సాక్షి, శ్రీకాకుళం: పలాసలో దొంగిలించిన బైక్ రూపు రేఖలు మార్చి మూడు రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బైక్ యజమాని తెలిపిన వివరాల మేరకు.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్ పాత్రో మే 27న తన బండిని పోగొట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ప్రయోజనం లేకపోయింది.
అక్కడకు మూడు రోజుల తర్వాత ఆగ్రాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతియాబాద్ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ వాహన తనిఖీల్లో పోలీసులకు ఓ బండి దొరికిందని, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే పలాసకు చెందిన బైక్ అని నిర్ధారణ జరిగిందని వారు చెప్పారు. అయితే ఆ వాహనం ఫొటోలు చూసి ఉదయశంకర్ పోల్చుకోలేకపోయారు. తన బండి అలా ఉండదని చెప్పేశారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం ఇంజిన్ వివరాలు మీ పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు.
ట్యాంక్ కవర్ చింపేసి, అద్దాలు తీసేసి రూపురేఖలు మార్చేశారని వివరించారు. దీంతో ఆయన వెంటనే ఫతియాబాద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించి అక్కడి పోలీసులకు సీ–బుక్ చూపించడంతో వివరాలన్నీ సరిపోయాయి. దీంతో ఆయనకు ష్యూరిటీపై బైక్‌ను తిరిగి అప్పగించారు. బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగలు తెలివి మీరిపోయారని, రెండు మూడు రోజుల్లోనే బైక్ రూపురేఖలు మార్చేసి లారీలు ఎక్కించి రాష్ట్రాలు దాటించేస్తున్నారని బాధితుడు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
చదవండి: AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment