
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్
- కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సిద్దిపేట జోన్: తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. అ దిశగా కార్యకర్తల్లో మనోధైర్యం, నూతన ఉత్తేజం నింపడానికి ఈ నెల 7న ప్రధాని పర్యటన దోహదపడనుందని అన్నారు. శనివారం సిద్దిపేటలోని వీఏఆర్ గార్డెన్‌లో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2019లో తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతీ కార్యకర్త పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీపార్టీ మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నారు. మజ్లిస్‌తో టీడీపీ, కాంగ్రెస్ మాదిరే.. టీఆర్‌ఎస్‌కూడా జతకట్టిందన్నారు. మతం పేరిట విషబీజాలు నాటుతున్న ఎంఐఎం పార్టీకి దీటుగా నిలబడే ఎకైకపార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మల్లన్నసాగర్ భయం పట్టుకుందన్నారు. నియంతృత్వ వైఖరితో ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నదని, 2013 చట్టానికి భిన్నంగా 123 జీవోను తీసుకురావడం సరైంది కాదన్నారు. నిర్బంధ చర్యలు ప్రభుత్వ పతనానికి దారితీస్తాయన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి రాష్ట్రంలో బీజేపీ కాపలా కుక్కల పనిచేస్తుందన్నారు.
నరేంద్ర మోడీ ఈ నెల 7న రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడం వల్ల దక్షణాది రాష్టాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహరంపై ప్రభుత్వం స్పందించి సంబంధిత మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అనంతరం ప్రదాని జిల్లా పర్యటన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునందన్‌రావు,వంగ రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, వాసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.