మిర్చి రైతుపై మొసలి కన్నీరు
బీజేపీ తీరుపై మండిపడిన ఎమ్మెల్సీ కర్నె
సాక్షి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న మిర్చి రైతుకు సాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవ హరించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు గాయం చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. మిర్చి రైతులను నిండా ముంచినందుకు సిగ్గు పడకుండా బీజేపీ నేతలు రైతుల సమస్యలపట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ కోణంలో ఉన్నాయే తప్ప రైతులకు ఏమాత్రం మేలు చేసేవిగా లేవని విమర్శించారు.
కేంద్రం బాగా సాయం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సద్వి నియోగం చేసుకోవడం లేదన్నట్లుగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దత్తాత్రేయ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ‘రైతులు తిన్నది అరగక ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అని అన లేదా? ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి నపుంసకత్వం, ప్రేమ వ్యవ హారాలే కారణమని అన్నదాతలను ఘోరంగా అవమానించలేదా? అని కర్నె నిలదీశారు. బీజేపీ నాయకులకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఇక్కడ వీధుల్లో విన్యాసాలు చేయకుండా ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రధాని మెడలు వంచి మిర్చి రైతులకు న్యాయం చేయాలని సవాలు చేశారు.
కాషాయ జెండాను విస్తరించుకునే క్రమంలోనే బీజేపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విజయ్ మాల్యా మీద ఉన్న ప్రేమ... రైతుల మీద లేకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు, ఖమ్మం రైతులకు బేడీలు వేసిన ఘటనకు ముడిపెట్టడం సబబు కాదని, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటనను టీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన స్పష్టం చేశారు.