కేంద్ర నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి
టీఆర్‌ఎస్ నీటిబుడగలాంటిది: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రం లోని వివిధ ప్రభుత్వ శాఖలకు వచ్చిన నిధులు, వాటి వ్యయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ నేత చింతా సాంబమూర్తితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న పథకాలు రాష్ట్రంలో సరిగా అమలు కావడం లేదన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, జాతీయ రహదారుల కోసం వేలాది కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.వెయ్యి కోట్లు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ... ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం పెద్ద మొత్తంలో నిధులిచ్చిందన్నారు.
రైతులకు బేడీల ఘటనపై సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ నీటి బుడగని, వచ్చే ఎన్నికల్లో పేలిపోతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని, ‘ఒంటరిగా ఎదుగు.. ఒంటరిగా సాగు’నినాదంతో ముందుకు సాగుతామని చెప్పారు. పేద ముస్లింల సహకారంతో హైదరాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29 నుంచి జూన్ 17 వరకు ‘పల్లె పల్లెకూ బీజేపీ, ఇంటింటికీ మోదీ’ చేపడుతున్నామన్నారు.