social survey
-
సామాజిక ఆర్థిక సర్వే 2017-18
రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాల వాటా క్షీణించింది. 2017–18 ఆర్థిక సామాజిక సర్వే విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 తుది అంచనాల ప్రకారం జీవీఏలో వ్యవసాయం (అనుబంధ రంగాలు కాకుండా) వాటా 5.93 శాతంగా ఉంటే అది 2017–18లో 5.38 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే.. చేపలు, హార్టికల్చర్ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే జీవీఏలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాట 32.75 శాతం నుంచి 34.37 శాతానికి పెరగడం గమనార్హం. ఇదే సమయంలో సేవల రంగం వాటా 44.38 శాతం నుంచి 43.55 శాతానికి, పరిశ్రమల వాట 22.87 శాతం నుంచి 22.09 శాతానికి తగ్గినట్లు సర్వే పేర్కొంది. 2016–17లో రూ. 6,34,742 కోట్లుగా ఉన్న జీవీఏ 2017–18లో 15.9 శాతం పెరిగి రూ.7,35,709 కోట్లకు చేరుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీవీఏకి పన్నుల ఆదాయం కలిపి దానిలోంచి సబ్సిడీలు తీయగా వచ్చే విలువ) రూ.6,95,491 కోట్ల నుంచి రూ.8,03,873 కోట్లకు చేరనుంది. -
దుర్గమ్మ సేవలో జర్మనీ బృందం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : భారతదేశంలో సామాజిక సేవపై సర్వే చేస్తున్న జర్మనీ బృందం ఆదివారం దుర్గమ్మను దర్శించుకుంది. ముంబయి, చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు నగరంలో పర్యటిస్తున్న ఈ బృందం ఆదివారం దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చింది. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని దర్శనానికి వచ్చిన వీరు దుర్గమ్మ ప్రసాదం స్వీకరించి రాజగోపురం ఎదుట కొద్దిసేపు సేదతీరారు. ఫ్లోమాన్ అనే యువకుడి సారథ్యంలో మొత్తం 10 మంది యువతీ యువకులు నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో దుర్గమ్మను దర్శించుకున్న తోటి విద్యార్థులు ఆలయ గొప్పదనం గురించి చెప్పడంతో అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు లావో అనే యువకుడు ‘సాక్షి’కి తెలిపాడు. రాజగోపురంపై ఉన్న శిల్పకళను తన సెల్‌ఫోన్, కెమెరాలతో చిత్రీకరించారు. జర్మనీ బృందాన్ని చూసి తోటి భక్తులు, యాత్రికులు వారితో సెల్ఫీలు దిగారు. సుమారు గంటపాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ జర్మనీ బృందం సందడి చేసింది. -
సర్వేకు సహకరించేనా..?
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన జిల్లాలోని ఏడు మండలాల్లో ఈ నెల 19న చేపట్టబోయే సామాజిక సర్వేపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముంపు మండలాల్లో పాలనా వ్యవహారాలు జిల్లా నుంచే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా సామాజిక సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. మరోవైపున ఈ మండలాలను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెలాఖరునాటికి ఆ మండలాలను విలీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమించింది. కానీ జిల్లా యంత్రాంగం మాత్రం ముంపు మండలాల్లో కూడా సామాజిక సర్వే చేపట్టాలని కార్యాచరణ ప్రకటించింది. ఈ మొత్తం పరిణామాలు ఇక్కడ పనిచేసే అధికారులను ఇరకాటంలో పడేస్తున్నాయి. ముంపు మండలాల్లోని ప్రజాప్రతినిధుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తుండటంతో సర్వేకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారు ఆలోచనలో పడ్డారు. ఏడు మండలాల్లో 324 రెవెన్యూ గ్రామాలు, వాటిలో నివసిస్తున్న 1,90,304 మంది జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించబడ్డారు. తాము మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల్లో నమోదు కావాల్సి ఉంటుందని, అలాంటప్పుడు తమ సమగ్ర సమాచారాన్ని సేకరించి ఏం ప్రయోజనమని కొంతమంది సర్పంచ్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాటిలోని అక్రమాలను అరికట్టేందుకు చేపడుతున్న ఈ సామాజిక సర్వేతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా అధికారులు చెపుతున్నారు. ఒక వేళ ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పటకీ, సర్వే నివేదికను వారికి అప్పగిస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. సర్వేపై భద్రాద్రిలో సర్పంచ్ల నిరసన... సామాజిక సర్వే సవ్యంగా సాగేలా సర్పంచ్‌లకు సోమవారం భద్రాచలం తహశీల్దార్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సర్వేకు సహకరించి ప్రజల సమగ్ర సమాచారం అందేలా చూడాలని తహశీల్దార్ రాజేంద్రకుమార్ సర్పంచ్‌లను కోరారు. ఈ దశలో కొంతమంది సర్పంచ్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ గ్రామాలను బదలాయించారని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సర్వేలని నిలదీశారు. గతంలో ఉన్న భూములను అవసరాల కోసం అమ్ముకున్నామని, కానీ ఏజెన్సీ చట్టాల ప్రకారం అవి తమ హ క్కుపత్రాల నుంచి మాత్రం వేరు కాలేదని, అలాంటప్పుడు తమ ఆస్తుల వివరాలను ఏ రీతిన నమోదు చేసుకోవాలని వెంకటరెడ్డిపేట ఉపసర్పంచ్ కృష్ణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తమలాంటి వారికి నష్టమే జరుగుతుందని, తీరా సర్వే జరిగిన తరువాత ఆంధ్రలోకి వెళ్లాల్సి వస్తుందని, ఈ లోగానే తమకు ఉన్న రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు రద్దయ్యే ప్రమాదం ఉందని మరికొందరు సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రంపచోడవం ఆర్డీవోను కలిసిన ముంపు సర్పంచ్‌లు.. చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలకు చెందిన 24 మంది సర్పంచ్‌లు సోమవారం రంపచోడవరం వెళ్లి ఆర్డీవోను కలిశారు. ఈ సందర్భంగా ముంపు మండలాల సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాల విభజన నేపథ్యంలో ముంపు మండలాల్లో గత కొంతకాలంగా ఎటువంటి అభివృద్ధి పనులు జరుగటం లేదని, వీటిని ఆంధ్రలో కలిపినందున ఇప్పటికైనా అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ముంపు మండలాలకు ప్రత్యేకాధికారి.. ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలను తమ అజమాయిషీ కిందనే సాగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జరిగిన ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముంపు మండలాల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా బదలాయించిన ఏడు మండలాలకు ఓ ప్రత్యేకాధికారిని నియమించేందుకు కేబినెట్లో ఆమోదించినట్లు సమాచారం. దీంతో ముంపు మండలాలను తమ పాలన కిందకు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. -
సామాజిక సర్వేకు సిద్ధం
హన్మకొండ అర్బన్: ఈ నెల 19న సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2014 జనాభా లెక్కల ప్రకారం 9.39 లక్షల కుటుంబాలు ఉన్నాయని, వీటి సర్వే చేసేందుకు 39,552 మంది అధికారులను నియమిస్తున్నట్టు తెలిపారు. వీరిని సర్వే ప్రాంతాలకు తరలించేందుకు వెరుు్య వాహనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. సేకరించిన డాటాను కంప్యూటరీకరించేందుకు మొత్తం 2500 కంప్యూటర్లు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి మండలానికి ముగ్గురు ఏడీ స్థాయి అధికారులను నియమిస్తున్నామని, సర్వే తీరును వీరు పరిశీలిస్తుంటారని తెలిపారు. సర్వే నిర్వహణపై ఈనెల 6న శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పండాదాస్, ఆర్డీవో సురేందర్‌కరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఒకేరోజు సామాజిక సర్వే
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించనున్నారు. తెలంగాణలో సమగ్ర, ఆర్థిక, సామాజిక సర్వేపై సలహాదార్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ప్రతి పౌరుడు, కుటుంబం సర్వేలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.