భూసేక‘రణం’
భూసేక‘రణం’
Published Wed, Apr 26 2017 1:10 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు/జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం భూములు సేకరించిన వ్యవహారం గిరిజనుల మధ్య చిచ్చు రేపింది. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను అధికారులు అడ్డగోలుగా కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమికి సంబంధించి పట్టాలు వేరే వారి పేరిట ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాలుగా తామే సాగు చేసుకుంటున్నామని.. ఆ భూములను పట్టాలు కలిగిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి నిర్వాసితులకు అప్పగించడం అన్యాయమనే వాదన వినిపిస్తోంది. ఇదికాస్తా స్థానిక గిరిజనులు, స్థానికేతరులైన నిర్వాసిత గిరిజనుల మధ్య అగ్గి రాజేస్తోంది. జిల్లాలోని జీలుగువిుల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ఈ తరహా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో స్థానిక గిరిజనులు సర్వే రాళ్లను తొలగించడంతోపాటు మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. తాము సాగు చేసుకుంటున్న భూములను నిర్వాసితులకు కేటాయించడంతో స్థానిక గిరిజనులు అడ్డం తిరుగుతున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాలైన రాజులగొంది, కొరుటూరు, శివగిరి, కొత్త మామిడిగొంది గ్రామాల గిరిజనులకు జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో భూమికి భూమితోపాటు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ గ్రామంలోని భూములకు అగ్రవర్ణాల పేరుతో పట్టాలు ఉన్నాయి. ఆ భూములను కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వీటిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంపై ఈ ప్రాంత గిరి జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు ఉపక్రమిస్తుంటే అడ్డుకుంటున్నారు. పి.నారాయణపురం రెవెన్యూ పరిధిలో సుమారు 500 ఎకరాల భూములకు సంబంధించి నిర్వాసిత గిరిజనులు, స్థానిక గిరిజనుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూముల్లో పోలీస్ రక్షణతో పోలవరం నిర్వాసితులు సాగు చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లోని భూముల్లో స్థానిక గిరిజనులు వేసిన పత్తి పంటను గత ఏడాది జూన్ నెలలో పోలీస్ రక్షణతో నిర్వాసిత గిరిజనులు దున్నేశారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా.. పోలవరం నిర్వాసితుల కోసం పి.నారాయణపురంలో కేటాయించిన ఇంటి స్థలాల్లోని సరిహద్దు రాళ్లను స్థానిక గిరిజనులు మంగళవారం తొలగించారు. ఇక్కడ మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్స్‌ను ధ్వంసం చేశారు.
నిర్వాసితులను సాగు చేసుకోని వ్వకపోవడం, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడంతో గిరిజనుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారిం చకపోతే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
Advertisement
Advertisement