విశాఖ బయోమాక్స్‌లో అగ్ని ప్రమాదం | bio-diesel tanks burst at biomax company in visakha | Sakshi
Sakshi News home page

విశాఖ బయోమాక్స్‌లో అగ్ని ప్రమాదం

Published Wed, Apr 27 2016 5:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

విశాఖ బయోమాక్స్‌లో అగ్ని ప్రమాదం

విశాఖ బయోమాక్స్‌లో అగ్ని ప్రమాదం

♦ దగ్ధమైన 12 డీజిల్ ట్యాంకులు
♦ సుమారు రూ.50 కోట్ల నష్టం
♦ అర్ధరాత్రి దాటినా అదుపులోకి రాని మంటలు
 
 సాక్షి, విశాఖపట్నం, అగనంపూడి: విశాఖ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  7.30 గంటల సమయంలో ముడి ఇంధనం (డీజిల్)తో కూడిన ఓ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పదిమంది కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అనంతరం ఒక్కొక్కటిగా అక్కడ ఉన్న 11 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. సుమారు రూ.50 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.  ఒక్కో ట్యాంకులో 1,500 టన్నుల నుంచి 2,700 టన్నుల వరకు ముడి ఇంధనం ఉంది. మరో 6 ట్యాంకుల్లో తయారైన బయో డీజిల్ ఉంది.

మిషన్లతోనే ఎక్కువగా పని జరుగుతుండటం, తక్కువ మంది కార్మికులు ఉండటం, వారు కూడా బయటకు వచ్చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అన్ని ఫైర్ స్టేషన్ల నుంచి 22 ఫైర్ ఇంజన్లను రప్పించారు. హెచ్‌పీసీఎల్, స్టీల్ ప్లాంట్ల నుంచి ఫోమ్ ఫైర్ ఇంజన్లను రప్పించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ట్యాంకుల్లో ఉన్న డీజిల్ మొత్తం కాలిపోతే తప్ప మంటలు అదుపులోకి రావని అధికారులు తేల్చేశారు. 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు కనిపించాయి. బయో డీజిల్ కావడంతో పొగ కాలుష్యం భారీయెత్తున ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది.

 షార్ట్ సర్క్యూటే కారణం?
 ప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా నిర్థారణ కాలేదు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి. ఘటనా స్థలికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చారు... అనంతరం మీడియాతో  మాట్లాడారు. ప్లాంట్‌లో మొత్తం 18 ట్యాంకులు ఉన్నాయని చెప్పారు. మంటలు అదుపులోకి రావడానికి మరో ఆరు గంటల సమయం పట్టవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement