల్లిన ఆ కుటుంబం మిన్నకుండిపోలేదు. దీనికి మూల కారణం రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులేనని గుర్తించింది. సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా సరిపెట్టుకోలేదు. వ్యవసాయం అంటే బొత్తిగా తెలియకపోయినా.. 40 ఎకరాల పొలం కొని సుమారు ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మహిళా రైతు గుళ్లపల్లి సుజాత. ప్రకృతి వ్యవసాయం గురించి మాటసాయం చేసే వాళ్లు కూడా దగ్గర్లో లేకపోయినా పట్టువీడలేదు. ప్రకృతి సేద్యం గురించి పుస్తకాల ద్వారా మౌలిక పరిజ్ఞానాన్ని పెంచుకొని, పాలేకర్ శిక్షణ ద్వారా పరిపుష్టం చేసుకున్నారు. మొక్కవోని దీక్షతో ఆచరణ ద్వారా స్వానుభవం పొందారు. పండించుకున్న అమృతాహారాన్ని తాము తింటూ.. తమ బంధుమిత్రులకు కూడా ఆనందంగా అందిస్తున్నారు సుజాత. మెకానికల్ ఇంజనీరైన తన భర్త తోడ్పాటుతో సొంత ఖర్చుతో పొలంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తున్నారు. డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. వృత్తి వ్యాపారాలలో స్థిరపడి, ఆదాయ వనరులకు లోటు లేని మధ్యతరగతి ప్రజలు సైతం.. తమ వంతు బాధ్యతగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకోవాల్సిన ఆవశ్యకతను ఆచరణాత్మకంగా చాటిచెబుతున్న సుజాతకు, సుస్థిర సేద్యమే జీవనంగా మలచుకున్న అక్క చెల్లెళ్లందరికీ మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా అభినందనలు.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గ్రానైటు ఎగుమతి వ్యాపారంలో అనుభవం గడించిన ప్రకాశం జిల్లా వాస్తవ్యురాలు గుళ్లపల్లి సుజాతకు వ్యవసాయంలో పూర్వానుభవం బొత్తిగా లేదు. అయినా, రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని స్వయంగా పండించుకొని తినటం ద్వారా ఆరోగ్యదాయకమైన జీవనం సాగించాలన్న పట్టుదలతో ప్రకృతి వ్యవసాయంలో లోతుపాతులను అధ్యయనం చేశారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారకట్ల గ్రామ పరిధిలో రాళ్లు, రప్పలతో కూడిన 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గత ఐదేళ్లుగా వ్యయప్రయాసలకోర్చి రాజీ ఎరుగని రీతిలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. కేన్సర్ బెడదతో సేద్యం దిశగా కదలిక.. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తీరును సుజాత ఇలా వివరించారు.. ‘‘అప్పట్లో మేం చెన్నైలో ఉండేవాళ్లం. మా దగ్గరి బంధువుల్లో అనేక మంది వైద్యులు ఉన్నారు. ఆహారం గురించి, ఆరోగ్య రక్షణ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం.. అయినా.. బంధుమిత్రుల్లో కొందరు కేన్సర్ తదితర దీర్ఘరోగాలతో అకాల మరణాల పాలయ్యే వారి సంఖ్య చూస్తుండగానే పెరిగిపోతుండటం మాకు చాలా ఆందోళన కలిగించింది. ఈ దుస్థితికి రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే మూల కారణమని గ్రహించాం. ఐదేళ్ల క్రితం సేంద్రియ ఆహారోత్పత్తుల కోసం, సేంద్రియ కూరగాయల కోసం చెన్నై నగరమంతా గాలించినా.. దూరంగా ఎక్కడో ఒక చోట దొరికేవి. కూరగాయలు దొరికేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో మనమే ఎందుకు ప్రకృతి వ్యవసాయం చేపట్టకూడదన్న ఆలోచనతో.. పెదారకట్ల గ్రామంలో పొలం కొన్నాం. పాలేకర్ పుస్తకాలతోపాటు వివిధ పత్రికలు చదువుతూ ప్రకృతి వ్యవసాయంలో మౌలిక విషయాలను ఒంటపట్టించుకున్నాను. రైతుకు అవసరమైన విషయాలన్నీ పుస్తకాల్లో దొరకవు కదా.. సుస్థిర వ్యవసాయ కేంద్రం వంటి స్వచ్ఛంద సంస్థలను, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను..’’ అన్నారామె. ఏడాదిలో పూర్తి అవగాహన పట్టుదల ఉంటే ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడానికి ఒక సంవత్సరం చాలని సుజాత స్వానుభవంతో చెబుతున్నారు.. ‘‘ఆవు పేడ, మూత్రం తొలి దశలో పొదిలిలోని గోశాల నుంచి సేకరించి తీసుకెళ్లి జీవామృతం, వివిధ ఔషధ మొక్కల ఆకులు అలములను సేకరించి కషాయాలను స్వయంగా నేనే తయారు చేశాను. దగ్గరుండి పంటలకు వాడించాను. మా వారు కోటేశ్వరరావు గారు ఆస్ట్రేలియా షిప్పింగ్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పని చేస్తూ.. తనకు వీలైనప్పుడల్లా పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రోత్సహించారు. తొలుత విద్యుత్ సదుపాయం లేకపోవడంతో సోలార్ పంపుతోనే డ్రిప్‌తో పంటలు పండించాము. సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకుంటూ, తెలియని విషయాలను వాళ్లనూ వీళ్లనూ అడిగి తెలుసుకుంటూ.. పాలేకర్ పుస్తకాల్లో చెప్పినవి తు.చ. తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయడంతో మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికే నాకు ప్రకృతి వ్యవసాయ మౌలిక భావనలపై అవగాహన, అనుభవం వచ్చాయి. మొదటి పంట మొక్కజొన్న అద్భుతంగా పండే సరికి ధైర్యం వచ్చింది. కినోవా కూడా పండించాను. అయితే, ప్రాసెసింగ్ సదుపాయాల్లేక చెన్నై తీసుకెళ్లి ప్రాసెస్ చేయించుకోవాల్సి వచ్చింది...’’ అంటూ తన ప్రకృతి వ్యవసాయ ప్రయాణాన్ని వివరించారామె. మా కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు సరిపడా అన్ని రకాల కూరగాయలను పొలంలో పండించుకొని తింటున్నాం. అందరమూ ఆరోగ్యంగా ఉన్నామన్నారు. గత ఏడాది ఒకటే వర్షం.. ఒంగోలుకు 75 కి.మీ. దూరంలోని వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 40 ఎకరాలకు గాను 20 ఎకరాల్లో మామిడి, నేరేడు, దానిమ్మ, సీతాఫలం, అరటి, జామ, బొప్పాయి, నిమ్మ, సపోట తదితర పండ్ల తోటలతోపాటు అంతర పంటలను సుజాత సాగు చేస్తున్నారు. మిగతా పొలంలో అపరాలు, చిరుధాన్యాలు, అన్ని రకాల కూరగాయ పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో మామిడి ప్రధాన పంటగా పాలేకర్ చెప్పిన విధంగా 5 అంతస్తుల సేద్యం ప్రారంభించారు. అరెకరంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. కేవలం పక్షుల ఆహారం కోసం పొలం చుట్టూ కొన్ని సాళ్లలో జొన్న పంట వేస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు గుంపులుగా వచ్చే పక్షులు జొన్న గింజలు తిని వెళ్తుంటాయని.. అవి ఇతర పంటల జోలికి ఎప్పుడూ రాలేదని ఆమె తెలిపారు. పాలేకర్ పద్ధతిపై కుదిరిన నమ్మకం తమ ప్రాంతంలో గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో ఒక్కటే వర్షం కురిసినప్పుటికీ కందులు, మినుములు, కొర్రలు, జొన్న, శనగ వంటి పంటలు పండించగలిగానని సుజాత తెలిపారు. ఆ ప్రాంతంలో భూములన్నీ బీళ్లుగా ఉన్న రోజుల్లో తాము ప్రకృతి సేద్యం ప్రారంభించి.. వివిధ పంటలు సాగు చేస్తుండటంతో స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు చాలా పొలాల్లో పంటలు సాగవుతున్నాయని ఆమె సంతృప్తిగా తెలిపారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయం చేసిన వారికి తీవ్రనిరాశే మిగిలిందని, తాము చెప్పుకోదగిన దిగుబడి పొందగలిగామన్నారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై తమకు నమ్మకం కలిగినందున ఇతర సేంద్రియ సాగు పద్ధతులను పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఈ ఏడాది పొలం అంతటా జనుము, జీలుగ సాగు చేసి పచ్చిరొట్ట ఎరువుగా కలియదున్నుతున్నారు. అరెకరంలో వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది 100 మిరప మొక్కలు సాగు చేయగా మంచి దిగుబడినిచ్చాయి. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరప తోట సాగు చేయాలనుకుంటున్నానని సుజాత చెప్పారు. మార్కెటింగ్ సమస్యే లేదు.. వ్యవసాయం చేసిన అనుభవం లేకపోయినా పొలం కొని పట్టుదలగా ఏడాది కష్టపడి ప్రకృతి వ్యవసాయంలో లోతుపాతులను ఔపోశన పట్టాను. గత నాలుగేళ్లుగా మొక్కజొన్న మొదలుకొని కినోవా వరకు అనేక రకాల పంటలను పండించిన అనుభవం గడించాను. కందులు, మినుములు, కొర్రలు తదితర పంటలను గత ఏడాది తీవ్ర కరువులోనూ చక్కగా పండించాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బెట్టను తట్టుకొని, తక్కువ నీటితో సాగు చేస్తున్నాను. ఈ ధైర్యంతోనే ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరపను ప్రధాన పంటగా సాగు చేయబోతున్నాను. మేం పండించిన ఉత్పత్తులను మొదటి ఏడాది బంధుమిత్రులకు ఉచితంగా ఇచ్చి రుచి చూపించాం. తర్వాత నుంచి మా ఇంటికి వచ్చి మరీ కొనుక్కెళ్తున్నారు. చెన్నైలో బంధుమిత్రులు, వైద్యులతో పాటు స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సైతం మా ఇంటికి వచ్చి కొనుక్కెళ్తున్నారు. కిలో కందిపప్పు రూ. 180, మినప్పప్పు రూ.150, శనగలు రూ. 80, రాగులు, జొన్నలు, సజ్జలు రూ. 50 చొప్పున అమ్ముతున్నాం. నమ్మకంగా, రాజీలేకుండా ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మా ఆహారోత్పత్తులకు మార్కెటింగ్ సమస్యే రాలేదు. – గుళ్లపల్లి సుజాత (94942 59343), ప్రకృతి వ్యవసాయదారు, పెదారకట్ల, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా వ్యవసాయ క్షేత్రంలో సొంత వాతావరణ కేంద్రం! గుళ్లపల్లి సుజాత తన భర్త కోటేశ్వరరావు తోడ్పాటుతో తమ వ్యవసాయ క్షేత్రంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఖర్చుతో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన యంత్రపరికరాలతో దీన్ని నెలకొల్పారు. దీని ద్వారా సేకరించే తాజా సమాచారం ద్వారా వర్షం రాకపోకల గురించి, వాతావరణ మార్పుల గురించి కచ్చితమైన ముందస్తు సమాచారం తెలుసుకోగలగడం చాలా ఉపయోగకరంగా ఉందని కోటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు వర్షం వస్తుందన్న సూచన ఉన్నప్పుడు పురుగుల మందు చల్లడం లేదని, నీటి తడి ఇవ్వటం లేదని.. ఆ విధంగా వనరుల వృథా తగ్గిందని అంటున్నారు. వాతావరణ సూచనలను బట్టి పొలం పనుల ప్రణాళిక ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ప్రయోజనం పొందుతున్నామన్నారు. వర్షం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలుల తీవ్రతపై ఈ కేంద్రం అందించే సమాచారం 5 కిలోమీటర్ల పరిధిలోని రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇటీవల ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. పంటలు, తోటల తీరుతెన్నుల పరిశీలన, పర్యవేక్షణ ఇక మరింత సులభతరం కానుందని కోటేశ్వరరావు, సుజాత చెప్పారు. తమ ప్రాంతంలో ఇతర రైతులకు కూడా సేవలందించాలన్న ఆలోచన ఉందన్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: నాగం వెంకటేశ్వర్లు, సాక్షి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా -
పాలేకర్ సాగు విధానం మేలు
గో ఆధారిత వ్యవసాయ నిపుణుడు విజయరామ్ సింగలూరు(గుడ్లవల్లేరు) : పాలేకర్ సాగు విధానం మేలని గో ఆధారిత వ్యవసాయ నిపుణుడు విజయరామ్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో భాగంగా సింగలూరు బండారు బ్రహ్మారావు, సీతామహలక్ష్మమ్మ కమ్యూనిటీ హాల్లో శనివారం ప్రజలకు పర్యావరణానికి రక్ష – కుటీర పరిశ్రమల పేరిట నిర్వహించారు. భారత వికాస పరిషత్, భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్ సంయుక్తంగా చేపట్టిన సదస్సుకు విజయరామ్ హాజరయ్యారు. పాలేకర్ సూచించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో వానపాములే సాగు చేస్తాయని అన్నారు. తన వద్ద 300 రకాల వరి విత్తనాలు దేశీయ రకాలున్నాయని విజయరామ్ చెప్పారు. తాను పెద ముత్తేవి, తలకటూరులోని 15ఎకరాల్లో ఐదేళ్లగా వరి పండిస్తున్నానని తెలిపారు. తొలుత గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ఎంపీడీవో ఆర్.కేశవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్, జాప్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్జే ప్రసాద్ పాల్గొన్నారు.