దుర్గమ్మ సేవలో జర్మనీ బృందం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : భారతదేశంలో సామాజిక సేవపై సర్వే చేస్తున్న జర్మనీ బృందం ఆదివారం దుర్గమ్మను దర్శించుకుంది. ముంబయి, చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు నగరంలో పర్యటిస్తున్న ఈ బృందం ఆదివారం దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చింది. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని దర్శనానికి వచ్చిన వీరు దుర్గమ్మ ప్రసాదం స్వీకరించి రాజగోపురం ఎదుట కొద్దిసేపు సేదతీరారు. ఫ్లోమాన్ అనే యువకుడి సారథ్యంలో మొత్తం 10 మంది యువతీ యువకులు నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో దుర్గమ్మను దర్శించుకున్న తోటి విద్యార్థులు ఆలయ గొప్పదనం గురించి చెప్పడంతో అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు లావో అనే యువకుడు ‘సాక్షి’కి తెలిపాడు. రాజగోపురంపై ఉన్న శిల్పకళను తన సెల్‌ఫోన్, కెమెరాలతో చిత్రీకరించారు. జర్మనీ బృందాన్ని చూసి తోటి భక్తులు, యాత్రికులు వారితో సెల్ఫీలు దిగారు. సుమారు గంటపాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ జర్మనీ బృందం సందడి చేసింది.