durgatemple
-
దుర్గమ్మ సేవలో జర్మనీ బృందం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : భారతదేశంలో సామాజిక సేవపై సర్వే చేస్తున్న జర్మనీ బృందం ఆదివారం దుర్గమ్మను దర్శించుకుంది. ముంబయి, చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు నగరంలో పర్యటిస్తున్న ఈ బృందం ఆదివారం దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చింది. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని దర్శనానికి వచ్చిన వీరు దుర్గమ్మ ప్రసాదం స్వీకరించి రాజగోపురం ఎదుట కొద్దిసేపు సేదతీరారు. ఫ్లోమాన్ అనే యువకుడి సారథ్యంలో మొత్తం 10 మంది యువతీ యువకులు నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో దుర్గమ్మను దర్శించుకున్న తోటి విద్యార్థులు ఆలయ గొప్పదనం గురించి చెప్పడంతో అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు లావో అనే యువకుడు ‘సాక్షి’కి తెలిపాడు. రాజగోపురంపై ఉన్న శిల్పకళను తన సెల్‌ఫోన్, కెమెరాలతో చిత్రీకరించారు. జర్మనీ బృందాన్ని చూసి తోటి భక్తులు, యాత్రికులు వారితో సెల్ఫీలు దిగారు. సుమారు గంటపాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ జర్మనీ బృందం సందడి చేసింది. -
కొండపైకి సొంత వాహనాలకు నో!
ఇంద్రకీలాద్రి: దుర్గగుడి ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ నియంత్రణకు దుర్గగుడి అధికారులు చర్యలు చేపట్టారు. వీఐపీలు, సొంత వాహనాలపై కొండపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓం టర్నింగ్ వద్ద పలు మార్లు ట్రాఫిక్ నిలిచిపోతోంది. కార్లపై కొండపైకి వచ్చే వారి కోసం దేవస్థానం టోల్‌గేటు వద్ద రూ. 300 టికెటు కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వారిని కొండపైకి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. భక్తులు తమ వాహనాలను కెనాల్ రోడ్డు, కమాండ్ కంట్రోల్ రూమ్ , హెడ్ వాటర్ వర్కు్స పరిసరాలలో నిలుపుకుని టోల్‌గేటుకు చేరుతున్నారు. టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో టికెట్లు కొనుగోలు చేసి ప్రత్యేక వాహనంపై కొండపైకి చేరుకున్నారు. లడ్డు ఇవ్వలేదని ఫిర్యాదులు శనివారం ఉదయం 10–30 గంటల వరకు రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించకపోవడంతో టెంపుల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవో సీసీకి చేరవేయగా, టికెట్‌తో పాటు లడ్డు అందజేయాలని సంబం«ధిత అధికారులను ఆదేశించారు. -
దసరా హుండీ ఆదాయం రూ.1.37 కోట్లు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కుబడుల లెక్కింపు శుక్రవారం ప్రారంభమైంది. తొలి విడతగా ఆలయ ప్రాంగణంలోని క్లాత్ హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా, 1,37,38,016 నగదు లభ్యమైంది. మొత్తం 80 మూటలతో కానుకలను మహామండపంలోని ఒకటో అంతస్తుకు తరలించి లెక్కించారు. లెక్కింపులో 270 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శనివారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
కొనసాగుతున్న భవానీల రద్దీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. ఐదు రోజుల వ్యవధిలో సుమారు లక్ష నుంచి లక్షా ఇరవై వేలకు పైగానే భవానీలు అమ్మవారి సన్ని«ధికి చేరుకుని దీక్షలు విరమించినట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు. బుధ, గురువారం సాధారణ భక్తుల కంటే రెట్టింపు సంఖ్యలో భవానీలు కొండకు విచ్చేశారంటే రద్దీ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భవానీలు మహామండపంలో ప్రసాదాలను కొనుగోలు చేసి, కనకదుర్గనగర్‌లో ఇరుముళ్లు సమర్పించారు. ఇరుముళ్లు సమర్పించే చోట గురు భవానీలకు, కనకదుర్గానగర్‌లో టీ విక్రయించుకునే వారి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌కు చేరింది. క్యూలైన్లోనే కొండపైకి అనుమతి దసరా ఉత్సవాలు ముగిసి 48 గంటలైనా అమ్మవారిని దర్శించుకోవాలంటే టోల్‌గేటు నుంచి క్యూ మార్గంలోనే కొండపైకి చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. కొండపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు తీర్చుకునేందుకు భవానీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొండపై ఎక్కడా కొబ్బరికాయలు కొట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడచూసినా కొబ్బరి చిప్పలే కనిపించాయి. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భవానీలు చీరలు, రవికలు సమర్పించడంతో ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారింది. లడ్డూ ప్రసాదం కోసం తిప్పలు భవానీల రద్దీ కొనసాగడంతో దేవస్థాన అధికారులు లడ్డూలకు సరిపడినన్ని సరఫరా చేయడంలో విఫలమయ్యారు. లడ్డూల కోసం ఒక్కో భవానీ రెండేసి గంటలు క్యూలైన్లో వేచి ఉండటంతో వారు అసహనానికి గురయ్యారు. మహామండపంలోని లడ్డూ కౌంటర్లలో మాత్రమే ప్రసాదాలు విక్రయించడం, దసరా ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లు మూసివేయడంతో భవానీలకు ఇబ్బందులు తప్పలేదు. ఓ దశలో లడ్డూల కోసం వేచి ఉన్న భక్తులను, భవానీలను పోలీసులు పంపేశారు. -
పుష్కర ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : పుష్కరాలకు సమయం సమీపిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ ఆలయ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ గురువారం దుర్గగుడిపై ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత టోల్‌గేటు వద్దకు చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డులో జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీలించారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి చేరుకుని క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో సూర్యకుమారిని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన భద్రతా చర్యల గురించి పోలీసు అధికారులతో చర్చించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.