మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌ | BIKES THEIF ARREST | Sakshi
Sakshi News home page

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌

Published Wed, Jun 14 2017 1:39 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌ - Sakshi

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌

నిడదవోలు : పట్టణంలోని వివిధ కూడళ్లలో మోటార్‌ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన యువకుడిని నిడదవోలు పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై జి.సతీష్‌ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో వైఎస్సార్‌ కాలనీకి చెందిన కోయి శివప్రసాద్‌ పట్టణంలో మోటార్‌ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పట్టణంలోని బసివిరెడ్డిపేట రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి దగ్గర నిడదవోలు–తాడేపలి్లగూడెం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా పాత నేరస్తుడైన కోయి శివప్రసాద్‌ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించగా మోటార్‌ సైకిళ్లు దొంగతనం చేసినట్టు తెలిపాడన్నారు. పట్టణంలోని గణపతి సెంటర్‌లో ఈ నెల 12న డిస్కవరీ నీలంరంగు మోటార్‌ సైకిల్, అదే రోజు రాత్రి గాంధీనగర్‌లోని బార్భర్‌ షాపు తాళం పగులగొట్టి ఎల్‌ఈడీ టీవీ, షాపు ఎదురుగా ఉన్న హోండా యాక్టివా మోటార్‌ సైకిల్‌ను దొంగిలించాడు. రూ.1.30 లక్షల విలువ చేసే మోటార్‌ సైకిళ్లు, టీవీని స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. పోలీస్, క్రైమ్‌ పార్టీ సిబ్బందిని సీఐ ఎం. బాలకృష్ణ అభినందించారు.
 
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం రూరల్‌ : వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడిన ఘటనల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌.మూర్తి తెలిపారు. మంగళవారం స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మోదుగగుంట గ్రామానికి చెందిన దండ్రు వెంకన్నబాబు, దండ్రు దుర్గారావులు ఈ చోరీలకు పాల్పడ్డారన్నారు. పట్టణ శివారు కొండాలమ్మ గుడి వద్ద మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందన్నారు. కొవ్వూరు ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీ జె.వెంకట్రావు సూచనల మేరకు మోటారు సైకిళ్ల దొంగలపై నిఘా ఏర్పాటు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సమావేశంలో పట్టణ ఎస్సై చిన్నం ఆంజనేయులు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement