స్వాధీనం చేసుకున్న బైకులతో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ
ముండ్లమూరు: వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను అపహరించుకెళ్తున్న నర్రా సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో శనివారం నిందితుడి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనాల దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉల్లగల్లు ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఈ నెల 16వ తేదీ రాత్రి బైకు అపహరణకు గురికాగా అదే గ్రామానికి చెందిన బొట్ల నాగేశ్వరరావు స్థానిక పోలీసుస్టేషన్‌లో 17వ తేదీన ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దర్శి సీఐ భీమానాయక్, ముండ్లమూరు ఎస్‌ఐ గంగుల వెంకటసైదులు నేతృత్వంలో కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, బి.ప్రేమానిధి, డి.అశోక్‌కుమార్, ఎస్‌కే ఖాశిం, కావిరాజు, టి. శ్రీనులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ వద్ద సేకరించిన ఆధారాల మేరకు మోటార్ సైకిళ్ల దొంగ కోసం వేట ప్రారంభించారు.
చదవండి: ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.10 కోట్ల వసూలు!
శనివారం దర్శి నుంచి అద్దంకి వెళ్తున్న దర్శి మండలం పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వర్రా సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7.20 లక్షలు. నిందితుడు జిల్లాలోని చీరాల, చినగంజాం, అద్దంకి, చీమకుర్తి, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలతో పాటు గుంటూరు జిల్లా వినుకొండ, నూజెండ్ల మండలాల పరిధిలో పలు మోటార్ సైకిళ్లను అపహరించాడు.
స్వాధీనం చేసుకున్న 18 ద్విచక్ర వాహనాల్లో 11 వాహనాలకు సంబంధించి వివిధ పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఏడు బైకులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎంవీఐకి సమాచారం అందించారు. నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక టీమ్‌ను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అభినందించారు. వారికి రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు దర్శి సీఐ భీమానాయక్, ఎస్‌ఐ గంగుల వెంకటసైదులు, హెడ్‌కానిస్టేబుల్ సూర్యనారాయణ, సిబ్బంది అంజిబాబు, విజయ్‌కుమార్ ఉన్నారు.
చదవండి: రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
Comments
Please login to add a commentAdd a comment