సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పదవీ విరమణ సిబ్బందికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చిపడింది. రిటైర్‌మెంట్ సమయంలో వారు విధుల్లో ఉంటేనే బెనిఫిట్స్ అందుతాయి. కానీ నెలాఖరున వారు సమ్మెలో ఉండిపోవటంతో ఇప్పుడు వారి కుటుంబాల్లో పెద్ద టెన్షన్ నెలకొంది. గత అక్టోబర్ నెలాఖరున ఆర్టీసీలో దాదాపు 250 నుంచి 300 మంది పదవీ విరమణ పొందారు. వీరికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మొత్తం రావాలంటే చివరి రోజు కచ్చితంగా డ్యూటీలో ఉండాలి. ఇదే ఉద్దేశంతో వారందరూ విధుల్లో చేరాల్సిందిగా ఐదు రోజుల ముందే కార్మిక సంఘాల జేఏసీ సూచించింది. సమ్మెలో ఉన్నవారు అర్జీ పెట్టుకుని వస్తే విధుల్లోకి తీసుకుంటామని గతంలో ప్రభుత్వం పేర్కొనటంతో వీరంతా విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు.
అర్జీ పెట్టుకుని వచ్చేవారిని విధుల్లోకి తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి పేర్కొన్నా, ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత సరూర్‌నగర్‌లో భారీ బహిరంగసభ పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఒక్కసారిగా తీరు మారిపోయింది. ఇప్పుడు అర్జీ పెట్టుకుని డ్యూటీలో చేరదామని వచ్చేవారికి అధికారులు అనుమతించటం లేదు. ఇదే క్రమంలో పదవీ విరమణ పొందినవారికి కూడా చుక్కెదురైంది. వారు విధుల్లో చేరకుండానే విరమణ పొందాల్సి వచ్చింది. దీంతో తమ రిటైర్‌మెంట్ బెని ఫిట్స్‌కు ఇబ్బంది వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment