బైక్‌లో రూ.6.40లక్షల నగదు
భీమడోలు : గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌ను అపహరించి పరారైన ఘటన గురువారం జాతీయ రహదారి భీమడోలులోని కాంచికామాక్ష్మమ్మ గుడి వద్ద జరిగింది. అపహరించిన బైక్‌లో రూ.6.40లక్షల నగదు ఉంది. ఇదంతా సినీ ఫక్కీలో జరిగింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరు మండలం అప్పారావుపేట చెందిన ఇనుపకుర్తి సూర్యనారాయణ చేపల చెరువుల యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు.
ఈ నేపథ్యంలో ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి గురువారం ఆయన ఏలూరు బయలు దేరాడు. అక్కడ ఓ వ్యక్తికి ఇచ్చేందుకు రూ.6.40లక్షలను బండిలో పెట్టుకున్నాడు. అయితే అతను సాయంత్రం తీసుకుంటానని చెప్పడంతో సూర్యనారాయణ తన మోటార్ సైకిల్‌పై నారాయణపురం తిరిగి వెళ్తుండగా.. అతని వద్ద డబ్బు ఉందని గుర్తించిన ఇద్దరు వ్యక్తులు ఓ కారులో వెంబడించారు. దీనిని సూర్యనారాయణ గమనించలేదు.
కారులోని ఇద్దరు వ్యక్తులు భీమడోలులోని కాంచికామాక్ష్మమ్మ గుడి వద్దకు వచ్చే సరికి ముందుగా వెళ్తున్న మోటార్‌బైక్‌ను ఆపారు. దిగిన సూర్యనారాయణతో వారు వాగ్వివాదానికి దిగారు. ఈ సమయంలో వారిలో ఒకడు చెంపపై కొట్టడంతో సూర్యనారాయణ కింద పడ్డాడు. దీంతో కారులో వచ్చిన ఇద్దరిలో ఓ వ్యక్తి మోటార్‌బైక్ తీసుకెళ్లిపోయాడు.
మరో వ్యక్తి కారులో ఉడాయించాడు. కిందపడిన సూర్యనారాయణ తేరుకునేలోపే ఇదంతా జరిగిపోయింది. దీంతో లబోదిబోమంటూ సూర్యనారాయణ భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ బి.వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.