
తలసాని కుమారుడి కేసులో కీలక మలుపు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభినవ్-భువన వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తమ విషయంలో జోక్యం చేసుకొని మంత్రి తలసాని కొడుకు దాడి చేశాడని అభినవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అభినవ్ భార్య భువన కీలక వివరణ ఇచ్చింది. అసలు అభినవే తనను ఇబ్బందులకు గురిచేశాడని, తన తండ్రిని విపరీతంగా కొట్టాడని చెప్పింది. తలసాని కుమారుడు ఈ వివాదంలో చిక్కుకోవడంతో స్వయంగా మంత్రి తలసాని ఈ విషయంలో జోక్యం చేసుకొని భువనను మీడియా ముందుకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆమె పలు వివరాలను చెప్పింది. తాను అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి అని, జిమ్ కు వెళ్లే సమయంలో తనకు అభినవ్ పరిచయం అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత తమ మధ్య స్నేహం పెరిగిందని, ఈ లోగా ఓ మ్యాచ్లో తాను ఓడిపోవడంతో తండ్రి తిట్టాడని ఆ సమయంలో తనను అభినవ్ వాళ్లింటికి వచ్చేయమని చెప్పడంతో ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా వెళ్లానని, ఆ మరుసటి రోజే వివాహం చేసుకున్నామని వివరించింది. ఆ విషయం రెండు రోజుల్లో తన తండ్రికి చెప్పడంతో పెద్ద కూతురు పెళ్లి కావాల్సి ఉన్నందున ఇప్పుడప్పుడే తొందరపడి బయటకు చెప్పొద్దని వచ్చే ఏడాది పెళ్లి జరిపిస్తామని చెప్పాడని పేర్కొంది.
ఐదు నెలలుగా తాను తన తండ్రి వద్దే ఉంటున్నానని, 20 రోజుల కిందటే అభినవ్ వద్దకు వెళ్లానని ఈ 20 రోజుల్లోనే అతడి అసలు స్వరూపం బయటపడిందని చెప్పింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆటను ఆడనివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడని, బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెట్టి డోర్ వేసి వెళ్లిపోయేవాడని, కాలేజీ కూడా లేకుండా చేశాడని వాపోయింది. ప్రతి రోజూ చిత్ర హింసలు పెట్టేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆరోపించింది. తన అక్కకు పెళ్లి చూపులు కావడంతో తీసుకెళ్లేందుకు వచ్చిన తన తండ్రితో పంపించేందుకు ఒప్పుకోలేదని రూ.మూడు కోట్లు డిమాండ్ చేశాడని, అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ఎంత ప్రాపర్టీ ఉంటే అంత అభినవ్ పేరు మీద రిజిష్టర్ చేయాలని డిమాండ్ చేశాడని చెప్పింది.
తర్వాత ఏం మాట్లాడుకున్నారో.. అక్టోబర్ 24 రాత్రి తనను ఇంట్లో దింపేసి వెళ్లాడని, రెండు రోజులు అక్కడే ఉండాల్సిన తనను ఉన్నపలంగా ఇంటికొచ్చేయమన్నాడని తాను కూడా అందుకు సిద్ధమయ్యానని చెప్పింది. ఇంతలో మరో రోజు అభినవ్ వచ్చి గొడవ పెట్టుకొని తన తండ్రి మహేందర్ రెడ్డిని తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తన తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అనంతరం అబినవ్, భువన తండ్రి మహేందర్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణను మంత్రి తలసాని మీడియాకు వినిపించారు.