కొనసాగుతున్న భవానీల రద్దీ
కొనసాగుతున్న భవానీల రద్దీ
Published Thu, Oct 13 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. ఐదు రోజుల వ్యవధిలో సుమారు లక్ష నుంచి లక్షా ఇరవై వేలకు పైగానే భవానీలు అమ్మవారి సన్ని«ధికి చేరుకుని దీక్షలు విరమించినట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు. బుధ, గురువారం సాధారణ భక్తుల కంటే రెట్టింపు సంఖ్యలో భవానీలు కొండకు విచ్చేశారంటే రద్దీ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భవానీలు మహామండపంలో ప్రసాదాలను కొనుగోలు చేసి, కనకదుర్గనగర్‌లో ఇరుముళ్లు సమర్పించారు. ఇరుముళ్లు సమర్పించే చోట గురు భవానీలకు, కనకదుర్గానగర్‌లో టీ విక్రయించుకునే వారి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
క్యూలైన్‌లోనే కొండపైకి అనుమతి
దసరా ఉత్సవాలు ముగిసి 48 గంటలైనా అమ్మవారిని దర్శించుకోవాలంటే టోల్‌గేటు నుంచి క్యూ మార్గంలోనే కొండపైకి చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. కొండపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు తీర్చుకునేందుకు భవానీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొండపై ఎక్కడా కొబ్బరికాయలు కొట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడచూసినా కొబ్బరి చిప్పలే కనిపించాయి. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భవానీలు చీరలు, రవికలు సమర్పించడంతో ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారింది.
లడ్డూ ప్రసాదం కోసం తిప్పలు
భవానీల రద్దీ కొనసాగడంతో దేవస్థాన అధికారులు లడ్డూలకు సరిపడినన్ని సరఫరా చేయడంలో విఫలమయ్యారు. లడ్డూల కోసం ఒక్కో భవానీ రెండేసి గంటలు క్యూలైన్‌లో వేచి ఉండటంతో వారు అసహనానికి గురయ్యారు. మహామండపంలోని లడ్డూ కౌంటర్లలో మాత్రమే ప్రసాదాలు విక్రయించడం, దసరా ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లు మూసివేయడంతో భవానీలకు ఇబ్బందులు తప్పలేదు. ఓ దశలో లడ్డూల కోసం వేచి ఉన్న భక్తులను, భవానీలను పోలీసులు పంపేశారు.
Advertisement
Advertisement