ఉత్తమ విద్యార్థులను అందించాలి
-
ఉపాధ్యాయులకు హోంమంత్రి చినరాజప్ప పిలుపు
-
104 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
బాలాజీచెరువు (కాకినాడ):
సామాజిక స్పృహ కలిగిన, ఉత్తమ విలువల గల విద్యార్థులను దేశానికి అందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని 104 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శనివారం జేఎన్‌టీయూకేలో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోధనలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి డిజిటల్ తరగతిగదులలో ఈ లెర్నింగ్ వసతుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ దేశం, సమాజం గురించి ఆలోచించే పౌరులను విద్యావ్యవస్థ అందించాలని కోరారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమ్మణ్యం మాట్లాడుతూ గురువులు కనిపించే దైవంతో సమానమన్నారు. పదవ తరగతి ఫలితాల్లో జిల్లా ముందు స్థానంలో నిలుస్తుందని కలెక్టర్ సీహెచ్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఏ విద్యార్థీ వంద మీటర్లు దాటి నడిచివెళ్లకుండా సుమారు నాలుగు వేల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హోంమంత్రి చినరాజప్ప జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఈఓ ఆర్. నరసింహరావు, డీవైఈఓలు ఆర్.గంగాభవాని, అబ్రçహాం, డి. వాడపల్లి, జేసీ–2 రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.