ప్రతి పైసాకూ లెక్క చెబుతాం
కేంద్ర నిధులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చ పెడితే ప్రతి పైసాకు లెక్కచెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. చర్చ అసెంబ్లీలో అయినా... ఇంకా ఎక్కడైనా సరే! నిధుల లెక్క చెప్పడానికి తాము సిద్ధమని పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి కేంద్రం జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకుందన్నారు. ప్రధాని మోదీ బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధితో జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారని, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. జనాభాలో 12 శాతం ఉన్న మైనార్టీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నర్సింహ, ప్రధాన కార్యదర్శి ఎ.రవీందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు.